వినోద్ పటేల్, రీటాబెన్
ఆలూమగల మధ్య అన్యోన్యం తప్ప ప్రేమ ఉండదు అని అంటారు. ప్రేమ ఎందుకు ఉండదంటే ప్రేమకు కూడా చోటు ఇవ్వనంతగా వారు ఒకరికొకరు దగ్గరగా ఉంటారు. అన్యోన్యానికి మాత్రం ఎందుకు చోటువ్వాలి? అన్యోన్యం చోటు కాదు. ప్రేమకు గెస్ట్ హౌస్. అనుకోని అతిథిలా ప్రేమ ఎప్పుడైనా గడపలో ప్రత్యక్షమైతే భార్యాభర్తలు ఎదురెళ్లి స్వాగతం చెప్పి సేద తీరమని చూపించే అతిథి గృహం! నిన్న వాలెంటైన్స్ డే రోజు ఒక దాంపత్య ప్రేమకు అలాంటి ఆతిథ్యమే లభించింది!
నేరుగా చెప్పాలంటే ఇది ఒక వాక్యంలో ముగిసిపోయే మహా ప్రేమ కావ్యం. ఆ కావ్యానికి పేరు పెట్టాలంటే ‘వినోద్’ అని పెట్టాలి. కానీ వినోద్ ఊరుకోడు. తన భార్య పేరు కూడా కలిపి పెట్టమంటాడు. ఆమె పేరు రీటా. రీటావినోద్ అని కానీ, వినోద్‌రీటా అని కానీ పెట్టొచ్చు. అప్పుడు ఆమె ‘నా పేరెందుకండీ.. వారి పేరు చాలు’ అనొచ్చు. చివరికి ఇద్దరికీ కలిపి పెట్టదగిన పేరు ఒక్కటే కనిపిస్తుంది.. ‘ప్రేమ’!
నిన్న వాలెంటైన్స్ డే రోజు వినోద్ పటేల్ తన భార్యకు ఇచ్చిన ప్రేమ కానుక దేశంలోని ప్రేమికుల హృదయాలలో పూలజల్లు కురిపించే ఉంటుంది. ఆయన తన కిడ్నీని భార్య రీటా పటేల్‌కు కానుకగా ఇచ్చారు! ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులు? భర్తలో సగభాగాన్నే కాక, అతడి ప్రేమలో పూర్తి మొత్తాన్ని పొందిన రీటానా! భార్య పై తన ప్రేమను తెలియజేసే భాగ్యం పొందిన వినోదా! ఇద్దరూ. ఇరవై రెండేళ్లయింది వాళ్ల పెళ్లయి. ఇరవై మూడో పెళ్లి రోజు కానుకగా తన కిడ్నీని భార్యతో పంచుకున్నారు వినోద్. అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఏర్పాట్లు జరిగాయి. ‘‘వాలెంటైన్స్ డే రోజు మేము తలపెట్టిన ఇలాంటి ఆపరేషన్ ఒకటి ఇదే మాకు మొదటిది’’ అని ఆసుపత్రి ప్రధాన వైద్యడు డాక్టర్ సిద్ధార్త్ మానవి అన్నారు. ‘‘వాలెంటైన్స్ డే కాబట్టి వీళ్లంతా నా భర్త నాకు ఇస్తున్న కిడ్నీని ప్రేమ కానుక అంటున్నారు.
అయితే ఆయన తను మొత్తాన్నీ నాకు కానుకగా మా పెళ్లి తోనే ఇచ్చేసుకున్నారు’’ అని ఆపరేషన్ టేబుల్ మీదకు వెళ్లబోయే ముందు రీటా సంతృప్తిగా నవ్వుతూ అన్నారు. ఆమెలో భయం లేదు. ఆ కళ్లల్లో భర్తపై ఆరాధన తప్ప. వాలెంటైన్స్ డే రోజు ఆపరేషన్ జరగబోతుండటం గురించి వినోద్ కూడా తన భార్య ఏమన్నారో, ఆమే అదే అన్నారు. ‘‘ప్రేమికుల రోజు ఇస్తున్నారు. ఇది మీ ప్రేమ కానుకా..’ అని అంటే.. ‘‘కాదు, పెళ్లి రోజు కానుకే. ప్రేమతో ఇస్తున్న కానుక’’ అని నవ్వారు. నిజానికైతే ఆయన కానుకలా అనుకోవడం లేదు. భార్యతో అన్నీ షేర్ చేసుకున్నట్లే తన శరీరంలోని కొంత భాగాన్ని షేర్ చేసుకుంటున్నానని అన్నారు. విషయం మన వరకు వచ్చిందంటే ఇవేవీ ఆ భార్యాభర్తలు చెప్పుకున్నవి కావు. ఉత్సాహం కొద్దీ ఆ ఆసుపత్రి డాక్టర్లు మీడియాకు వెల్లడించినవి.
∙∙
మూడేళ్ల క్రితం తొలిసారి రీటాబెన్‌లో ‘ఆటోఇమ్యూన్ కిడ్నీ డిస్‌ఫంక్షన్’ ఉన్నట్లు బయటపడింది. మూడేళ్లుగా ఆమె మందులు వాడుతున్నారు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి బయటి నుంచి వచ్చే శత్రువుతో పోరాడి సంహరిస్తుంది. అయితే కొన్నిసార్లు పొరపాటున దేహంలోని కణాలనే శత్రువులుగా భావించి వాటిని దెబ్బతీయడం మొదలుపెడుతుంది. అదే ఆటో ఇమ్యూన్ డిస్‌ఫంక్షన్. రీటాలో అది ఆమె కిడ్నీపై ప్రభావం చూపెట్టింది. మందుల శక్తి క్షీణించి క్రమంగా ఆమె పరిస్థితి ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు వచ్చింది. ఎవరిస్తారు కిడ్నీ? ఇవ్వాలని సొంతవాళ్లే ముందుకు వచ్చినా చాలామందికి కిడ్నీ ‘సెట్’ కాదు. కానీ వీళ్ల ప్రేమబలమేమో వినోద్ కిడ్నీని రీటా మార్చడానికి అడ్డంకులేమీ ఉండబోవని రిపోర్ట్ వచ్చింది. వినోద్ సంతోషించారు. రీటాలో మాత్రం ఆందోళన.
ఆపరేషన్ తర్వాత ఆయన తిరిగా మామూలుగానే ఉండగలరా అనే ఆందోళన. తనకేం పర్వాలేదు అని డాక్టర్ల కంటే ఎక్కువగా భర్త ఆమెకు ధైర్యం చెప్పాడు. కిడ్నీ మార్పించుకోడానికి మానసికంగా భార్యను సిద్ధం చేశాడు. ‘‘అన్నీ బాగున్నప్పుడు సంతోషంగా కలిసి ఉంటాం. బాగోలేనప్పుడు కూడా ఆ సంతోషాన్ని నిలిపేది భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ, గౌరవం మాత్రమే’’ అంటారు వినోద్. ‘‘ఈయన నా భార్తగా దొరకడం నేను చేసుకున్న అదృష్టం’’ అని రీటాబెన్. ‘‘కిడ్నీ సమస్య పెరిగిపోయి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది. ఆ సమయంలో తన కిడ్నీ ఇచ్చేందుకు నా భర్త ముందుకు వచ్చారు. ఇస్తున్నది తన కిడ్నీనే కావచ్చు. పోస్తున్నది మాత్రం ఊపిరే’’ అన్నారు రీటా కంటతడితో. ప్రేమను ఎంత ఉష్ణంలోనూ వాడిపోనివ్వని తడి అది.
Comments
Please login to add a commentAdd a comment