చిరంజీవే దర్శకత్వం వహిస్తారా?
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి మెగాఫోన్ పట్టుకుంటారా? అవునట ఆయన దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నారని తెలుస్తోంది. రెండు దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజులా ఏలిన ఆయన తాజాగా దర్శకత్వంపై మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. రీల్ మీద పాలిటిక్స్ను ఈజీగా హ్యాండిల్ చేసిన చిరంజీవి రియల్ లైఫ్ రాజకీయాల్లో మాత్రం తడబడిన విషయం తెలిసిందే. పాలిటిక్స్ ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకునేందుకు మెగాస్టార్ ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజకీయాల నుంచి కాస్త విశ్రాంతి దొరకటంతో చిరంజీవి సినిమాలపై.. అందునా తన 150వ సినిమాపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ ఎంట్రీ గ్రాండ్గా ఉండేలా తన స్వీయదర్శకత్వంలో ఆ సినిమాను తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. కాగా చిరంజీవి 150 సినిమాకి డైరెక్టర్గా చాలామంది పేర్లు తెర మీదకు వచ్చాయి.
ఛాన్స్ ఇస్తే చిరు సినిమాకు దర్శకత్వం వహిస్తానని దర్శకుడు వీవీ వినాయక్ బాహాటంగానే చెప్పాడు. కానీ చిరంజీవి మాత్రం స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నారట. నలభై ఏళ్ల తన నటనా అనుభవంతో ఆయన మెగాఫోన్ పట్టుకునేందుకు డిసైడ్ అయ్యారట. తాను నటించి దర్శకత్వం వహిస్తే భారీ క్రేజ్ వస్తుందని కూడా చిరు భావిస్తున్నారట. కాగా చిరంజీవి దర్శకత్వంపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.