
వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆటోలోనే మహిళ ప్రసవం
సాక్షి, రాయ్‌పూర్ : వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళ ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఛత్తీస్‌గర్ రాజధాని రాయ్‌పూర్‌కు 350 కిమీ దూరంలోని కొరియలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిండు గర్భిణిని కొరియ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆటోలో తరలించగా, అక్కడ వైద్యులెవరూ అందుబాటులో లేరు. వైద్య సిబ్బంది కోసం కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎంతకూ వైద్యులు రాకపోవడంతో ఆటోలోనే ప్రసవించేలా కుటుంబ సభ్యులు సహకరించారు.
దేశంలో వైద్య వ్యవస్థ తీరుతెన్నులు ఎంత దయనీయంగా ఉన్నాయో ఈ ఘటన మరోసారి అద్దంపట్టింది. కాగా, భారత్‌లో గంటకు ఐదుగురు మహిళలు ప్రసవించే సమయంలో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ఏటా 45,000 వరకూ ఈ తరహా మరణాలు సంభవిస్తున్నాయని నివేదిక తెలిపింది. దేశరాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లోనూ ఈ దుస్థితి నెలకొంది. పెద్దసంఖ్యలో రోగులు ఆస్పత్రికి పోటెత్తడం వల్లే వారికి తగిన వైద్య సేవలు అందించలేకపోతున్నామని ఎయిమ్స్ వర్గాలు అశక్తత వ్యక్తం చేస్తున్నాయి.