
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను.. వెండితెరపై ‘యాత్ర’గా ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీ నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది.
మరుగైనావా రాజన్న.. కనుమరుగైనావా రాజన్న అంటూ సాగే ఈ పాట.. రాజన్న మరణంతో శోక సంద్రంలో మునిగిన ఎంతో మంది ప్రజల గుండెల్లోని భావాలే పాటైనట్టుంది. రచ్చబండకని బయల్దేరిన రాజన్న అనంతలోకాలకు చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాలు కన్నీటి సంద్రమైన పరిస్థితులను ఈ పాట వివరిస్తోంది. ఈ పాటకు సమకూర్చిన బాణీ, పెంచల్ దాస్ స్వయంగా రాసి, పాడిన ఈ పాట మళ్లీ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఉన్నాయి. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.