యాత్ర ఫలించింది | yatra movie review | Sakshi
Sakshi News home page

యాత్ర ఫలించింది

Published Sat, Feb 9 2019 12:01 AM | Last Updated on Sat, Feb 9 2019 11:43 AM

yatra movie review - Sakshi

నేను విన్నాను.. నేను ఉన్నాను.మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాలేజ్‌ యాజమాన్యాన్ని కలవమను.. రాకుంటే నన్ను కలవమను.దేశ భద్రత ముఖ్యమే.. కానీ ఆహార భద్రతా అంతే ముఖ్యం.కడప దాటి ప్రతి గడపకూ వెళ్లాలనుంది. ప్రజల గుండె చప్పుడు వినాలనుంది.మంచిమనసున్న మనుషులున్నప్పుడు ముహూర్తాలతో పని ఏముంది.నా సహనాన్ని అసమర్థత అనుకోకండి.. నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే... బానిసను కాదు.ఒక కార్డు ఇస్తాను.. ఆ కార్డుతో ఎంత పెద్ద ఆస్పత్రిలో అయినా రూపాయి కూడా చెల్లించకుండా వైద్యం పొందొచ్చు.ఇవాళ రైతు పరిస్థితి ఎలా ఉందంటే ఆర్నెల్లు కష్టపడి సోనా మసూరి బియ్యం పండించినా రేషన్‌ బియ్యం తింటున్నారు.మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా...

వంటి అర్థవంతమైన, ఎమోషనల్‌ డైలాగ్స్‌తో సాగే ‘యాత్ర’ సూటిగా జనాల హృదయాలను తాకే విధంగా ఉంది. మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి జనం గురించి ఎంతలా ఆలోచించారో చెప్పే ఈ సంభాషణలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టాయి. మమ్ముట్టి లీడ్‌ రోల్‌లో మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. వైఎస్‌ చేసిన పాదయాత్ర చుట్టూ సాగే ఈ ‘యాత్ర’ ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ ఏంటంటే...
మనం ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎందుకు అధికారం చేపట్టలేకపోతున్నాం అంటే.. నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాం కానీ, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం అంటూ స్వీయ ఆత్మ పరిశీలన నుంచి సినిమాలో వైఎస్సార్‌ పాదయాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో పంటలకు గిట్టుబాటు ధర దొరక్క ఓ రైతు చేసే ఆత్మహత్యాయత్నం, పేదరికంతో వైద్యం చేయించలేక ఓ కన్నతల్లి తన బిడ్డను కోల్పోవడం, పై చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడే ఓ విద్యార్థి వేదన.. వంటివి వైఎస్‌ మనసుని కలచివేస్తాయి. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ వైఎస్‌ ఇచ్చే భరోసా ప్రజల్లో ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది. అదే వైఎస్‌ గెలుపునకు కారణం అవుతుంది. ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్‌ తన పట్టుదలతో విజయ తీరాలకు చేర్చుతారు.

‘మాట ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.. ఇచ్చాక ఇక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే’ అని అన్నట్టుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం పెడతారు. నిజ జీవితంలో మాట ఇస్తే వెనక్కి తగ్గని వైఎస్‌ వ్యక్తిత్వాన్ని కళ్లకు కట్టినట్టుగా వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘యాత్ర’. వైస్సార్‌ పాత్రకు మమ్ముట్టి తప్ప వేరే ఎవరూ సూట్‌ కారు అనేలా ఆయన అద్భుతంగా నటించారు. ఆయన బాడీ లాంగ్వేజ్‌  వైఎస్సార్‌ని తలపించింది. చివరికి డబ్బింగ్‌ కూడా పర్ఫెక్ట్‌గా చెప్పారు. సినిమా అంతా ఒక ఎత్తయితే క్లైమాక్స్‌లో వచ్చే వైఎస్సార్‌ రియల్‌ ఫుటేజ్‌ మరో ఎత్తు. బరువెక్కిన హృదయంతో ఆ మహానేతను మరోమారు తలచుకుంటూ ప్రేక్షకులు థియేటర్స్‌ నుంచి బయటికి రావడం కనిపిస్తుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుండటంతో ఏడాదిన్నరగా యూనిట్‌ పడ్డ కష్టం ఫలించింది. వైఎస్‌ రాజశేఖర రెడ్డిని, ఆయన ఇమేజ్‌ని క్యాప్చర్‌ చేయడం అంత సులువైన విషయం కాదు.


ఎన్నో కోణాలు ఉన్న నాయకుడు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఆహార్యం, ఆయనలో ఉండే ఎనర్జీ, ఆయన్ని చూడగానే ఆకర్షితులయ్యే గుణం... ఇవన్నీ ఓ వైపు ఉన్నా, ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన సిద్ధాంతాలు ఎలాంటివో అవే పెద్దకథ చెప్పాయి. రాజశేఖర రెడ్డిని ప్రేమించని వాళ్లు, ఆయన గురించి తెలియని వాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరనే చెప్పాలి. ఆయన జీవితకాలంలో చేసిన మంచి పనుల్లో ఎంతోమంది లాభపడ్డారు. అంతటి మహానుభావుణ్ని, మహానేతను 2 గంటల నిడివిలో చూపించడం చాలా కష్టం. అందుకనే ‘మరో ప్రస్థానం’ పేరుతో సాగిన ఆయన పాదయాత్రని మహి వి.రాఘవ్‌ తీసుకోవడం వల్ల ఆయన జీవితంలోని కొన్ని కోణాలను ఆవిష్కృతం చేసుకునే అవకాశం దొరికింది. అదే కాకుండా నిజమైన సంఘటనల్లోనే అందమైన కథలు దొరికాయి.

కథలు రాసుకొని బయోపిక్‌ని ప్రెజెంట్‌ చేయడం వేరు.. బయోపిక్‌ని చూసి దాంట్లో కథని వెతుక్కుంటూ సన్నివేశాలు రాసుకోవడం మరో ఎత్తు. అది కూడా ఒక మహానుభావుని యాత్ర.. ఒకటి మనకు స్ఫూర్తిని కలిగించాలి.. రెండు ఇతర నాయకులకు ఒక దిశానిర్దేశం కావాలి. యాత్ర ఒక మనిషిది కాదు.. ఒక మహానుభావుడిది మాత్రమే కాదు.. యాత్ర ఒక సమాజానిది. ఇప్పుడే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని ఎంతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. సమాజం మళ్లీ ఒక్కసారి వైఎస్‌ స్మృతులను నెమరు వేసుకోవడం చాలా అందమైన అనుభవం. సహజత్వానికి దూరం పోకుండా నిజాయతీగా తీసిన సినిమా ‘యాత్ర’. తక్కువ పదాల్లో ఎక్కువ చెప్పిన మహీ ప్రయోగం బాగుంది. ఎంత ఖర్చయినా పర్వాలేదు ఓ మహా యోధుడిని సమాజానికి చూపించాలనే ఆకాంక్ష నిర్మాతలు విజయ్, శశిలది. బయోపిక్స్‌ అధ్యాయం నడుస్తున్న సమయంలో రెపరెపలాడే జెండా ఈ ‘యాత్ర’. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement