బాహుబలి.. కట్టప్ప.. ఓ ట్విస్ట్..!
హైదరాబాద్: ఈ దశాబ్దం ప్రశ్నగా మారిన 'బాహుబలి హత్య'ను రచయిత విజయేంద్ర ప్రసాద్ మరో మలుపు తిప్పారు. 'బాహుబలి' బతికే ఉండొచ్చని చెప్పి మరింత ఆసక్తి రేకెత్తించారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బాహుబలి'కి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు.
భీష్ముడి స్ఫూర్తితో కట్టప్ప పాత్రకు ప్రాణం పోసినట్టు చెప్పారు. శివగామిలో కైకేయి, గాంధారి, కుంతి పాత్రల తాలూకు ఛాయలు కన్పిస్తాయన్నారు. బిజ్జలదేవ పాత్రకు శకుని, భల్లాలదేవ పాత్రకు రావణ, దుర్యోధనులు, బాహుబలి పాత్రకు రాముడు, అర్జునుడు స్ఫూర్తి అని వెల్లడించారు. 'బాహుబలి' ఘన విజయంతో సీక్వెల్ ఎటువంటి మార్పులు చేయడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 'బాహుబలి' విడుదలకు ముందే పూర్తి స్క్రిప్ట్ రాయడం పూర్తి చేశానని పేర్కొన్నారు.
'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడని ప్రశ్నించగా తనదైన శైలిలో జవాబిచ్చారు. 'బాహుబలి' హత్యకు గురైయ్యాడని ఎందుకు భావిస్తున్నారని ఎదురు ప్రశ్నించారు. 'బాహుబలి' బతికివుండే అవకాశం కూడా ఉందని చెప్పి సస్పెన్స్ మరింత పెంచారు. ఇప్పటివరకు బాహుబలిని కట్టప్ప చంపేశాడని భావిస్తున్న వారంతా ఇప్పుడు అతడు బతికివున్నాడా, లేదా అనే ప్రశ్న ఎదుర్కొంటున్నారు. దీనికి సమాధానం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న లభించనుంది.