ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి కిలోకు పైగా బరువున్న రాయిని వైద్యులు బయటకు తీశారు.
వల్సాద్(గుజరాత్): ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి కిలోకు పైగా బరువున్న రాయిని వైద్యులు బయటకు తీశారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం వల్సాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ధరంపూర్ తహశీల్ పరిధిలోని ఖర్వేల్ గ్రామానికి చెందిన మహేష్ పటేల్(45) గత కొంతకాలంగా మూత్ర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. మూత్రం సరిగ్గా రాక తీవ్ర నొప్పితో బాధపడుతున్న మహేష్‌ను ధరంపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు పరీక్షించారు.
డాక్టర్ ధీరూభాయ్ నేతృత్వంలోని వైద్యులు శుక్రవారం రాత్రి ఆయన మూత్రాశయానికి ఆపరేషన్ చేసింది. కొబ్బరికాయను పోలి ఉన్న 1 కిలో 400 గ్రాముల బరువు ఉన్న రాయిని బయటకు తీశారు. ఇంత పెద్ద రాయి ఉండటం దేశంలోనే ప్రథమమని, ప్రపంచంలో రెండోదని రికార్డులు పరిశీలించిన వైద్యులు తెలిపారు. గతంలో బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి కిలో 900 గ్రాముల బరువైన రాయిని తీశారని తెలిపారు. తమ ఆస్పత్రిలో చేపట్టిన ఈ ఆపరేషన్‌పై లిమ్కాబుక్ రికార్డు నిర్వాహకులకు సమాచారం అందించామని డాక్టర్ ధీరూభాయ్ వెల్లడించారు.