
పెట్రో భారాలపై ముంబయిలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన ప్రదర్శన
సాక్షి, ముంబయి : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంధన భారాలపై ముంబయిలో గురువారం కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసనను చేపట్టాయి. కలినా ప్రాంతం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ముంబయివాసులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా పెట్రో ధరల పెంపును నిరసిస్తూ మోదీ, సుష్మా స్వరాజ్, బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లు విమర్శిస్తూ చేసిన ట్వీట్లను ఈ సందర్భంగా వారు ప్రదర్శించారు.
దేశ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా సూట్‌బూట్ సర్కార్ సాగుతోందని నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. పెట్రో ధరల పెంపుతో వాహనదారులతో పాటు నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత తొమ్మిది రోజులుగా పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. పెట్రో ధరలు దేశవ్యాప్తంగా రికార్డు స్ధాయిలో లీటర్‌కు రూ 80 దాటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత భారమయ్యాయి. కాగా పెట్రో ధరలు దిగివచ్చేలా చర్యలు చేపడతామని కేంద్రం సంకేతాలు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment