'తల్లి పాత్రల్లో నటిస్తే తప్పేంటి?'
నాజూకు భామ శ్రియ శరణ్ గ్లామర్ పాత్రలకు స్వస్తి చెప్పినట్టే కనబడుతోంది. వరుసగా గృహిణి పాత్రల్లో నటిస్తూ పంథా మార్చింది. మనం, గోపాల గోపాల సినిమాల్లో ఆమె గృహిణి పాత్రల్లో ఒదిగిపోయింది. గ్లామర్ పాత్రలు చేయడానికి అవకాశం రాకపోవడం వల్లే ఆమె ఇలాంటి పాత్రలు చేస్తోందన్న వాదనను శ్రియ తోసిపుచ్చింది. 14 ఏళ్ల తన సినీ ప్రయాణంలో చాలా రకాలు పాత్రలు చేశానని, ఇప్పుడు విభిన్నరకాల పాత్రలు ప్రయత్నిస్తున్నానని శ్రియ పేర్కొంది.
ఇటీవల విడుదలైన గోపాల గోపాల సినిమాలో పదేళ్ల పిల్లవాడికి తల్లిగా నటించింది శ్రియ. నటిగా అన్నిరకాల పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపింది. తల్లి పాత్రల్లో నటిస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించింది. తనకు నచ్చితే ఎటువంటి పాత్రలోనైనా నటిస్తానని స్పష్టం చేసింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని శ్రియ తెలిపింది.