
'అత్తారింటికి దారేది' కలెక్షన్ల సునామీ
ఓ వైపు విడుదలకు ముందే పైరసీ సీడీ మార్కెట్లోకి రావడం, మరోవైపు సినిమా అడ్డుకుంటామన్న హెచ్చరికలు.. ఇలా ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేది' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 22 కోట్లకుపైగా వసూళ్లు రావడం విశేషం. ఆంధ్ర బాక్సాఫీసు డాట్ కమ్ వెబ్సైట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రాంతాల వారీగా నైజాంలో 7.80 కోట్లు, సీడెడ్లో 4.48 కోట్లు, వైజాగ్లో 2.20 కోట్లు, గోదావరి జిల్లాల్లో 3.20 కోట్లు, కృష్ణాలో 1.53 కోట్లు, గుంటూరులో 2.27 కోట్లు, నెల్లూరులో 1.03 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటకలో 2.65 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో కోటి, అమెరికాలో 6.5 కోట్లు, ఇతర దేశాల్లో 0.90 కోట్లు వసూలు చేసింది. త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగినట్టే అభిమానులను అలరిస్తోంది. సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. పవన్ అభినయం, పాటలు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. పవన్ సరసన సమంత, ప్రణీత నటించారు.