నిజానికి ఎవర్ని ప్రేమించాలి?
అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమించాలి. అబ్బాయిలు అమ్మాయిల్ని ప్రేమించాలి. కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా అబ్బాయిలూ అమ్మాయిలూ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. అప్పుడే వారి ప్రేమకు నిజమైన దీవెనలు లభిస్తాయి. ఇలాంటి సందేశంతో తమిళంలో రూపొందిన ప్రేమకథ ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట ఓ సంచలనం.
యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత సురేష్ కొండేటి. గతంలో ఆయన అందించిన ప్రేమిస్తే, షాపింగ్‌మాల్, జర్నీ, నాన్న, పిజ్జా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. వాటి వరుసలోనే ఈ సినిమా కూడా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు సురేష్.
ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ -‘‘మా సంస్థలో వచ్చిన ‘ప్రేమిస్తే’ చిత్రం నాకు ఎంత మంచి పేరు తెచ్చిందో... అంతకు పదింతలు పేరు తెచ్చిపెట్టే సినిమా ఇది. ‘ప్రేమిస్తే’ని మరిపించేలా దర్శకుడు సుశీంద్రన్ ఈ చిత్రాన్ని మలిచారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. వచ్చే వారంలో పాటలను, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.