
మిస్ ఇండియా ఎవరు?
‘‘ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి మిస్ ఇండియా అవ్వాలనుకుంటుంది. అందుకు తను ఎటువంటి సాహసం చేసింది? చివరికి మిస్ ఇండియా అయిందా? లేదా? అనే కథాంశంతో మా చిత్రం ఉంటుంది’’ అని దర్శక–నిర్మాత తాడి మనోహర్ కుమార్ అన్నారు. రవితేజ, వీరంరెడ్డి, శిరీష, తాడి మనోహర్ ముఖ్యపాత్రల్లో షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై మనోహర్ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ ఇండియా’ తాడి మనోహర్ మాట్లాడుతూ– ‘‘ఒక మనిషికి డబ్బు అవసరమైతే ఏ పని చేసేందుకైనా సిద్ధపడతాడని మా చిత్రంలో ప్రధానంగా చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలుంటాయి.
తెలుగమ్మాయి శిరీషకు ఈ చిత్రం ద్వారా హీరోయిన్ అవకాశం కల్పించా’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో ఓ మధ్య తరగతి మహిళగా నటిస్తున్నా. చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర చేసే అవకాశం నాకు వచ్చింది’’ అని సీనియర్ నటి కవిత అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వై.వి. నవీన్, సంగీతం: సునీల్ కశ్యప్, సమర్పణ: సహస్ర ప్రియ.