
కృష్ణ, విజయనిర్మల
‘‘అక్కినేని నాగేశ్వరరావు, రజనీకాంత్, శివాజీగణేషన్ వంటి స్టార్ హీరోలతో సినిమా తీసిన ఏకైక లేడీ డైరెక్టర్ విజయనిర్మల. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన 44 చిత్రాల్లో సగానికిపైగా సినిమాల్లో నేను నటించినందుకు సంతోషంగా ఉంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. నటి–దర్శక–నిర్మాత విజయనిర్మల 73వ జన్మదిన వేడుకలు ఘట్టమనేని వంశాభిమానుల సమక్షంలో మంగళవారం జరిగాయి. కృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఏడాది మా ఇంటికి విచ్చేసి, అభిమానాన్ని చాటుకొంటున్న అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గౌరవించిన విజయనిర్మలను త్వరలోనే భారత ప్రభుత్వం తగిన రీతిలో సత్కరిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఒకసారి దాసరి నారాయణరావుగారు మా ఇంటికొచ్చారు.
నా పుట్టినరోజు వేడుకలకు అభిమానులు రావడం చూసి.. ‘ఏ స్టార్ హీరోయిన్‌కీ ఈ రేంజ్ క్రేజ్ లేదు’ అన్నారు. ఆ మాట నాకు పద్మభూషణ్ అవార్డుతో సమానం’’ అన్నారు విజయ నిర్మల. ‘‘దాసరి, బాపు వంటి టాప్ డైరెక్టర్స్ తొలి హీరోయిన్ విజయనిర్మలగారు. విజయశాంతిలాంటి స్టార్ హీరోయిన్‌ని ‘కిలాడి కృష్ణుడు’తో తెలుగు తెరకు పరిచయం చేసిన విజయనిర్మలగారి పుట్టినరోజు వేడుకల్లో భాగస్వాములవడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత బి.ఏ.రాజు. 73వ పుట్టినరోజు సందర్భంగా ‘మా’ అసోసియేషన్‌కు విజయనిర్మల 73 వేల రూపాయల చెక్ అందించారు. నటుడు నరేశ్, హీరో నవీన్ విజయ్‌కృష్ణ, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, సురేశ్ కొండేటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment