ప్లీజ్...మమ్మల్ని చంపేయండి..
రాంచి: ఇరవై ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నాం.. దయచేసి మమ్మల్ని విడుదల చేయండి...లేదా మెర్సీ కిల్లింగ్ చేయండి అంటూ 130 మంది ఖైదీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మొరపెట్టుకున్నారు. దీనికి సంబంధించి జార్ఖండ్ రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలు ఖైదీలు గత గురువారం రాష్ట్రపతికి ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది.
తమ కుటుంబం దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతోందని.. తమ పిల్లలు చదువు సంధ్యా లేకుండా అల్లాడిపోతున్నారని, వారి దుర్భర పరిస్థితి ..తమకు తీవ్ర మనస్తాపానికి గురి చేసి, మానసికంగా కృంగదీస్తుందని వారు...రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. శిక్షా కాలం పూర్తియినా ఇంకా తమను విడుదల చేయడం లేదని ఖైదీలు ఆరోపిస్తున్నారు.
మావోయిస్టులకు పునరావాసం, ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శిక్షాకాలం పూర్తయిన ఖైదీలందర్నీ తక్షణమే విడుదల చేయాలని, లేదంటే మెర్సీ కిల్లింగ్ చేయాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జార్ఖండ్ గవర్నర్ , ముఖ్యమంత్రి తదితరులను విజ్ఞప్తి చేస్తూ ఈ లేఖ రాశారు.
దాదాపు 130 మంది ఖైదీలు సంతకం చేసిన ఆ లేఖను జైలు అధికారులకు అందజేశారు. ఆ లేఖను జైలు సూపరిండెంట్ అశోక్ కుమార్ చౌదరీ సంబంధిత అధికారులకు పంపించారు. కాగా అయితే రాష్ట్ర ఖైదీల క్షమాభిక్ష సిపార్సు సంఘం మేరకు సత్ప్రర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం ప్రతీ సంవత్సరం విడుదల చేస్తుందని ఓ జైలు అధికారి తెలిపారు. అయితే గత జూన్ 20 తర్వాత నుండి ఇంతవరకు ఆ కమిటీ సమావేశం కాలేదని సమాచారం.