‘‘ఒక హీరో చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంటే... మీ కమ్‌బ్యాక్ ఎప్పుడు? అని ఆ హీరోని ఎవరూ అడగరు. కానీ అదే ఒక హీరోయిన్ కాస్త బ్రేక్ తీసుకుంటే చాలు.. మీ కమ్‌బ్యాక్ ఎప్పుడు? అనే ప్రశ్నను పదే పదే అడుగుతారు. ఒక వర్కింగ్ ఉమెన్‌ను అలా అడగటం మానేయండి’’ అన్నారు నటి మాధురీ దీక్షిత్. 1999లో శ్రీరామ్ నేనేను వివాహం చేసుకున్న మాధురి సినిమాలను తగ్గించారు. 2007లో ‘ఆజా నాచ్‌లే’ సినిమా తర్వాత మాధురి తిరిగి సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత అడపాదడపా అతిథి పాత్రలు మాత్రమే చేశారు. గత నెల విడుదలైన ‘టోటల్ ధమాల్’ సినిమాలో ఆమె ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేశారు.
ఈ సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారని మాధురితో ఎవరో అన్నారట. అంతే.. ఆమె అసహనం వ్యక్తం చేశారు. ‘‘నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్నేళ్లు నేను సినిమాలు చేయలేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఇండస్ట్రీకి దూరం కాలేదు. సినిమాలకు దూరం కానప్పుడు ఇక కమ్‌బ్యాక్ అనే ప్రసక్తి ఎందుకు? నా వైవాహిక బంధాన్ని ఆస్వాదించాలనుకున్నాను. నా కుటుంబసభ్యులతో, నా పిల్లలతో సరదాగా కొంత కాలం గడపాలనుకున్నాను. అందుకే సినిమాలు ఒప్పుకోలేదు. ప్రొఫెషనల్ లైఫ్‌కి కొంత గ్యాప్ ఇస్తే ‘మీ కమ్‌బ్యాక్ ఎప్పుడు?’ అని అడగడమేనా?’’ అని అసహనం వ్యక్తం చేశారు మాధురీ దీక్షిత్.
Comments
Please login to add a commentAdd a comment