అత్తారింటికి వంద కోట్లు చేరేనా! | Will Attarinitiki Daaredi collect 100 Crores | Sakshi
Sakshi News home page

అత్తారింటికి వంద కోట్లు చేరేనా!

Published Fri, Nov 15 2013 5:29 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

అత్తారింటికి వంద కోట్లు చేరేనా! - Sakshi

అత్తారింటికి వంద కోట్లు చేరేనా!

తెలుగు చలన చిత్రసీమలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఓ ట్రెండ్ సెట్టర్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, త్రివిక్రమ్ మాటలు, పవన్ స్టైల్స్, నటన భారీ కలెక్షన్లు కొల్లగొట్టేలా చేశాయి. విడుదలైన రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా 'అత్తారింటికి దారేది' సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
సెప్టెంబర్ 27 తేదిన విడుదలైన చిత్ర నవంబర్ 15న 50 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవానికి పరుగులు పెడుతోంది. విడుదలైన తొలిరోజుల్లో వచ్చిన కలెక్షన్లను చూసి  వంద సంవత్సరాల సినీ చరిత్రలో వంద కోట్లు వసూలు చేసే తొలి చిత్రంగా 'అత్తారింటికి దారేది'పై ఆశలు పెట్టుకున్నారు. అయితే మొదట్లో ఉన్న కలెక్షన్ల ఊపు తర్వాత లేకపోవడంతో వంద కోట్ల వసూలు చేస్తుందా అనే ప్రశ్న రేకేత్తింది. 
 
170 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న అత్తారింటికి దారేది చిత్రం 73.90 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం వంద రోజుల దిగ్విజయంగా  పూర్తి చేసుకోగలిగితే ఇంకా 26.10 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వంద కోట్లు సాధించే క్రమంలో అభిమానులను ఆకట్టుకోవడానికి ఆరు నిమిషాల నిడివి ఉన్న సీన్లను కొత్తగా చేర్చినా అంతగా ఆకర్షించలేకపోయింది. 
అయితే ఈ చిత్రం హౌజ్ ఫుల్ కలెక్షన్లను కూడా సాధించకపోవడంతో వంద కోట్ల రికార్డు కోసం మరికొంత సమయం ఆగాల్సిందేనా అనే సందేహం మొదలైంది. ఈ అరుదైన ఫీట్ ను సాధించాలంటే ఏదైనా కొత్తగా ప్రచారాన్ని చేపడితే బాగుందని ట్రేడ్ అనలిస్టుల అభిప్రాయం. 
 
ఆరంభంలో ఈ చిత్ర సాధించిన కలెక్షన్ల ఊపు చూసి వంద కోట్లు సాధించడం సులభమే అనే నమ్మకం కలిగింది. అయితే బ్లూరే ప్రింట్ తో సినిమా ఇంటర్నెట్ లో లభ్యం కావడంతో ఈ చిత్రానికి రిపీట్ ఆడియెన్స్ కరువయ్యారు. కంప్యూటర్స్, ల్యాప్ టాప్, ఐపాడ్ లలో లోడ్ చేసుకుని అభిమానులు, ప్రేక్షకులు వంద కోట్ల రికార్డుపై అనుమానాలు తలెత్తడానికి కారణమయ్యారు. పైరసీ లేకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే వంద కోట్లు మించి ఉండేదనే భావన కూడా కొందర్నిలో ఉంది. ఏదిఏమైనా తెలుగు ప్రేక్షకులతో ఆలరించిన అత్తారింటికి దారేది చిత్రం బాలీవుడ్ పరిశ్రమ చూపును కూడా తనవైపు తిప్పుకుంది. అంతేకాకుండా సినీ చరిత్రలో తెలుగు సత్తాను చాటిన ఈ చిత్రం వందకోట్లు మార్కును సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement