శ్వేతాబసుకు ఏదైనా.. జరిగితే బాధ్యులెవరూ?
శ్వేతాబసుకు ఏదైనా.. జరిగితే బాధ్యులెవరూ?
Published Tue, Sep 9 2014 5:29 PM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
సినీతార శ్వేతాబసు ఉదంతంపై మీడియా కథనాలు, సోషల్ మీడియాలో కామెంట్స్ పై అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్వేతాబసు అంశం మీడియాలో వస్తున్న కథనాలపై తాజాగా టెలివిజన్ సీరియల్ కహానీ ఘర్ ఘర్ కి లో ఆమెకు తల్లిగా నటించిన సాక్షి తన్వర్ ఘాటుగా స్పందించింది. ఈ వ్యవహారంలో శ్వేతాబసును ఒక్కరినే బలి పశువును చేశారని, ఆ క్షణంలో పట్టుబడ్డ బిజినెస్ మెన్ వదిలి వేయడంపై అనేక సందేహాల్ని, అనుమానాల్ని తన్వర్ వ్యక్తం చేశారు. ఈ కేసులో వదిలివేయబడిన బిజినెస్ మెన్ ఎవరో తెలుసుకోవాలని తనకు ఆసక్తి లేదని.. అయితే ఆ వ్యాపారికి సంబంధించిన కుటుంబాలు, తల్లి, కూతుర్లు, సోదరి, భార్య, స్నేహితులకు ఆయన నిజస్వరూపం తెలిసే అవకాశం ఉండేదని సాక్షి తన్వర్ అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా ఎంతో సున్నితమైన అంశాన్ని మీడియా హ్యాండిల్ చేసిన తీరుపై తన్వర్ అసంతృప్తిని వెల్లగక్కారు. ఇలాంటి సెన్సెషనల్ అంశంపై సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా అభిప్రాయం చెప్పిన వారు శ్వేతాబసు కోణంలో ఎందుకు చూడటం లేదని ఆమె ప్రశ్నించారు. రిమాండ్ హోమ్ కస్టడీలో ఉన్న తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడించిన తీరును ధైర్యంగా మెచ్చుకోవాల్సిందే.
టెలివిజన్ సీరియల్ లో తల్లిగా తనకు శ్వేతాబసుతో ఓ ప్రత్యేక అనుబంధమున్న కారణంగా ఆమెతో మాట్లాడాటానికి... కలువడానికి ప్రయత్నించాను. అయితే అది కుదరలేదు. దాంతో శ్వేతాబసు తల్లితో మాట్లాడాను. అయితే రిమాండ్ హౌజ్ లో శ్వేతాబసును సొంత తల్లినే కలువడానికి నిరాకరించారని ఎంత మందికి తెలుసు? రిమాండ్ హౌజ్ లో ఉన్న యువతులు, మహిళలకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పించే పనిలో శ్వేతాబసు నిమగ్నమయ్యారనే విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్వేతాబసు తల్లి పడుతున్న ఆవేదన ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలాంటి కేసులో పేర్లను గోప్యంగా ఉంచాలనే నిబంధనల్ని ఉల్లంఘించడం ఎంత వరకు సబబు? తన కూతురు క్రిమినల్ కాదు.. మీడియా కథనాలకు మనస్తాపం చెంది తన కూతురు ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడితే దానికి ఎవరూ బాధ్యత వహిస్తారు? అని ఓ తల్లి లేవనెత్తే ప్రశ్నకు ఎవరు జవాబిస్తారు.
శ్వేతాబసు ఉదంతంపై లెక్కలేనన్ని కథనాల్ని వెల్లడించిన మీడియా.. పట్టుబడ్డ వ్యాపారి ఎవరో పోలీసులు ఎందుకు బయటపెట్టలేదు? శ్వేతాబసుపై లేని సానుభూతి ఆ వ్యాపారిపైనే ఎందుకని సాక్షి తన్వర్ ప్రశ్నించారు. ఓ నటి, సెలబ్రిటీ అనే ఒక్క కారణంతో నానా రకాలుగా కథనాల్ని అల్లడం భావ్యమా? బాధ్యాతయుతమైన మన పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు? తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు రేపిస్టులకు, హంతకులకు స్వేచ్చ కల్పిస్తున్న మనదేశంలో..కేవలం శ్వేతాబసు విషయంలో ఎందుకు నిబంధనల్ని తుంగలో తొక్కారు? చాలా సెన్సిటివ్ విషయాన్ని బజారుకీడ్చారు? అనే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని సాక్షి తన్వర్ ప్రశ్నల రూపంలో ఆవేదన వ్యక్తం చేసింది. సాక్షి తన్వర్ సంధించిన ప్రశ్నలకు మనవద్ద సమాధానం ఉందా అని దర్శకుడు రాజమౌళి కూడా ట్విటర్ లో ఓ వ్యాసాన్ని ట్వీట్ చేశారు.
Advertisement
Advertisement