తమిళంలో 'అత్తారింటికి దారేది' రీమేక్?
రికార్డు స్థాయి కలెక్షన్ల దిశగా దూసుకెళ్లిపోతున్న 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేయనున్నారు. ఇప్పటివరకు ఎవరూ రీమేక్ రైట్స్ను కొనుగోలు చేయలేదు గానీ, చాలామంది మాత్రం ఇందుకు ఆసక్తి చూపిస్తున్నారని సినిమా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు తెలిపాయి. తమిళంలో ప్రముఖ నిర్మాత ఒకరు దీనిపై బాగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడవుతుందని అంటున్నారు.
తమిళ నటుడు విజయ్ ఈ రీమేక్ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అయితే ఇంకా ఈ విషయం చర్చల దశలోనే ఉన్నందున దీని గురించి అప్పుడే ఏమీ చెప్పలేమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బహుశా రెండు వారాల్లో దీని గురించిన స్పష్టత రావచ్చు. ఇంతకు ముందు ఒక్కడు, పోకిరీ, అతనొక్కడే, నువ్వునాకు నచ్చావు లాంటి సినిమాల తమిళ రీమేక్లలో విజయ్ నటించాడు.
సెప్టెంబర్ 27న విడుదలైన 'అత్తారింటికి దారేది' ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జల్సా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాణ్ జోడీగా వచ్చిన ఈ సినిమా అమెరికాలోనూ హల్చల్ చేస్తోంది.