Attarintiki Daaredi
-
తెలుగు తెరపై ‘త్రివిక్రమ్’ మాటల మంత్రం
మాటలతో మంత్రం వేసి...డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం ఆయనకి మాత్రమే సాధ్యం. పాత్రల మధ్య పంచ్ డైలాగులతో నవ్వించాలన్నా....అనుబంధాల గురించి గుండె బరువెక్కే మాటలు రాయాలన్నా అది ఆయన కలానికి మాత్రమే సాధ్యం. ‘తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది......మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి..కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. ’లాంటి ఎన్నో డైలాగులు ఆయన గుండె లోతుల్లోంచి రాసుకున్నవే. సినిమా చూస్తున్నంత సేపు మనల్ని కదలించే ఎన్నో సీన్లు...సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుడి మదిలో కదలాడుతూనే ఉంటాయి. అయన డైలాగుల్లో పంచ్ ఉంటుందని అంటారు కానీ, జీవితం ఉంటుందంటారు ఆయన అభిమానులు. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.... -
కోలీవుడ్‌కు ప్రేమతో..!
ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవ్వటం చాలా కాలంగా జరుగుతోంది. ఇటీవల తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను తమిళ నాట రీమేక్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ శింబు హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ టెంపర్‌ను అయోగ్య పేరుతో విశాల్ హీరోగా ప్రారంభించారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సినిమా చేరింది. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించిన ఈ సినిమా కోలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఓ స్టార్ హీరో ఈ రీమేక్‌లో నటించనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
‘లైకా’ చేతికి ‘అత్తారింటికి దారేది’!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ టాలీవుడ్లో ట్రెండ్‌సెట్ చేసింది. అప్పటివరకు ఉన్న రికార్డులన్నంటిని బద్దలు కొట్టింది. సినిమా విడుదలకు ముందే పైరసీలో బయటకు వచ్చినా.. కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకెళ్లింది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ఈ సినిమా నిరూపించింది. పవన్ నటన, త్రివిక్రమ్ మాటలు ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళ్లో రీమేక్ కాబోతోంది. ఈ మూవీ తమిళ్ రైట్స్ లైకా చేతికి వచ్చినట్లు.. అందుకు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు అంటూ ఈ సంస్థ ట్విటర్లో పేర్కొంది. తమిళ్ వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. We are very happy to announce that we have acquired the Tamil Remake Rights of the Mega Telugu Blockbuster #AttarintikiDaredi ! More exciting updates on this Coming Up! Big Thank You to #TrivikramGaru — Lyca Productions (@LycaProductions) July 30, 2018 -
పవన్ కళ్యాణ్ అత్తా మజాకా!
ఒకప్పుడు హీరోయిన్స్‌గా దుమ్మురేపిన అందగత్తెలు కొంతకాలం తెరమరుగై మళ్లీ ఏదో ఒక రకమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు. కొందరు అత్త, అక్క, వదిన .... వంటి పాత్రలలో బాగానే రాణిస్తున్నారు. అలా వచ్చినవారికి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అటువంటివారిలో ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ సినిమాలను ఓ ఊపు ఊపేసిన నదియా ఒకరు. నదియా ఇప్పుడు కొత్త తరహా పాత్రలతో బిజీబిజీగా ఉన్నారు. టాప్ హీరోయిన్గా తన తళుకుబెళుకులు ప్రదర్శించిన నదియా ఇప్పుడు ఈ వయసులో కూడా గ్లామరస్‌గా కనిపించడం ఆమెకు ప్లస్ అయింది. ఓల్డ్ బ్యూటీ నదియా సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా గోల్డెన్ ఆఫర్స్ కొట్టేస్తున్నారు. వయసు మళ్లుతున్నా ఫిట్‌నెస్‌లో నదియా ఫర్ఫెక్ట్గా ఉన్నారు. అందరినీ అకట్టుకుంటున్నారు. 'మిర్చి'లో ప్రభాస్‌కు తల్లిగా, అత్తారింటికి దారేదిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అత్తగా నటించి మెప్పించారు. మంచి మార్కులు కొట్టేశారు. ఈ చిత్రంలో ఆమె అద్బుతంగా తన నటనను ప్రదర్శించారు. ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అత్తారింటికి దారేది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు అవకాశాలకు కొదవలేదు. తెలుగులో ప్రముఖ హీరోలకు అమ్మ, అత్తగా నటించిన నదియా ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో నిర్మించే 'ఆగడు'చిత్రంలో మహేష్ బాబుకు అక్కగా నటిస్తోంది. మోహన్‌లాల్ హీరోగా మళయాలంలో సూపర్ హిట్ట్ అయిన 'ద్రిష్యుం' అనే చిత్రాన్ని తెలుగులో 'దృశ్యం' పేరుతో రీమేక్ చేస్తున్నారు. చంటి, చినరాయుడు, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, రాజా, శీను, జెమిని, ఘర్షణ, బాడీగార్డ్, మసాలా... వంటి రీమేక్ చిత్రాలతో విజయాలను తన సొంతం చేసుకున్న వెంకటేష్ ఇందులో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నదియా నటించబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ సినిమాకు అలనాటి మరో హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వం వహించడం మరో విశేషం. ఈ సినిమా తమిళ వెర్షన్లో కూడా నదియా కమల్‌హాసన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు కోలీవుడ్ సమాచారం. నదియా మరో మళయాల చిత్రంలో కూడా కొత్త తరహా పాత్రలో నటించబోతోంది. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే చిత్రంలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఆఫర్ల మీద ఆఫర్లు రావడంతో నదియా తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసినట్లు సినీవర్గాల సమాచారం. రీఎంట్రీలో కూడా తన సత్తాచాటుతూ నదియా ఫుల్ బిజీ అయ్యారు. -
పవన్ కళ్యాణ్ ను అనుకరించిన అన్నయ్య!
సంచలన విజయంతోపాటు రికార్డుల కలెక్షన్లతో దూసుకుపోతున్న అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ విభిన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నసంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను ఆయన సోదరుడు నాగబాబు అనుకరించనున్నాడు. త్వరలో విడుదల కానున్న 'చూసినోడికి చూసినంత' అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను పోలివుండే కారెక్టర్ ను నాగబాబు పోషిస్తున్నారని చిత్ర దర్శకుడు అనిల్ వాటుపాలి తెలిపారు. ఈ చిత్రంలో పవన్ పేరుతో ఉండే పాత్రను ఈ చిత్రంలో నాగబాబు చేస్తున్నారని.. ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ పాత్రతో పోలివుండే లుక్ ను షూట్ చేశామన్నారు. కేవలం వినోదం కోసమే నాగబాబుతో ఈ పాత్రను చేయిస్తున్నామని.. అభిమానులు మరోలా భావించకూడదు అని అనిల్ అన్నారు. ఈ పాత్రలో నటించేటప్పుడు నాగబాబు ఎంజాయ్ చేశారు అని తెలిపారు. ఈ చిత్రంలో శివాజీ, కృష్ణుడు, నిత్యాలు ప్రధాన పాత్రలో నటించారు. -
అత్తారింటికి వంద కోట్లు చేరేనా!
తెలుగు చలన చిత్రసీమలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఓ ట్రెండ్ సెట్టర్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, త్రివిక్రమ్ మాటలు, పవన్ స్టైల్స్, నటన భారీ కలెక్షన్లు కొల్లగొట్టేలా చేశాయి. విడుదలైన రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా 'అత్తారింటికి దారేది' సరికొత్త రికార్డును నెలకొల్పింది. సెప్టెంబర్ 27 తేదిన విడుదలైన చిత్ర నవంబర్ 15న 50 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవానికి పరుగులు పెడుతోంది. విడుదలైన తొలిరోజుల్లో వచ్చిన కలెక్షన్లను చూసి వంద సంవత్సరాల సినీ చరిత్రలో వంద కోట్లు వసూలు చేసే తొలి చిత్రంగా 'అత్తారింటికి దారేది'పై ఆశలు పెట్టుకున్నారు. అయితే మొదట్లో ఉన్న కలెక్షన్ల ఊపు తర్వాత లేకపోవడంతో వంద కోట్ల వసూలు చేస్తుందా అనే ప్రశ్న రేకేత్తింది. 170 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న అత్తారింటికి దారేది చిత్రం 73.90 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం వంద రోజుల దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగితే ఇంకా 26.10 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వంద కోట్లు సాధించే క్రమంలో అభిమానులను ఆకట్టుకోవడానికి ఆరు నిమిషాల నిడివి ఉన్న సీన్లను కొత్తగా చేర్చినా అంతగా ఆకర్షించలేకపోయింది. అయితే ఈ చిత్రం హౌజ్ ఫుల్ కలెక్షన్లను కూడా సాధించకపోవడంతో వంద కోట్ల రికార్డు కోసం మరికొంత సమయం ఆగాల్సిందేనా అనే సందేహం మొదలైంది. ఈ అరుదైన ఫీట్ ను సాధించాలంటే ఏదైనా కొత్తగా ప్రచారాన్ని చేపడితే బాగుందని ట్రేడ్ అనలిస్టుల అభిప్రాయం. ఆరంభంలో ఈ చిత్ర సాధించిన కలెక్షన్ల ఊపు చూసి వంద కోట్లు సాధించడం సులభమే అనే నమ్మకం కలిగింది. అయితే బ్లూరే ప్రింట్ తో సినిమా ఇంటర్నెట్ లో లభ్యం కావడంతో ఈ చిత్రానికి రిపీట్ ఆడియెన్స్ కరువయ్యారు. కంప్యూటర్స్, ల్యాప్ టాప్, ఐపాడ్ లలో లోడ్ చేసుకుని అభిమానులు, ప్రేక్షకులు వంద కోట్ల రికార్డుపై అనుమానాలు తలెత్తడానికి కారణమయ్యారు. పైరసీ లేకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే వంద కోట్లు మించి ఉండేదనే భావన కూడా కొందర్నిలో ఉంది. ఏదిఏమైనా తెలుగు ప్రేక్షకులతో ఆలరించిన అత్తారింటికి దారేది చిత్రం బాలీవుడ్ పరిశ్రమ చూపును కూడా తనవైపు తిప్పుకుంది. అంతేకాకుండా సినీ చరిత్రలో తెలుగు సత్తాను చాటిన ఈ చిత్రం వందకోట్లు మార్కును సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. -
పవన్ కళ్యాణ్ వైపు బాలీవుడ్ చూపు!
తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్ర కలెక్షన్లు బాలీవుడ్ పరిశ్రమ ప్రముఖులను, విశ్లేషకులను దిమ్మతిరిగేలా చేశాయి. అత్తారింటికి దారేది చిత్రం బాలీవుడ్ చిత్రాలు రణబీర్ కపూర్ నటించిన 'యే జవానీ హై జిందగీ', షారుఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రాలకు ధీటుగా కలెక్షన్లను కురిపించింది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ లో తాజాగా పవన్ కళ్యాణ్ హాట్ హాట్ గా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత, ప్రణీత లతో పవన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని మూటగట్టుకుంది. ఓవర్సీస్ మార్కెట్ లో పవన్ చిత్రం సుమారు 16 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ అనలిస్టుల సమాచారం. కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే పది రోజుల్లోనే 40 కోట్ల రూపాయల షేర్ ను సాధించడం భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ స్టామినాను అంచనా వేసిన బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు ద్విభాషా చిత్రాల్లో నటింపచేయాలని ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తొంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను సంప్రదించేందుకు తమ వంతు ప్రయత్నాల్ని ప్రారంభించారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఓవర్సీస్, దక్షిణాది మార్కెట్ లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ కన్నేసిందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇటీవలే బాలీవుడ్ లో జంజీర్ చిత్రం ద్వారా రాంచరణ్ ఎంట్రీ ఇచ్చి.. ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ పై పవన్ ఆసక్తిని ప్రదర్శిస్తాడా అనేది సందేహమే. దక్షిణాదిలో ఇప్పటికే ఓ రేంజ్ ను సొంతం చేసుకున్న పవన్.. హిందీ చిత్ర సీమలో ప్రవేశించడం ద్వారా తనకున్న క్రేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే. -
తమిళంలో 'అత్తారింటికి దారేది' రీమేక్?
రికార్డు స్థాయి కలెక్షన్ల దిశగా దూసుకెళ్లిపోతున్న 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేయనున్నారు. ఇప్పటివరకు ఎవరూ రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేయలేదు గానీ, చాలామంది మాత్రం ఇందుకు ఆసక్తి చూపిస్తున్నారని సినిమా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు తెలిపాయి. తమిళంలో ప్రముఖ నిర్మాత ఒకరు దీనిపై బాగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడవుతుందని అంటున్నారు. తమిళ నటుడు విజయ్ ఈ రీమేక్ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అయితే ఇంకా ఈ విషయం చర్చల దశలోనే ఉన్నందున దీని గురించి అప్పుడే ఏమీ చెప్పలేమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బహుశా రెండు వారాల్లో దీని గురించిన స్పష్టత రావచ్చు. ఇంతకు ముందు ఒక్కడు, పోకిరీ, అతనొక్కడే, నువ్వునాకు నచ్చావు లాంటి సినిమాల తమిళ రీమేక్‌లలో విజయ్ నటించాడు. సెప్టెంబర్ 27న విడుదలైన 'అత్తారింటికి దారేది' ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జల్సా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాణ్ జోడీగా వచ్చిన ఈ సినిమా అమెరికాలోనూ హల్చల్ చేస్తోంది. -
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టకపోతే ఓ పెద్ద ఇడియట్: వర్మ
అత్తారింటికి దారేది చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అత్తారింటికి దారేది చిత్రం ద్వారా గొప్ప విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజల కోసం రియలైజ్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. పవన్ కళ్యాణ్ ప్రజలు ఎంతగా ఇష్టపడుతున్నారో అనేక రుజువులు కళ్లముందు కదలాడుతున్నాయి. ఐనా ప్రజల కోసం సంసిద్ధుడై రాజకీయ పార్టీని ప్రారంభించక పోతే ఓ పెద్ద ఇడియెట్ గా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. గత 40 సంవత్సరాల్లో చిరంజీవి సంపాదించుకున్నమెగాస్టార్ హోదాను పవన్ కళ్యాణ్ అధిగమించాడని, పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ లాంటి బిరుదులు చాలా తక్కువ హోదా అని.. పవర్ స్టార్ అనే హోదాని సునామీ స్టార్ అని మార్చుకోవాలని సూచించారు. అంతేకాకుండా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తన జీవిత కాలంలో సాధించే కలెక్షన్లు అత్తారింటికి దారేది మూడు రోజులు వసూలు చేసిన కలెక్షన్లతో సమానం...ప్రపంచంలో చాలా చోట్ల చెన్నై ఎక్స్ ప్రెస్ సృష్టించిన రికార్టులను అత్తారింటికి దారేది చిత్రం అధిగమించింది అని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశాడు. ఇంకా భారతీయ చలన చిత్రసీమ చరిత్రలో తొలిసారి హాలీవుడ్ చిత్ర కంపెనీలు అత్తారింటికి దారేది అనే తెలుగు చిత్రంపై దృష్టిని పెట్టాయని.. తన జీవిత కాలంలో ఏ చిత్రం కూడా ఇవ్వని షాక్ ను అత్తారింటికి దారేది చిత్రం కలెక్షన్లు ఇచ్చాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తనతో అన్నట్టు.. అత్తారింటికి దారేది చిత్రం హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా వసూళ్లను కురిపిస్తోందని ..దరిదాపులో బాలీవుడ్ చిత్రాలే లేవని వర్మ ట్వీట్ చేశాడు. త్వరలోనే తాను అమెరికాలో అత్తారింటికి దారేది చిత్రం వసూలు చేసిన కలెక్షన్లను అందిస్తానని తరణ్ ఆదర్శ్ చెప్పిన విషయాన్ని.. ఆ కలెక్షన్ల రికార్డులు అందర్ని షాక్ గురిచేస్తాయని...తరణ్ ఆదర్శ్ రిపోర్ట్ తో ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖుల దృష్టి అంతా అత్తారింటికి దారేది చిత్రంపై ఉందని వర్మ తన ట్వీట్స్ లో పేర్కోన్నారు. "@taran_adarsh:Top 3 openers in USA in 2013: ChennaiExpress$2.22 million, YJHD $ 1.56 million,#AttarintikiDaredi $ 1.52 mn/$ 1.74 million" — Ram Gopal Varma (@RGVzoomin) October 1, 2013 Even after this proof of how much people love him if kalyan still doesnt start his own party he will be the biggest idiot — Ram Gopal Varma (@RGVzoomin) October 1, 2013 I just hope that pawan kalyan realises that this earth shattering success is not becos of him but it is becos of peoples love towards him — Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2013 I am told tht becos of the enoromous collections american distributors nd theatre owners r learning 2 pronounce Attarintiki daaredi right — Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2013 For the first time in indian film history I am told hollywood film companies are tracking the telugu film Attarintiki Daaredi collections — Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2013 Life time collections of seethamma vaakitlo sirimalle chettu will be lesser than 3 day collections of Attharintiki daaredi — Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2013 Pawan kalyan achieved the peak of himalaya whereas chiranjeevigaru after 40 years is still at the base of that mountain — Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2013 -
అమెరికాలో అత్తారింటికి కలెక్షన్ల జోరు
సగం సినిమా లీకేజి.. పైరసీ సీడీల హడావుడితో ఒక్కసారిగా సంచలనంగా మారిన 'అత్తారింటికి దారేది' సినిమా కేవలం మన దేశంలోనే కాదు.. అమెరికాలో కూడా కలెక్షన్ల విషయంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 22 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. ఇక అమెరికాలో అయితే మొదటి వారాంతంలోనే 9.53 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే మొదటి మూడు రోజుల్లో మన రాష్ట్రంలో వచ్చిన వసూళ్లలో సగం మొత్తం అమెరికాలో కూడా వచ్చిందన్న మాట. ఇప్పటివరకు అమెరికాలో ఉన్న రికార్డుల చరిత్రను 'అత్తారింటికి దారేది' తిరగరాసింది. సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ వారాంతంలో టాప్ 15 సినిమాల్లో దీనిదే అగ్రస్థానమని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. విదేశాల్లో హిందీ సినిమాలు మొత్తం తమ జీవితకాలంలో సాధించలేని మొత్తాన్ని అత్తారింటికి సినిమా మూడు రోజుల్లోనే సాధించిందని చెప్పారు. ఇది కేవలం తెలుగు సినీ పరిశ్రమకే కాదు.. హిందీ చిత్ర పరిశ్రమకు కూడా కళ్లు తెరిపించాలని వ్యాఖ్యానించారు. -
'అత్తారింటికి దారేది' కలెక్షన్ల సునామీ
ఓ వైపు విడుదలకు ముందే పైరసీ సీడీ మార్కెట్లోకి రావడం, మరోవైపు సినిమా అడ్డుకుంటామన్న హెచ్చరికలు.. ఇలా ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేది' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే 22 కోట్లకుపైగా వసూళ్లు రావడం విశేషం. ఆంధ్ర బాక్సాఫీసు డాట్ కమ్ వెబ్సైట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రాంతాల వారీగా నైజాంలో 7.80 కోట్లు, సీడెడ్‌లో 4.48 కోట్లు, వైజాగ్‌లో 2.20 కోట్లు, గోదావరి జిల్లాల్లో 3.20 కోట్లు, కృష్ణాలో 1.53 కోట్లు, గుంటూరులో 2.27 కోట్లు, నెల్లూరులో 1.03 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటకలో 2.65 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో కోటి, అమెరికాలో 6.5 కోట్లు, ఇతర దేశాల్లో 0.90 కోట్లు వసూలు చేసింది. త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగినట్టే అభిమానులను అలరిస్తోంది. సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. పవన్ అభినయం, పాటలు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. పవన్ సరసన సమంత, ప్రణీత నటించారు. -
సోషల్ మీడియాలోనూ అత్తారింటికి దారేది కిర్రాక్...
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లది క్రేజి కాంబినేషన్. పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన జల్సా సూపర్ హిట్ గా నిలిచింది. జల్సా తర్వాత పవన్, త్రివిక్రమ్ లు కలిసి తాజాగా చేసిన సినిమా అత్తారింటికి దారేది. ఈ చిత్రం సెప్టెంబర్ 27 తేదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చిత్రానికి తొలి ఆట నుంచి ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. సోషల్ మీడియా వెబ్ సైట్లో అత్తారింటికి దారేది చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Got my tickets for Atharintiki Daaredi for tomorrow. All the people who tried to destroy the film by leaking it, go to hell. #ihatepiracy — Siddharth (@Actor_Siddharth) September 26, 2013 After my tweet about Gabbar Singh, here’s my tweet for AD. Records run for cover. You’re going to be crushed by the power. Blockbuster film! — Siddharth (@Actor_Siddharth) September 27, 2013 Hearing fantastic reports of atharintiki daredi/congratulations to the whole team....way to go!! — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 27, 2013 Congrats to the one and only power star ! AD emerges from all the nonsense piracy problems. The industry needs it. Congrats to trivikram sir — Akhil Akkineni (@AkhilAkkineni8) September 27, 2013 #AtharintikiDaredi yipeeee. Hearing fantastic things abt the movie. I'm on my way to see it now :) — Lakshmi Manchu (@LakshmiManchu) September 27, 2013 Irony is that all concerned condemning attharintiki daaredi piracy are actually giving publicity to the fact that its avilable on line — Ram Gopal Varma (@RGVzoomin) September 23, 2013 మావాడు తన నటనతో నవ్వించి కన్నీళ్ళు తెప్పించాడు, ఏడ్పించి కన్నీళ్ళు పెట్టించాడు.. తనకు తనే పోటి తనకు తనే సాటి అనిపించాడు!! — kona venkat (@konavenkat99) September 27, 2013Loved #AtharintikiDaredi super fun. Go see it in the theatres pls. Fantastic entertainer.— Lakshmi Manchu (@LakshmiManchu) September 27, 2013 -
పవన్, త్రివిక్రమ్ ల మరో మ్యాజిక్ 'అత్తారింటికి దారేది?'
హిట్టొచ్చినా.. ఫ్లాప్ వచ్చినా పవన్ కళ్యాణ్ స్టామినాపై ఎలాంటి ప్రబావం ఉండదనేది టాలీవుడ్ లో సగటు సిని అభిమానుల అభిప్రాయం. అలాంటి ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ తో జల్సా చిత్రం తర్వాత 'మాటల ఫిరంగి' త్రివిక్రమ్ జత కలిసి రూపొందించిన అత్తారింటికి దారేది చిత్రం సెప్టెంబర్ 27 శుక్రవారం విడుదలైంది.. అత్తారింటికి దారేది చిత్రం విడుదలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు చిత్ర నిర్మాణానంతరం పురుడు పోసుకున్న చిత్రాలనే పైరసీ భూతం మింగేసేది. అయితే అత్తారింటికి దారేది చిత్రం గర్భం నుంచి బయట పడకముందే శిశువును పైరసీ భూతం కాటేసింది. విడుదలకు ముందే ఫస్ట్ లుక్, టీజర్, ఆడియో విజయవంతం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అత్తారింటికి దారేది చిత్రంతోపాటు మరికొన్ని చిన్న, భారీ చిత్రాలు ఇబ్బందులకు గురయ్యాయి. దానికి తోడు ఈ చిత్ర సీడిలు విడుదలకు ముందే మార్కెట్ లోకి అందుబాటులోకి రావడం చిత్ర పరిశ్రమను కలిచివేసింది. ఈ నేపథ్యంలో విడుదలైన అత్తారింటికి దారేది చిత్రం ప్రేక్షకుల అంచనాలను మించిందా, పైరసీ భూతాన్ని ఏవిధంగా ఎదురించిందనే అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం! ఇటలీలోని మిలాన్ లో రఘు నందా ఓ టాప్ బిజినెస్ మెన్. ఆయన మనవడే గౌతమ్ నందా. ఆరడుగుల బుల్లెట్ లా తాతకు అన్నివేళలా గౌతమ్ అండగా ఉంటాడు. అయితే తన తాత కోరికను తీర్చేందుకు మిలాన్ నుంచి గౌతమ్ హైదరాబాద్ కు చేరుకుని సునందా అనే వ్యాపారవేత్త ఇంట్లో సిద్దార్థ్ పేరుతో కారు డ్రైవర్ గా పనికి కుదురుతాడు. తాత రఘునందా కోరిక ఏమిటి.. మిలాన్ లో ఉండే గౌతమ్ కు హైదరాబాద్ లో ఉండే సునందాకు లింకేమిటి? తన తాత కోరికను గౌతమ్ ఎలా తీర్చాడు అనే అంశాలపై తలెత్తే సమాధానాలకు జవాబే 'అత్తారింటికి దారేది?' చిత్రం. ఈ చిత్రంలో గౌతమ్ నందా కారెక్టర్ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు ఖచ్చితంగా సరిపోయే విధంగా రూపుదిద్దిన పాత్రగా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులకు, సినీ ప్రేక్షకులు ఆశించే విధంగానే గౌతమ్ నందా క్యారెక్టర్ ను దర్శకుడు త్రివిక్రమ్ చక్కగా తీర్చిదిద్దాడు. గౌతమ్ పాత్ర లో ఉండే ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్, బుల్లెట్ లా పేలే డైలాగ్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కనువిందే. పవన్ కళ్యాణ్ తో 'చూడు 'సిద్దప్ప నేను సింహం లాంటి వాడిని...', సింహం నిద్ర పోతుంటే జూలుతో జడవేయ్యోద్దు..పులి పలకరించిందని పక్కనే నిలుచుని ఫోటోకు ఫోజివ్వద్దు' అంటూ టీజర్ ద్వారా త్రివిక్రమ్ చెప్పించిన డైలాగ్స్ అతి తక్కువ సమయంలోనే సంచలనాలకు వేదికయ్యాయి. త్రివిక్రమ్ కలం నుంచి అలాంటి మార్కు ఉన్న డైలాగ్స్ ఈ చిత్రంలో మరెన్నో. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కు పవన్ కళ్యాణ్ మరింత పవర్ యాడ్ చేసి అభిమానులకు వంద శాతం సంతృస్తిని కలిగించాడు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం కొంత నిరాశను కలిగించినా.. త్రివిక్రమ్ మార్క్ కథనం, పవన్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ను కొత్తగా ఫీలయ్యేలా చేశాయి. సినిమా ద్వితీయార్ధంలో బ్రహ్మనందం చేసిన అహల్య అమాయకురాలు ఎపిసోడ్, పవన్ కళ్యాణ్ బాబా ఎపిసోడ్ ప్రేక్షకులను అభిమానులకు కిక్కించేలా ఉన్నాయి. ఇక రైల్వే స్టేషన్ లో క్లైమాక్స్ సీన్ చిత్రానికి హైలెట్ అని చెప్పవచ్చు. క్లైమాక్స్ లో దర్శకుడు త్రివిక్రమ్ టేకింగ్, పవన్ కళ్యాణ్ నటన చిత్రానికి ఓ రేంజ్ తెచ్చాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన గేయాలకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆడియో విడుదల తర్వాత టాలీవుడ్ లో సృష్టించిన ప్రభావం అంతా ఇంతా కాదు. 'కిర్రాక్', 'దేవ దేవం', 'బాపు గారి బొమ్మ', 'టైమ్ టూ పార్టీ' పాటలతోపాటు దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన 'నిన్ను చూడగానే'..శ్రీమణి రాసిన 'ఆరడుగుల బుల్లెట్'తోపాటు 'కాటమ రాయుడా' అంటూ పవన్ పాడిన పాటకు అనూహ్య స్పందన లభించింది. బయట ఆడియోకు లభించిన స్పందన ధీటుగా థియేటర్ లో కూడా అలాంటి వాతావరణం కనిపించడం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక కెమెరాతో ప్రసాద్ మూరెళ్ల యూరప్ అందాలను చక్కగా బంధించడమే కాకుండా.. కీలక సన్నివేశాల చిత్రీకరణకు జీవం పోశారు. రఘునందాగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తనదైన శైలిలో నటించాడు. మిర్చి చిత్రం ద్వారా టాలీవుడ్ లో రీఎంట్రి ఇచ్చిన నదియా సునందా పాత్రలో మరోసారి ఆకట్టుకున్నారు. శశిగా సమంత, ప్రణీతలు గ్లామర్ తో ఆలరించారు. కమర్షియల్, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ లాంటి అంశాలు మేలవించిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు, సగటు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం ఖాయం. రాష్ట్రంలోని పరిస్థితులు సహకరిస్తే.. అత్తారింటికి దారేది చిత్రం కమర్షియల్ హిట్ కే పరిమితం కాకుండా సంచలన విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తనను మింగేయడం అంత సులభమైన పనికాదని పైరసీ భూతానికి పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది?' ద్వారా డేంజర్ సిగ్నల్స్ పంపడం ఖాయం! ---రాజబాబు అనుముల a.rajababu@sakshi.com