న్యాయ పోరాటం చేస్తా
న్యాయం కోసం పోరాటం చేస్తానంటున్నారు నటి ఆషా శరత్. కమలహాసన్ పాపనాశం చిత్రం చూసిన వారు ఈమె ఎవరో చెప్పనవసరం ఉండదనుకుంటా. తెలుగు వెర్షన్ దృశ్యంలో నటి నదియా పోషించిన పోలీసు అధికారి పాత్రను పాపనాశంలో ఆషాశరత్ పోషించి ప్రశంసలందుకున్నారు. పాపనాశం చిత్రంలో ఈమె నటనను చూసి ముగ్ధుడెన కమల్ తన తాజా చిత్రం తూంగావనం చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇది ఆశాశరత్ రీల్ విషయం అయితే ఇక రియల్ వ్యవహారానికొస్తే ఇటీవల ఆమె అశ్లీల దృశ్యాలు సోషల్‌నెట్ వర్క్సులోను, వాట్సాప్‌లోను హల్‌చల్ చేశాయి.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆషాశరత్ చాలా తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తానంటున్నారు. అంతేకాదు న్యాయం జరిగే వరకు వదిలేది లేదని అంటున్నారు. దీని గురించి ఆమె తన ఫేస్‌బుక్‌లో పేర్కొంటూ కష్టకాలంలో తనకు ఆదరించి అక్కున చేర్చుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. అయితే కొన్ని దుష్టశక్తులు సోషల్ నెట్‌వర్క్సులో నీతిమాలిన చర్యలకు పాల్పడుతూ అసభ్యకర దృశ్యాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటివి తనకు చాలా దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. ఇలా ఒక మహిళ ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టే దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకే ఈ వ్యవహారంపై కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తన ఫిర్యాదుపై వెంటనే చర్యలకు దిగిన పోలీసుల అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ప్రస్తుతం ఈ కేసును సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని త్వరలోనే నేరస్థులను పట్టి అరెస్టు చేస్తారనే నమ్మకం తనకుందని అన్నారు. మహిళలకు వ్యతిరేకంగా జరిగే ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి శిక్ష పడాలి. న్యాయం జరిగే వరకు పోరాడుతాను అని పేర్కొన్నారు.