పవన్ కళ్యాణ్ వైపు బాలీవుడ్ చూపు!
పవన్ కళ్యాణ్ వైపు బాలీవుడ్ చూపు!
Published Tue, Oct 8 2013 3:42 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్ర కలెక్షన్లు బాలీవుడ్ పరిశ్రమ ప్రముఖులను, విశ్లేషకులను దిమ్మతిరిగేలా చేశాయి. అత్తారింటికి దారేది చిత్రం బాలీవుడ్ చిత్రాలు రణబీర్ కపూర్ నటించిన 'యే జవానీ హై జిందగీ', షారుఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రాలకు ధీటుగా కలెక్షన్లను కురిపించింది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ లో తాజాగా పవన్ కళ్యాణ్ హాట్ హాట్ గా చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత, ప్రణీత లతో పవన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని మూటగట్టుకుంది. ఓవర్సీస్ మార్కెట్ లో పవన్ చిత్రం సుమారు 16 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ అనలిస్టుల సమాచారం. కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే పది రోజుల్లోనే 40 కోట్ల రూపాయల షేర్ ను సాధించడం భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది.
పవన్ కళ్యాణ్ స్టామినాను అంచనా వేసిన బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు ద్విభాషా చిత్రాల్లో నటింపచేయాలని ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తొంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను సంప్రదించేందుకు తమ వంతు ప్రయత్నాల్ని ప్రారంభించారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఓవర్సీస్, దక్షిణాది మార్కెట్ లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ కన్నేసిందని తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీ నుంచి ఇటీవలే బాలీవుడ్ లో జంజీర్ చిత్రం ద్వారా రాంచరణ్ ఎంట్రీ ఇచ్చి.. ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ పై పవన్ ఆసక్తిని ప్రదర్శిస్తాడా అనేది సందేహమే. దక్షిణాదిలో ఇప్పటికే ఓ రేంజ్ ను సొంతం చేసుకున్న పవన్.. హిందీ చిత్ర సీమలో ప్రవేశించడం ద్వారా తనకున్న క్రేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement