తెలుగు సినీ పరిశ్రమకు కొత్తగా వచ్చి స్టార్ డమ్ సంపాదించే దిశగా అడుగులేస్తున్న ప్రతీ హీరో కలలు గనేది తన ఏడవ సినిమా గురించే. ఏడో సినిమాకు అంత మహిమ ఉంది మరి.. వారి సినీ జీవితంలో ఏడవ సినిమా చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. మరి ఏడు కోసం అన్ని కలలు కనే వీరే ఎనిమిదిని చూసి ఎందుకంత భయపడుతున్నారు.. ? ఎనిమిదిలో ఏముంది ?
ఎనిమిదిలో ఏముందని అంటే ? 'ఎనిమిదిలోనే ఉంది అసలు కథ' అంటారు గాసిప్ రాయుళ్లు. మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్.. నేడు అగ్ర తారలుగా వెలుగొంతుతున్న వీళ్లంతా ఎనిమిది దెబ్బను గట్టిగా తిన్నవారే. 2003లో విడుదలైన మహేష్ ఏడవ సినిమా 'ఒక్కడు'. ఆ సినిమాతోనే మహేష్ ఒక స్టార్‌గా మారారు. ఆ తర్వాత విడుదలైన 'నిజం' సినిమా పరాజయాన్ని చవి చూసింది. అలాగే పవన్ కళ్యాణ్ ఏడవ సినిమాగా విడుదలైన 'ఖుషి' ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో, ఆ సినిమా పవన్ స్టామినాను ఏ రేంజ్‌కి తీసుకెళ్లిందో కూడా మనకు తెలిసిందే. అయితే ఆ తర్వాత విడుదలైన 'జానీ' ఘోర పరాజయాన్ని నమోదు చేసింది.
ఇక, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. తన ఏడవ సిసిమా 'సింహాద్రి'తో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్, ఆ తర్వాత విడుదలైన 'ఆంధ్రావాలా'తో ఎంతటి పరాజయాన్ని మూట కట్టుకున్నాడో తెలిసిందే. ఈ ముగ్గురు కథానాయకులే కాక అల్లు అర్జున్, నాగ చైతన్య లాంటి మరికొందరూ తమ సినీ జీవితంలోని ఏడో సినిమా చేసే మ్యాజిక్‌ను, ఆ ఊపులో ఉండగానే ఎనిమిదో సినిమా ఇచ్చే షాకులనూ చవి చూసినవారే.
ఇలాంటి లెక్కలు ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా.. సినిమా వాళ్లు మాత్రం బాగానే పట్టించుకుంటుంటారు. మరి తన ఏడవ సినిమా 'ఎవడు'తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ కెరీర్‌లో ఎనిమిదవ సినిమాగా రాబోతున్న 'గోవిందుడు అందరివాడేలే' అయినా ఈ నమ్మకాన్ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి మరి ?!