బధాయి హో – ఆఫీషియల్ టీజర్
నిడివి 3 ని. 3 సె. ,హిట్స్ 15,146,445
భారతీయులు శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడరుకానీ దేశ జనాభాను పెంచడంలో మాత్రం విశేష ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడేమో గానీ ఒక ముప్పై ఏళ్ల క్రితం చాలా ఇళ్లల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఉండేది కాదు. ఒక్కోసారి కొన్ని ఇళ్లల్లో తల్లి గర్భంతో ఉంటే కాపురానికి వెళ్లిన కూతురు కూడా గర్భంతో తిరిగి వచ్చి ఇద్దరూ ఒకే చూరు కింద ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సిట్యుయేషన్‌లో తల్లీ కూతుళ్లే కాదు మామా అల్లుళ్లు కూడా ఒకరినొకరు ఎదురుపడటానికి ఇబ్బంది పడేవారు. అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు వస్తే? అదే ‘బధాయీ హో’ కథ.
ఎదిగొచ్చిన ఇద్దరు కుమారులు ఉన్న తల్లి హటాత్తుగా గర్భం దాలుస్తుంది. తల్లీ తండ్రి నానమ్మ ఇంట్లో ఇద్దరు కొడుకులు వీళ్లు సమాజం నుంచి ఎటువంటి ఘర్షణ ఎదుర్కొన్నారు తమలో తాము ఎలా ఘర్షణ పడ్డారు అనేది కామెడీగా చెప్పిన కథ ఇది. హిందీ వాళ్లు కొత్త కొత్త కథలను వినోదం కోసం ఎంచుకుంటున్నారు. పెద్దలు మాత్రమే వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయదగ్గ సినిమాగా అనిపిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరో. ‘దంగల్’ ఫేమ్ సాన్య మల్హోత్రా హీరోయిన్. అక్టోబర్ 19న విడుదల.
ప్లస్ మైనస్ – హిందీ షార్ట్‌ఫిల్మ్
నిడివి 18 ని.7సె ,హిట్స్ 9,231,520
భార్యలకు ఎప్పుడూ కంప్లయింట్సే. భర్త సరిగా చూసుకోవడం లేదనీ... అత్తగారు పెత్తనం ఎక్కువ చేస్తుందనీ... కాపురం నరకంగా ఉందనీ... అసలు పెళ్లే చేసుకోకపోతే బాగుంటుందనీ... భర్తలు మాత్రం తక్కువా? ఇవే కంప్లయింట్లు భార్యల మీద కొంచెం అటు ఇటుగా. కాపురం మీద తీవ్ర అసంతృప్తి ఉన్న ఒక భార్య ఢిల్లీ నుంచి జలంధర్ వెళుతూ ఉంటుంది భర్త దగ్గరకు. ఆమెకు భర్త అంటే ఎంత విసుగ్గా ఉంటుందంటే రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కు కూడా రావద్దని అంటుంది. ఆ విసుగునే తన ఎదురుగా ఉన్న ఒక సైనికునితో పంచుకుంటుంది. ఆ సైనికుడు ఆమెతో మాట కలుపుతాడు. ‘మేము సరిహద్దులో ఉంటాం. జీవితం గురించి ఆలోచించడానికి అక్కడ చాలా సమయం దొరుకుతుంది.
జీవించడానికి మనసారా జీవితం దొరికితే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. సంవత్సరంలో ఒకసారి ఇంటికి వస్తాం. ఆ సమయంలో భార్యను ప్రేమించడానికి సమయం చాలదు. ఇక జగడానికి వీలెక్కడ’ అంటాడు. ‘సైనికుల జీవితం ఒక నిమిషం నుంచి మరో నిమిషంలో మారిపోతూ ఉంటుంది. మేము రిటైర్ అవుతామో అమరులవుతామో మాకే తెలియదు. అందుకే ప్రతి నిమిషాన్ని మనస్ఫూర్తిగా జుర్రుకోవాలని చూస్తాం. మీరు సాధారణ మనుషులు. మీ దగ్గర ఎంతో సమయం ఉంటుంది. భద్రత ఉంటుంది. ప్రతి నిమిషాన్ని ఎంతో ఆస్వాదించవచ్చు. ప్రేమతో ఉండచ్చు. కాని మీరు ఎదుటి వారిలో ప్లస్సులూ మైనస్‌లు వెతుక్కుంటూ కూర్చుంటారు’ అంటాడు. ఆ మాట ఆమెను ఆలోచనలో పడేస్తుంది. తర్వాత ఏమవుతుందనేది కథ. యూ ట్యూబ్ స్టార్ భువన్, సినీ నటి దివ్యా దత్తా నటించారు.
2.ఓ – ఆఫీషియల్ టీజర్
నిడివి 1 ని. 29 సె. , హిట్స్ 6,588,760
ఇది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ట్రైలర్. ఇది ఎంతో కాలంగా ప్రేక్షకుల మధ్య నలుగుతున్న సినిమా. ఇంతకాలానికి రాబోతూ ఉంది. సినిమా కథను ఒక్కముక్కలో దర్శకుడు ఈ టీజర్‌లో చెప్పేశాడు. లోకానికి ఒక ‘పక్షి విలన్’తో ముప్పు వచ్చింది. ఆ విలన్ ఎదుర్కొనడానికి మనిషనేవాడు లేడు. ఏం చేయాలి? గతంలో ప్రమాదకారి అని తలచి డిస్‌మాంటల్ చేసి ‘చిట్టీ’ రోబోను తిరిగి ఉనికిలోకి తేవాలి. ఆ చిట్టీ ఈ విలన్ భరతం ఎలా పట్టాడనేది కథ. సాధారణంగా ఈ సినిమా టీజర్ అనగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి.
‘కబాలి’ టీజర్ కట్ చేసిన తీరు దాని మీద ఎన్నో అంచనాలను పెంచింది. ఈ టీజర్ ఆ స్థాయి సంతృప్తిని ఇచ్చేలా ఉందా అనేది చెప్పలేము. 3డిలో చూడాల్సిన ఈ టీజర్‌ను 2డిలో చూడటం వల్ల ఇలా అనిపిస్తోందా అంటే ఎఫెక్ట్స్‌కు 3డి కాని కంటెంట్‌కు కాదుగా. ఏమైనా వందల కోట్లు సంవత్సరాల తరబడి కాలం వెచ్చించి తీసిన ఈ సినిమా ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఎక్కువ కుతూహలం కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment