మరుగుదొడ్డిలో కిలో బంగారం!
న్యూఢిల్లీ: విమానంలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తి కస్టమ్స్ అధికారుల తనిఖీలకు భయపడి కిలో బంగారాన్ని విమానంలోని మరుగుదొడ్డిలో దాచి ఉంచాడు. విమాన సిబ్బంది చాకచక్యంగా తనిఖీలు నిర్వహించడంతో అతగాడి బండారం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. గురువారం దుబాయ్ నుంచి కొచ్చికి చేరుకున్న స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా పలుమార్లు విమానంలోని మరుగుదొడ్డి(లావెటరి)కి వెళ్లడం గమనించిన విమానసిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లావెట్రీలోని టిష్యూ పేపర్ బాక్స్ వెనుకాల పేపర్లో చుట్టి దాచి ఉంచిన కిలో బంగారు కడ్డీలను సిబ్బంది కనిపెట్టారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.