పవన్, త్రివిక్రమ్ ల మరో మ్యాజిక్ 'అత్తారింటికి దారేది?' | Another Magic from Pawan Kalyan and Trivikram Srinivas: Attarintiki Daaredi Movie Review | Sakshi
Sakshi News home page

పవన్, త్రివిక్రమ్ ల మరో మ్యాజిక్ 'అత్తారింటికి దారేది?'

Published Fri, Sep 27 2013 2:51 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్, త్రివిక్రమ్ ల మరో మ్యాజిక్ 'అత్తారింటికి దారేది?' - Sakshi

పవన్, త్రివిక్రమ్ ల మరో మ్యాజిక్ 'అత్తారింటికి దారేది?'

హిట్టొచ్చినా.. ఫ్లాప్ వచ్చినా పవన్ కళ్యాణ్ స్టామినాపై ఎలాంటి ప్రబావం ఉండదనేది టాలీవుడ్ లో సగటు సిని అభిమానుల అభిప్రాయం. అలాంటి ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ తో జల్సా చిత్రం తర్వాత  'మాటల ఫిరంగి' త్రివిక్రమ్ జత కలిసి రూపొందించిన అత్తారింటికి దారేది చిత్రం సెప్టెంబర్ 27 శుక్రవారం విడుదలైంది.. అత్తారింటికి దారేది చిత్రం విడుదలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు చిత్ర నిర్మాణానంతరం పురుడు పోసుకున్న చిత్రాలనే పైరసీ భూతం మింగేసేది. అయితే అత్తారింటికి దారేది చిత్రం గర్భం నుంచి బయట పడకముందే శిశువును పైరసీ భూతం కాటేసింది. విడుదలకు ముందే ఫస్ట్ లుక్, టీజర్, ఆడియో విజయవంతం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అత్తారింటికి దారేది చిత్రంతోపాటు మరికొన్ని చిన్న, భారీ చిత్రాలు  ఇబ్బందులకు గురయ్యాయి. దానికి తోడు ఈ చిత్ర సీడిలు విడుదలకు ముందే మార్కెట్ లోకి అందుబాటులోకి రావడం చిత్ర పరిశ్రమను కలిచివేసింది. ఈ నేపథ్యంలో విడుదలైన అత్తారింటికి దారేది చిత్రం ప్రేక్షకుల అంచనాలను మించిందా, పైరసీ భూతాన్ని ఏవిధంగా ఎదురించిందనే అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం!

ఇటలీలోని మిలాన్ లో రఘు నందా ఓ టాప్ బిజినెస్ మెన్. ఆయన మనవడే గౌతమ్ నందా. ఆరడుగుల బుల్లెట్ లా తాతకు అన్నివేళలా గౌతమ్ అండగా ఉంటాడు. అయితే తన తాత కోరికను తీర్చేందుకు మిలాన్ నుంచి గౌతమ్ హైదరాబాద్ కు చేరుకుని సునందా అనే వ్యాపారవేత్త ఇంట్లో సిద్దార్థ్ పేరుతో కారు డ్రైవర్ గా పనికి కుదురుతాడు. తాత రఘునందా కోరిక ఏమిటి.. మిలాన్ లో ఉండే గౌతమ్ కు హైదరాబాద్ లో ఉండే సునందాకు లింకేమిటి? తన తాత కోరికను గౌతమ్ ఎలా తీర్చాడు అనే అంశాలపై తలెత్తే సమాధానాలకు జవాబే 'అత్తారింటికి దారేది?' చిత్రం.

ఈ చిత్రంలో గౌతమ్ నందా కారెక్టర్ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు ఖచ్చితంగా సరిపోయే విధంగా రూపుదిద్దిన పాత్రగా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులకు, సినీ ప్రేక్షకులు ఆశించే విధంగానే  గౌతమ్ నందా క్యారెక్టర్ ను దర్శకుడు త్రివిక్రమ్ చక్కగా తీర్చిదిద్దాడు. గౌతమ్ పాత్ర లో ఉండే ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్, బుల్లెట్ లా పేలే డైలాగ్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కనువిందే. పవన్ కళ్యాణ్ తో 'చూడు 'సిద్దప్ప నేను సింహం లాంటి వాడిని...', సింహం నిద్ర పోతుంటే జూలుతో జడవేయ్యోద్దు..పులి పలకరించిందని పక్కనే నిలుచుని ఫోటోకు ఫోజివ్వద్దు' అంటూ టీజర్ ద్వారా  త్రివిక్రమ్ చెప్పించిన డైలాగ్స్ అతి తక్కువ సమయంలోనే సంచలనాలకు వేదికయ్యాయి. త్రివిక్రమ్ కలం నుంచి అలాంటి మార్కు ఉన్న డైలాగ్స్ ఈ చిత్రంలో మరెన్నో. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కు పవన్ కళ్యాణ్ మరింత పవర్ యాడ్ చేసి అభిమానులకు వంద శాతం సంతృస్తిని కలిగించాడు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం కొంత నిరాశను కలిగించినా.. త్రివిక్రమ్ మార్క్ కథనం, పవన్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ను కొత్తగా ఫీలయ్యేలా చేశాయి. సినిమా ద్వితీయార్ధంలో బ్రహ్మనందం చేసిన అహల్య అమాయకురాలు ఎపిసోడ్, పవన్ కళ్యాణ్ బాబా ఎపిసోడ్ ప్రేక్షకులను అభిమానులకు కిక్కించేలా ఉన్నాయి. ఇక రైల్వే స్టేషన్ లో క్లైమాక్స్ సీన్ చిత్రానికి హైలెట్ అని చెప్పవచ్చు. క్లైమాక్స్ లో దర్శకుడు త్రివిక్రమ్ టేకింగ్, పవన్ కళ్యాణ్ నటన చిత్రానికి ఓ రేంజ్ తెచ్చాయి.

రామజోగయ్య శాస్త్రి రాసిన గేయాలకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆడియో విడుదల తర్వాత టాలీవుడ్ లో సృష్టించిన ప్రభావం అంతా ఇంతా కాదు. 'కిర్రాక్', 'దేవ దేవం', 'బాపు గారి బొమ్మ', 'టైమ్ టూ పార్టీ' పాటలతోపాటు దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన 'నిన్ను చూడగానే'..శ్రీమణి రాసిన 'ఆరడుగుల బుల్లెట్'తోపాటు 'కాటమ రాయుడా' అంటూ పవన్ పాడిన పాటకు అనూహ్య స్పందన లభించింది. బయట ఆడియోకు లభించిన స్పందన ధీటుగా థియేటర్ లో కూడా అలాంటి వాతావరణం కనిపించడం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక కెమెరాతో ప్రసాద్ మూరెళ్ల యూరప్ అందాలను చక్కగా బంధించడమే కాకుండా.. కీలక సన్నివేశాల చిత్రీకరణకు జీవం పోశారు.

రఘునందాగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తనదైన శైలిలో నటించాడు. మిర్చి చిత్రం ద్వారా టాలీవుడ్ లో రీఎంట్రి ఇచ్చిన నదియా సునందా పాత్రలో మరోసారి ఆకట్టుకున్నారు. శశిగా సమంత, ప్రణీతలు గ్లామర్ తో ఆలరించారు. కమర్షియల్, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ లాంటి అంశాలు మేలవించిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు, సగటు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం ఖాయం.

 రాష్ట్రంలోని పరిస్థితులు సహకరిస్తే.. అత్తారింటికి దారేది చిత్రం కమర్షియల్ హిట్ కే పరిమితం కాకుండా సంచలన విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తనను మింగేయడం అంత సులభమైన పనికాదని పైరసీ భూతానికి పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది?' ద్వారా డేంజర్ సిగ్నల్స్ పంపడం ఖాయం!

---రాజబాబు అనుముల

a.rajababu@sakshi.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement