నదియా
ఒకప్పుడు హీరోయిన్స్గా దుమ్మురేపిన అందగత్తెలు కొంతకాలం తెరమరుగై మళ్లీ ఏదో ఒక రకమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు. కొందరు అత్త, అక్క, వదిన .... వంటి పాత్రలలో బాగానే రాణిస్తున్నారు. అలా వచ్చినవారికి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అటువంటివారిలో ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ సినిమాలను ఓ ఊపు ఊపేసిన నదియా ఒకరు. నదియా ఇప్పుడు కొత్త తరహా పాత్రలతో బిజీబిజీగా ఉన్నారు. టాప్ హీరోయిన్గా తన తళుకుబెళుకులు ప్రదర్శించిన నదియా ఇప్పుడు ఈ వయసులో కూడా గ్లామరస్గా కనిపించడం ఆమెకు ప్లస్ అయింది.
ఓల్డ్ బ్యూటీ నదియా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా గోల్డెన్ ఆఫర్స్ కొట్టేస్తున్నారు. వయసు మళ్లుతున్నా ఫిట్నెస్లో నదియా ఫర్ఫెక్ట్గా ఉన్నారు. అందరినీ అకట్టుకుంటున్నారు. 'మిర్చి'లో ప్రభాస్కు తల్లిగా, అత్తారింటికి దారేదిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు అత్తగా నటించి మెప్పించారు. మంచి మార్కులు కొట్టేశారు. ఈ చిత్రంలో ఆమె అద్బుతంగా తన నటనను ప్రదర్శించారు. ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అత్తారింటికి దారేది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు అవకాశాలకు కొదవలేదు. తెలుగులో ప్రముఖ హీరోలకు అమ్మ, అత్తగా నటించిన నదియా ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో నిర్మించే 'ఆగడు'చిత్రంలో మహేష్ బాబుకు అక్కగా నటిస్తోంది.
మోహన్లాల్ హీరోగా మళయాలంలో సూపర్ హిట్ట్ అయిన 'ద్రిష్యుం' అనే చిత్రాన్ని తెలుగులో 'దృశ్యం' పేరుతో రీమేక్ చేస్తున్నారు. చంటి, చినరాయుడు, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, రాజా, శీను, జెమిని, ఘర్షణ, బాడీగార్డ్, మసాలా... వంటి రీమేక్ చిత్రాలతో విజయాలను తన సొంతం చేసుకున్న వెంకటేష్ ఇందులో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నదియా నటించబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ సినిమాకు అలనాటి మరో హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వం వహించడం మరో విశేషం. ఈ సినిమా తమిళ వెర్షన్లో కూడా నదియా కమల్హాసన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు కోలీవుడ్ సమాచారం.
నదియా మరో మళయాల చిత్రంలో కూడా కొత్త తరహా పాత్రలో నటించబోతోంది. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే చిత్రంలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఆఫర్ల మీద ఆఫర్లు రావడంతో నదియా తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసినట్లు సినీవర్గాల సమాచారం. రీఎంట్రీలో కూడా తన సత్తాచాటుతూ నదియా ఫుల్ బిజీ అయ్యారు.