
దత్త పిల్లలతో కులుమనాలి
ఉన్నోళ్లంతా మనసున్నోళ్లు కాలేరు. మంచి మనసున్నోళ్లు ధనం ఉన్నోళ్లకంటే పేరున్నోళ్లవుతారు. ఈ రెండు ఉన్న వాళ్లలో నటి హన్సిక ఒకరని చెప్పవచ్చు. అభాగ్యులను ఆదుకునే ఆపన్న హస్తం ఈమెది. ఒక్కో ఏడాది ఒక్కో అనాథను అక్కున చేర్చుకుంటూ 25 ఏళ్ల పుత్తడి బొమ్మ 25 మంది చిన్నారులను దత్తత తీసుకుంది. మరిన్ని ఇతరత్రా గుప్త దానాలతో తన సేవా కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న హన్సిక తజాగా తాను సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్న 25 మంది పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించాలని భావించారు. దీంతో వారందరితో జూన్‌లో వారం రోజులపాటు కులుమనాలికి విహార యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తల్లి వెల్లడిస్తూ వచ్చే ఏడాది ఈ పిల్లలతో విదేశీయానం చేయాలని హన్సిక భావిస్తున్నట్లు తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో బిజీ హీరోయిన్ హన్సిక. అలాంటి నటికి ప్రతి నిమిషం చాలా ఖరీదయినది. అయినా దత్తత తీసుకున్న పిల్లల కోసం ఇంత సమయాన్ని కేటాయిస్తున్నారంటే నిజంగా ఆమె సేవా నిరతికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.