నాకోసం నా కుటుంబంతో యుద్ధం చేయిస్తుంటా
– రాజమౌళి
‘‘ట్రైలర్‌ను బట్టి... ఓ సామాన్యుడు శక్తివంతమైన ప్రతినాయకుడితో యుద్ధం చేయడమనేది ఈ చిత్రకథ. నాకది బాగా నచ్చింది. చైతన్య కథల సెలక్షన్ బాగుంది. నేనైతే ఫ్యామిలీ కోసం యుద్ధం చేయను. నా కోసం నా ఫ్యామిలీతో యుద్ధం చేయిస్తుంటా’’ అన్నారు రాజమౌళి. నాగచైతన్య, లావణ్యాత్రిపాఠి జంటగా కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మించిన ‘యుద్ధం శరణం’ ప్రీ–రిలీజ్ వేడుక ఆదివారం జరిగింది. వివేక్ సాగర్ స్వరపరిచిన పాటల సీడీలను యం.యం. కీరవాణి, ట్రైలర్‌ను రాజమౌళి విడుదల చేశారు.
తొలి సీడీని రాజమౌళి, డి. సురేశ్‌బాబు అందుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘నా సిన్మాలకు తప్ప మా ఆవిడ (రమా రాజమౌళి) ఇతర సిన్మాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేయదు. తనకేదీ ఓ పట్టాన నచ్చదు. నా సిన్మాల్లోనైనా ఏదైనా పాయింట్ బాగోలేదంటే నిర్మొహమాటంగా చెప్తుంది. కృష్ణ చెప్పిన కథ నచ్చడంతో ఈ సిన్మా చేయడానికి ఒప్పుకుంది. ‘‘బాహుబలి’లో ప్రతి పాత్రకు మనమెంత ప్రీ–వర్క్ చేశామో... కృష్ణ కూడా అలానే ఈ సిన్మాలో పాత్రలను డిజైన్ చేశాడు. ఈ సిన్మాకు వర్క్ ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అని చెప్పింది. తొలిసారి తనంత పాజిటివ్‌గా చెప్పడంతో సినిమాపై చాలా నమ్మకం ఏర్పడింది.
తర్వాత సెట్‌కి వెళ్లినప్పుడు, ఇందులో కొన్ని డైలాగులు విన్నప్పుడు సినిమా హిట్టని ఫిక్సయ్యా’’ అన్నారు. ‘‘తెలుగులో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో సాయిగారు కేరాఫ్ అడ్రస్. నేను, కృష్ణ 4వ తరగతి నుంచి క్లాస్‌మేట్స్. 8వ తరగతిలో ఒక అమ్మాయినే ప్రేమించాం. అప్పుడా యుద్ధంలో నేను గెలిచా. ఇప్పుడీ యుద్ధంలో తనే గెలుస్తాడు. వివేక్‌సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సిన్మాలో హీరో ఎక్కువగా ఏ ఆయుధం వాడడు. కొత్తగా ఉంటుందీ సిన్మా’’ అన్నారు నాగచైతన్య. ‘‘చైతు, కృష్ణకీ మధ్య మంచి వేవ్‌లెంగ్త్ ఉంది. అది సెప్టెంబర్ 8న తెలుస్తుంది. నా సిన్మాల కంటే చైతూ సిన్మాలు బాగా ఆడాలని కోరుకుంటా’’ అన్నారు రానా. ‘‘చైతన్యగారితో నెక్ట్స్ మూవీ చేయాలనుకుంటున్నాం’’ అని మైత్రి మూవీ మేకర్స్ నవీన్ తెలిపారు. నిర్మాతలు శోభు యార్లగడ్డ, లగడపాటి శ్రీధర్, దర్శకుడు ఇంద్రగంటి, దర్శక–నటుడు అవసరాల పాల్గొన్నారు.