జైపూర్ : రాజస్థాన్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పదిమంది దుర్మరణం చెందగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. యాత్రికులతో హరిద్వార్ వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి ఉదయ్‌పూర్ వద్ద లోయలో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
బాధితులంతా గుజరాత్‌కు చెందినవారు. వీరంతా యాత్రా స్థలాల సందర్శన కోసం గత రాత్రి అహ్మదాబాద్ నుంచి బయల్దేరారు. ఈ ప్రమాదంపై ఉదయ్‌పూర్ ఎస్పీ మాట్లాడుతూ... బస్సు డ్రైవర్ ...ద్విచక్రవాహనాన్ని తప్పించబోయాడని, ఈ సందర్భంగా బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు తెలిపారు.
ప్రధాని దిగ్భ్రాంతి
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికులతో హరిద్వార్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడి 10మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ప్రధానిన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.