mercy killing
-
మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని ట్వీట్
బంజారాహిల్స్: ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేకపోతున్నానని, తన కారుణ్య మరణానికి (మెర్సీ కిల్లింగ్) అనుమతినివ్వాలంటూ ఒకరు తెలంగాణ సీఎంఓ, మంత్రి కేటీఆర్, డీజీపీ, నగర పోలీసు కమిషనర్, బంజారాహిల్స్ పోలీసులకు ట్వీట్ చేశారు. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్ ప్రాంతానికి చెందిన జితేంద్ర శ్రీరాంగిరి (43) ప్రమాదం బారిన పడి మెరుగైన వైద్యం కోసం గతేడాది నవంబరులో నగరానికి వచ్చాడు. కాలికి ఆరు ఆపరేషన్లు నిర్వహించిన అనంతరం ఇక్కడున్న బ్రిన్నోవా రిహాబిలిటేషన్ సెంటర్లో చేరారు. నెలకు లక్ష రూపాయల ఖర్చుతో ఒంటరిగా చేరిన ఆయన స్నేహితుల ద్వారా తన వైద్య ఖర్చులకు అవసరమైన డబ్బులను సేకరించి చెల్లిస్తున్నారు. కాగా జనవరి నాటికి రూ.2.8 లక్షలు చెల్లించిన అతను మిగిలిన డబ్బులు చెల్లించలేకపోయారు. డబ్బుల కోసం ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడి తేవడంతోపాటు తనకు ఆహారం అందించడం లేదని, టీవీ కట్ చేశారంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో తనకు మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలంటూ ఆయన వారందరికీ ట్వీట్ ద్వారా వేడుకున్నారు. (చదవండి: 'బ్లాక్ గ్రూప్’ అగ్గి పెట్టింది!) -
మెర్సీ కిల్లింగ్ : దరఖాస్తు చేసిన గంటకే
చిత్తూరు : దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్య... వైద్య చికిత్సల కోసం ఎన్ని ఆస్పత్రులు చుట్టూ తిరిగినా కారణాని ఫలితం.... మరోవైపు తలకు మించిన భారంగా మారిన అప్పులు.... ఇక ఆరోగ్యం ఎంతకీ మెరుగుపడదని తేల్చి చెప్పిన వైద్యులు. ఈ నేపథ్యంలో తమ కుమారుడి మెర్సీ కిల్లింగ్‌కి అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు కుటుంబ సభ్యులు. దరఖాస్తు చేసిన గంట వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడా బాలుడు. హృదయాన్ని కలిచి వేసే ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఐదేళ్లుగా చిత్తూరు జిల్లాకు చౌడేపల్లి మండలం బీర్నేపల్లికి చెందిన హర్షవర్థన్ (9) ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య చికిత్స కోసం అతని తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రికి లేదు. ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా హర్షవర్థన్ ఆరోగ్యం మెరుగుపడలేదు. మరోవైపు అతని వైద్య చికిత్స కోసం అందినకాడల్లా అప్పులు చేశారు తల్లిదండ్రులు. ఐదేళ్లలో మొత్తం రూ. 4 లక్షలకు పైగానే అప్పు అయ్యింది. గంటలోపే ఏళ్లు గడుస్తున్నా.. అప్పులు పెరుగుతున్నా ఎంతకీ హర్షవర్థన్ ఆరోగ్యం మెరుగుపడలేదు. మరోవైపు హర్షవర్థన్ ఆరోగ్యంపై డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. వైద్యం కోసం అప్పులు చేయలేక, కుమారుడు పడుతున్న యాతన చూడలేక మెర్సీ కిల్లింగ్‌కు వెళ్లాలని ఆ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. దీంతో ఈ రోజు పుంగనూరు కోర్టులో మెర్సి కిల్లింగ్ కోసం హర్షవర్థన్ తల్లిదండ్రులు దరఖాస్తు చేశారు. వారు దరఖాస్తు చేసిన తర్వాత గంట వ్యవధిలోనే అనారోగ్యంతో ఆ బాలుడు మరణించాడు. ఊహించని ఈ మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
పత్రికా కథనంపై సీఎం జగన్ స్పందన.. చికిత్సకు ఆదేశాలు
సాక్షి, అమరావతి : ‘కరుణ చూపండి.. మరణం ప్రసాదించండి’ అనే శీర్షికన చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన చిన్నారి సుహానా ఆరోగ్య పరిస్థితిపై సాక్షి దినపత్రికలో శుక్రవారం ఓ కథనం వచ్చింది. ఏడాది వయసున్న సుహానా దీనావస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. చిన్నారి ఆరోగ్యం గురించి చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సుహానా చికిత్సకు అవసరమయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చిన్నారికి రోజువారీగా అవసరమయ్యే ఇన్సులిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి నుంచే ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు. సుహానా ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య స్థితిని పర్యవేక్షించాలని సీఎం అధికారులకు చెప్పారు. మూడో బిడ్డకు అదే పరిస్థితి.. బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన బావాజాన్, షబానాకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. గతంలో ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు జన్మించిన కొద్ది రోజుల వ్యవధిలోనే షుగర్ స్ధాయి పడిపోవడంతో చనిపోయారు. ఈ క్రమంలో ఏడాది క్రితం జన్మించిన చిన్నారి సుహానాకు శారీరక ఎదుగుల లేకపోవడంతో వైద్యులను సంప్రదించారు. ఆమెకు కూడా షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో అప్పులు చేసి మరీ వైద్యం చేయిస్తూ వస్తున్నారు. అయితే, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో సుహానాకు వైద్యం అందించడం గగనమవుతోంది. దీంతో చిన్నారి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వివరాలు సాక్షి పత్రికలో ప్రచురితం కావడంతో సీఎం జగన్ స్పందించి చర్యలకు ఆదేశించారు. -
చిత్తూరు జిల్లాలో మెర్సీకిల్లింగ్ కేసు
-
చనిపోవడమూ ఓ హక్కేనా?
సాక్షి, ఇంటర్నేషనల్ : మరణం వాయిదా వేయడం మినహా మరే ఆశ లేనప్పుడు, శారీరక బాధను భరించలేని దయనీయ పరిస్థితిలో.. రోగి లేదా అతని తరపున నమ్మకమైన వ్యక్తి అనుమతితో కారుణ్య మరణం ప్రసాదించవచ్చు. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో భాగమే. - భారత సుప్రీంకోర్టు 42 ఏళ్లుగా మంచానికే పరిమితమై తీవ్ర దుఃఖం అనుభవించిన అరుణ రామచంద్ర షాన్‌బాగ్(ముంబయి).. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుపై విధంగా వ్యాఖ్యానించింది. అయితే ఇలాంటి కేసే ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో ప్రజలను రెండుగా చీల్చింది. పది సంవత్సరాలనుంచి అచేతన స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి కారుణ్య మరణం ప్రసాదించాలని సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు తమ మద్దతును తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ లాంబార్ట్ 2008లో రోడ్డు ప్రమాదంలో గాయపడి అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. వైద్య నిపుణులు కూడా అతడిని మామూలు స్థితికి తీసుకు రావడం కష్టమని తేల్చారు. దీంతో విన్సెంట్ భార్య కూడా కారుణ్య మరణానికి ఒప్పుకుంది. ప్రమాదం జరిగాక తనకు మరణం ప్రసాదించమని తనని కోరాడని తెలిపింది. దీంతో పదేళ్ల సుదీర్ఘకాలంలో జీవించే హక్కా?, చనిపోయే హక్కా? అంటూ నాటి నుంచి ఫ్రెంచ్ రాజకీయ నాయకుల చేతితో అతడు బంతిలా మారాడు. విన్సెంట్ కేసు ఫ్రెంచ్ న్యాయస్థానాలతో పాటు, యూరోపియన్ యూనియన్ కోర్టుకు వెళ్లింది. చివరకు న్యాయస్థానం కారుణ్య మరణానికి అంగీకరించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా, విన్సెంట్ తల్లి మాత్రం కారుణ్య మరణానికి ససేమిరా అంటోంది. తన కుమారునికి వైద్య సేవలు నిలిపివేయడాన్ని హింసగానే భావించాలని కోరుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మెక్రాన్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన అధ్యక్షుడు ‘ఏ నిర్ణయం తీసుకునేది న్యాయపరంగా సంరక్షణ ఉన్న బాధితుని భార్యకే ఉంటుందని’ తేల్చి చెప్పారు. దీంతో మనకు ఇష్టమైన వారు మన కళ్లముందే దూరం అవుతున్నారని బాధ పడుతున్నతల్లికి సంఘీభావంగా కొందరు, ఇంత కష్టమైన బతుకు బతికే కన్నా చనిపోవడమే మేలని సర్దిచెప్పుకొంటున్న భార్యవైపు కొందరు మద్దతు తెలుపుతూ ఈ ‘విషాద పరీక్ష’పై ఫ్రెంచ్ దేశీయులు చర్చించుకుంటున్నారు. -
చరిత్రాత్మక తీర్పు
వైద్య కారణాలరీత్యా సుదీర్ఘకాలం అచేతన లేదా అర్థ చేతన స్థితిలో ఉన్నవారు సమాజంలోని ఇతరుల్లా తమకు నచ్చినట్టుగా జీవించలేరు. అటువంటివారు మర ణాన్ని ప్రసాదించమని కోరడం చట్టబద్ధమవుతుందా కాదా అనే ప్రశ్నకు ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం నుంచి జవాబు లభించింది. హుందాగా, గౌరవప్రదంగా జీవించడం ప్రాథమిక హక్కు అయినట్టే హుందాగా మరణించాలనుకోవడం కూడా ప్రాథమిక హక్కే అవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృ త్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం చరిత్రాత్మక తీర్పులో తేల్చి చెప్పింది. ఆసుపత్రుల్లో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తూ నిస్సహాయ స్థితికి చేరుకున్నవారు ‘పాక్షిక కారుణ్య మరణాన్ని’ కోరుకునే వీలు కల్పిస్తూ... ఈ విషయంలో పార్లమెంటు ఒక చట్టం చేసేవరకూ అమల్లో ఉండేలా కొన్ని మార్గ దర్శకాలను రూపొందించింది. ఎంతటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకున్నవారిౖకైనా అర్ధాంతరంగా తనువు చాలించేందుకు అవకాశమీయడం హత్య చేయడంతో సమానమని ప్రపంచ దేశాల్లో చాలాచోట్ల భావిస్తారు. అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, బెల్జియం, కొలంబియా, లగ్జెంబర్గ్, కెనడా వంటి 27 దేశాల్లో మాత్రమే కారుణ్య మరణానికి అనుమతి ఉంది. అయితే వీటిల్లో ‘క్రియాశీల కారుణ్య మరణానికి’ అనుమతించేవి కొన్నయితే, ‘పాక్షిక కారుణ్య మరణానికి’ అనుమతించేవి మరికొన్ని. పైగా అమె రికా, ఆస్ట్రేలియా వంటిచోట్ల దేశమంతా ఒకే విధానం అమల్లో లేదు. ఆ దేశాల్లో కొన్ని రాష్ట్రాలు కారుణ్యమరణాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాయి. చట్ట పరిభాషలో రోగికి మోతాదుకు మించి మందులిచ్చి మరణానికి చేరువయ్యేలా చేయడం ‘క్రియాశీల కారుణ్య మరణం’ అవుతుంది. అలాకాక జీవస్పందన ఉండేందుకు దోహదపడే కీలకమైన మందుల్ని రోగికి ఇవ్వడం ఆపేస్తే లేదా చేయాల్సిన చికి త్సను నిలుపుచేస్తే సంభవించే మరణం ‘పాక్షిక కారుణ్య మరణం’ అవుతుంది. ఈ రెండూ వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సినవే. రోగి లేదా అతని సన్నిహితులు సొంతంగా నిర్ణయించుకుని అమలు చేసేవి కాదు. నైతికంగా అయినా, విలువల పరంగానైనా ఈ రెండు విధానాలూ హత్య చేయడంతో సమానమని వాదించేవారు కొందరైతే... ‘క్రియాశీల కారుణ్యమరణం’ మాత్రం స్పష్టంగా హత్యేనని చెప్పేవారు మరికొందరు. ఇది ఒక నిండు జీవితాన్ని ముగించడానికి సంబంధించిన అంశం గనుక సహజంగానే దీన్లో సామాజిక, మతపరమైన అంశాలు కూడా ఇమిడి ఉంటాయి. నిజానికి ఈ కారుణ్య మరణం అంశం మన దేశంలో చర్చకు రావడానికి ప్రధాన కారణం నలభై రెండేళ్లపాటు అచేతన స్థితిలో మంచానికే పరిమితమై ఉండిపోయిన అరుణా రామచంద్ర శాన్‌బాగ్ అనే యువతి. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేఈఎం) ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తూ ఆమె అత్యాచారా నికి గురైంది. ఆ దుర్మార్గుడు అరుణ మెడకు ఇనుపగొలుసు బిగించి ఈడ్చుకుపో వడం పర్యవసానంగా మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ఆమె శాశ్వత అచేతనస్థితికి వెళ్లిపోయింది. ఆ ఆసుపత్రిలో ఆమెతో పనిచేసిన సహ సిబ్బంది, కాలక్రమంలో అక్కడ ఉద్యోగ విధుల్లో చేరినవారు ఈ నాలుగు దశా బ్దాలూ అరుణను కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే అరుణ చలనరహిత స్థితిలో ఉండటాన్ని తట్టుకోలేని ఆమె స్నేహితురాలు పింకీ విరానీ 2009లో ఆమెకు కారుణ్యమరణం ప్రసాదించాలని 2009లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకు మూడేళ్ల ముందు అంటే... 2006లో జస్టిస్ ఎం. జగన్నాథరావు నేతృత్వంలోని లా కమిషన్ ఈ అంశంపై విపులంగా చర్చించింది. లా కమిషన్ నివే దికను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలించినా ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదు. ఇదే అంశంపై తిరిగి జస్టిస్ పీవీ రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్ కూడా 2012లో సిఫార్సుచేసింది. ఇందుకోసం ముసాయిదా బిల్లును సైతం రూపొందిం చింది. దాంతోపాటే అది దుర్వినియోగమయ్యే అవకాశం లేకపోలేదని కూడా హెచ్చరించింది. అరుణ కేసులో 2011లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ అసా ధారణ పరిస్థితుల్లో కారుణ్యమరణానికి అనుమతినీయవచ్చునంటూ పాక్షిక చట్టబ ద్ధత కల్పించింది. కానీ ఇది అరుణా శాన్‌బాగ్ విషయంలో వర్తించబోదని తెలి పింది. చివరకు ఆమె 2015 మేలో కన్నుమూసింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం... రోగి మానసిక స్వస్థతతో ఉండి, తనకెదురుకాగల పరిస్థితేమిటో అవగాహన చేసుకోగల సామర్ధ్యం ఉన్న సమయంలో మున్ముందు తాను అచేతన స్థితికి వెళ్లినపక్షంలో వైద్య చికిత్స నిలిపేయవచ్చునని సూచిస్తూ వైద్యులకు ‘సజీవ వీలునామా’ అంద జేయాలి. చికిత్స వల్ల మరణాన్ని వాయిదా వేయడం మినహా మరే ప్రయోజనమూ ఉండదని రోగి గ్రహించినప్పుడు వైద్య చికిత్సను తిరస్కరించే హక్కు అతడికి/ ఆమెకు ఉంటుందని ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయం ఎన్నదగ్గది. అయితే ఇలాంటి ముందస్తు వీలునామా విధానం కొన్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యం బారినపడేవారికి, వృద్ధాప్యంలోకి అడుగిడినవారికి ఇది ప్రాణాంతకంగా మారుతుంది. వారిని ‘త్వరగా’ వదుల్చుకోవాలని, ఆస్తిపాస్తుల్ని రాబట్టుకోవాలని చూసే బంధువులు ఆ రోగికి మాయ మాటలు చెప్పి లేదా నయానో, భయానో ఒప్పించి ‘సజీవ వీలునామా’కు ఒత్తిడి చేయరన్న గ్యారెంటీ ఏమీ లేదు. దురాశ, స్వార్ధం, విలువల లేమి వంటివి వ్యక్తులను దేనికైనా దిగజారుస్తాయి. అలాగే తొలుత అనుమతినిచ్చిన రోగులే తదుపరి మనసు మార్చుకునే అవకాశం లేకపోలేదు. కానీ ఆ సమయానికి దాన్ని వైద్యులకు వ్యక్తపరిచే స్థితిలో వారు ఉండకపోవచ్చు. రోగిని మాత్రమే కాక... సమాజాన్నంతటినీ పరిగణనలోకి తీసుకున్నపక్షంలో తాజా విధానం అమలు ఎంత సంక్లిష్టమైనదో అర్ధమవుతుంది. కనుక ఆచితూచి దీన్ని అమలు చేయడం ఉత్తమం. -
కారుణ్య మరణానికి అనుమతివ్వండి
-
కారుణ్య మరణానికి అనుమతివ్వండి
మదనపల్లి: శక్తికి మించి ఖర్చు చేశారు.. అయినా తమ కూతురిని కాపాడుకోలేని పరిస్థితి. దీంతో తమ కళ్ల ముందే నరకయాతన పడుతున్న కుమార్తె ను చూడలేని ఆ తల్లిదండ్రులు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించారు. వివరాలు.. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన బొగ్గల చిన్నరెడ్డప్ప, సునిత దంపతుల ఆరేళ్ల కూతురు శృతిహాసిని గత కొన్నేళ్లుగా న్యూరోప్రైబోమా వ్యాధితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకుండాపోయింది. ప్రైవేట్ వైద్యం చేయించే స్థోమత లేక మానసికంగా కుంగిపోయారు. దీంతో చేసేదేమి లేక మెడ నొప్పితో కూతురు చేస్తున్న ఆర్తనాదాలు వినే ఓపిక తమకు లేదని.. తమ కూతురికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరుతూ ఆ జంట మదనపల్లి రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి కేవీ మహాలక్ష్మీకి అర్జీ పెట్టుకున్నారు. -
బిడ్డ కారుణ్యమరణానికి అనుమతించండి
పుంగనూరులో తల్లిదండ్రుల అభ్యర్థన తోసిపుచ్చిన న్యాయమూర్తి వైద్యానికి చొరవ తీసుకుంటామని కౌన్సెలింగ్ పుంగనూరు: బీద కుటుంబం..దారుణమైన వ్యాధి సోకింది. ఉన్నదంతా వైద్యానికి వెచ్చించినా నయంకాలేదు. మరణానికి చేరువవుతున్న బిడ్డను చూడలేక అతనికి కారుణ్యమరణానికి అనుమతించాలని తల్లిదండ్రులు అభ్యర్థించిన వైనం చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగంది. రామసముద్రం మండలం దిన్నిపల్లెకు చెందిన బుడ్డప్పకు కర్నాటక సోమయాజులపల్లెకు చెందిన నరసమ్మతో 2010లో పెళ్లయింది. బుడ్డప్ప పుంగనూరులో క్షౌరవృత్తి చేసుకుంటున్నాడు. వీరికి మహేష్ (5), వేదవతి(3) పిల్లలు. గత సంవత్సరం మహేష్ ఆనారోగ్యానికి గురయ్యాడు. బెంగళూరులోని ఇందిరాగాందీ వైద్యశాలలో 30 రోజుల పాటు చికిత్స చేయించారు. అక్కడి వైద్యులు బోన్క్యాన్సర్గా నిర్ధారించారు. అప్పటికే అప్పులు చేసి, సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసిన బుడ్డప్పకు ఆర్థికంగా చితికిపోయాడు. ఇబ్బందులకు గురైయ్యాడు. మరోమారు అప్పు చేసి వేలూరు సీఎంసీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్సకు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో నిశ్చేష్టుడయ్యాడు. ఏం చేయాలో పాలుపోలేదు. అంత డబ్బులు సమకూర్చలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. మరోపక్క కళ్లెదుట కుమారుడు మృత్యువుకు దగ్గరవుతూ అవస్థ పడటాన్ని చూసి భరించలేకపోయారు ఆ దంపతులు. వైద్యం చేయించే స్తోమత లేని నిస్సహాయ స్థితిలో తమ బిడ్డకు కారుణ్యమరణానికి అనుమతించాలని ఈ దంపతులు శనివారం పుంగనూరులో న్యాయమూర్తి మోతీలాల్‌కు వినతిపత్రం అందజేశారు. న్యాయమూర్తి మోతీలాల్ చలించిపోయారు. ఇందుకు అనుమతి ఇవ్వలేమని సున్నితంగా చెప్పారు. మండల న్యాయసేవా సమితి ద్వారా బిడ్డకు చికిత్స చేయించేందుకు న్యాయస్థానం చొరవ తీసుకుంటుందన్నారు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఓదార్చి కాస్సేపు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయమై న్యాయమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడుతున్న మహేష్‌కు చికిత్స చే యించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
మావాడిని చిరంజీవిని చేయండి
ఓ నిస్సహాయుడి తల్లిదండ్రుల మొర కారుణ్యమరణానికి అనుమతించాలని వేడుకోలు తీవ్ర అనారోగ్యంతో అచేతనంగా కొడుకు ఏమీ చేయలేమన్న వైద్యులు అవయవదానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు పూతలపట్టు: చలనంలేని బిడ్డను కళ్లముందు చూడలేక ఆ తల్లిదండ్రులు తమలాంటి కష్టం మరెవరికీ రాకూడదంటూ దు:ఖాన్ని దిగమింగుకుంటున్నారు. లక్షలు వెచ్చించినా బతకడని వైద్యులు తేల్చేయడంతో తమ బిడ్డను మరొకరిలో చూసుకోవాలని ఆ పేద తల్లితండ్రులు ఆరాటపడుతున్నారు. ఇందుకోసం తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గోపాలక్రిష్ణాపురానికి చెందిన ఉమాపతి, కవితల మొదటి సంతానం నిరంజన్. తొమ్మిదేళ్ల్ల వయసులోనే ఈ బిడ్డకు తల భాగం పెద్దది కావడంతో స్విమ్స్‌కు తీసుకువచ్చారు. హైడ్రోసిఫాలెస్ వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్‌కు పది లక్షలు ఖర్చుఅవుతుందన్నారు. ఆ పేద దంపతులు ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి బెంగళూరులోని నిమ్హాన్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించారు. కొన్నాళ్లు బాగున్నా సమస్య పునరావృతమైంది. దీంతో మళ్లీ ఆపరేషన్ చేశారు. అయినా వ్యాధి ముదిరిపోయింది. వారం రోజుల క్రితం మరోసారి బెంగళూరులోని రామయ్య హాస్పిటల్లో చేసిన ఆపరేషన్ కూడా ఫలించలేదు. ఆక్సిజన్ ఉన్నంత సేపు నిరంజన్ బతికుంటాడని.. తీస్తే చనిపోతాడని వైద్యులు తేల్చి చెప్పారు. చేసేదిలేక ఉమాపతి దంపతులు తమ బిడ్డను ఇంటికి తీసుకొచ్చేశారు. బిడ్డ అచేతనంగా పడి ఉండటాన్ని చూసి తల్లితండ్రులు క్షణక్షణం తల్లడిల్లిపోతున్నారు. నిరంజన్ అవయవాలు దానం చేసి మరికొందరిలోనైనా బిడ్డను చూసుకుంటామనే భావనకు వచ్చేశారు. సత్వరమే. కారుణ్య మరణానికి అనుమతించాలని అభ్యర్థిస్తున్నారు. బిడ్డ ప్రాణం పోయేలోగా అవయవదానంతో మరొకరి ప్రాణాన్ని నిలపాలనే తమ కాంక్ష నెరవేర్చాలని నిరంజన్ తల్లితండ్రులు (9490250874) కోరుతున్నారు. కారుణ్య మరణానికి అనుమతించాలి సాధారణంగా అనారోగ్య కేసుల్లో అవయవదానానికి చట్టం సమ్మతించదు. బ్రెయిన్ డెడ్.. క్లినికల్లీ డెత్ లాంటి సందర్భాల్లోనే ఇది వీలుపడుతుంది. తొలుత బాధితుని తల్లితండ్రులు కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి వస్తేనే అవయవదానం సాథ్యమమవుతుంది. దేశంలో అనారోగ్యం బారిన పడి మృత్యువు అంచున ఉన్నవారెందరో అవయవదానానికి సిద్ధంగా ఉన్నా చట్టపరంగా అనుమతి లేదు. - గూడూరి సీతామహాలక్ష్మి, అఖిల భారత అవయవ దాతల సంఘం -
హర్షితకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్ : కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలని కోరుతూ హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితురాలు హర్షిత(11)కు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. హర్షితకు శస్త్రచికిత్స చేసేందుకు ఓ కార్పొరేట్ ఆస్పత్రి ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. అందుకోసం ఆరోగ్యశ్రీ నుంచి రూ.10.50 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని విరంచి ఆస్పత్రి రూపొందించిన వి కనెక్ట్ విరంచి మొబైల్ యాప్‌ను శుక్రవారం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరంలో అధునాతన హంగులతో 600 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని విరంచి ఆసుపత్రి యాజమాన్యాన్ని కొనియాడారు. ఇదిలా ఉంటే మంత్రి విజ్ఞప్తికి విరంచి ఆస్పత్రి చైర్మన్ విష్ కొంపెల్లా స్పందించారు. సామాజిక సేవలో భాగంగా తమ ఆస్పత్రిలో ప్రతి నెలా ఒకరికి ఉచితంగా అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. తమ ఆస్పత్రిలో మరో నెల రోజుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు ప్రారంభమవుతాయన్నారు.ఈ కార్యక్ర మంలో చైర్ పర్సన్ మాధవీలత కొంపెల్లా, సీఎంవో శ్రీనివాస్ మైన, మెడికల్ డెరైక్టర్ ఎన్‌ఎస్‌వీవీ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కుమార్తె కోసం హెచ్చార్సీని ఆశ్రయించిన తల్లిదండ్రులు
-
'కుమార్తెను చంపుకునేందుకు అనుమతించండి'
హైదరాబాద్: తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతించాలని రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన దంపతులు గురువారం హెచ్చార్సీని ఆశ్రయించారు. జగద్గిరిగుట్టకు చెందిన రామచంద్రారెడ్డి, శ్యామల దంపతుల కుమార్తె హర్షిత (11) గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతోంది. లివర్ మార్పిడికి రూ.25 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావటంతో అంత మొత్తం నగదు సమకూర్చుకోలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తెకు మెర్సీ కిల్లింగ్ అంతిమ పరిష్కారమని ఆ తల్లిదండ్రులు నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు వారు హెచ్చార్సీని ఆశ్రయించి.. తమ చిన్నారి వేదనను చూడలేకున్నామని తెలిపారు. అందువల్ల మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలని కోరారు. -
సర్జరీ చేయించే స్తోమత లేక...
మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి తంబళ్లపల్లె కోర్టును ఆశ్రయించిన దంపతులు హైకోర్టును ఆశ్రయించాలన్న జడ్జి తంబళ్లపల్లె: ఎనిమిది నెలల ఆ చిన్నారికి పుట్టుకతోనే కాలేయ సంబంధిత వ్యాధి వెంటవచ్చింది. కానీ పుట్టింది నిరుపేద కుటుంబంలో కావడంతో సర్జరీ చేయించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోయింది. అయినప్పటికీ నానా కష్టాలుపడి ఒకసారి సర్జరీ చేయిస్తే అది విఫలమైంది. లివర్ పూర్తిగా మార్పుచేస్తే ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందుకు రూ.16 లక్షలదాకా ఖర్చవుతాయంటున్నారు. అయితే అంతసొమ్ము వెచ్చిస్తే స్తోమత లేని ఆ తల్లిదండ్రులు గుండె రాయి చేసుకున్నారు. తమ బిడ్డకిక మరణమే శరణ్యమనుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించారు. హృదయాన్ని పిండేసే ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలివీ.. చిత్తూరుజిల్లా ములకలచెరువు మండలం బత్తలాపురానికి చెందిన రమణప్ప, సరస్వతిలది నిరుపేద కుటుంబం. రమణప్ప బెంగళూరులోని సూపర్మార్కెట్లో సేల్స్‌మన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి గత అక్టోబర్ 10నజ్ఞానసాయి అనే చిన్నారి జన్మించింది. పుట్టుకతోనే ఆ చిన్నారికి బిలియరీ అట్రాసియా(కాలేయం జబ్బు) ఉన్నట్లు నిర్ధారించిన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు రెండు వారాల్లోపు లివర్ ప్రైమరీ సర్జరీ చేయాలన్నారు. రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఖర్చవుతుందన్నారు. నెల తరువాత బెంగళూరు ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి డాక్టర్లు గతేడాది డిసెంబర్ 31న సర్జరీ చేశారు. 4 నెలల తరువాత ఫలితం చెబుతామన్నారు. ఆ ప్రకారం బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షలు చేసిన వైద్యులు సర్జరీ విఫలమైందన్నారు. దీంతో బెంగళూరులోనే నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్చగా.. లివర్ పూర్తిగా మార్పుచేస్తే ఫలితముంటుందని వైద్యులు చెప్పారు. ఇందుకు 16 లక్షలదాకా ఖర్చవుతుందన్నారు. కాలేయం మార్పిడి తర్వాత కోలుకునేవరకు నెలకు రూ.50 వేల విలువైన మందులు వాడాలన్నారు. నాలుగు నెలల్లోపు సర్జరీ చేయాలని, లేకుంటే ప్రమాదమేనని తేల్చిచెప్పారు. అంత ఆర్థికస్తోమత లేని తల్లిదండ్రులు తమ బిడ్డకికే చావే శరణ్యమని భావించారు. తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించాలంటూ గురువారం తంబళ్లపల్లె కోర్టును, తర్వాత మదనపల్లె కోర్టును ఆశ్రయించారు. తంబళ్లపల్లె జడ్జి వాసుదేవ్ స్పందిస్తూ.. ఇలాంటి విషయాల్లో ఉన్నత న్యాయస్థానాలు మాత్రమే నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని, అందువల్ల హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు. మదనపల్లె జడ్జి సైతం ఇదే విషయం చెప్పారు. సీఎం దృష్టికి తీసుకెళ్లినా.. తమ బిడ్డ జబ్బు విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, తిరుపతిలో జరిగిన మహానాడులో వినతిపత్రం సమర్పించానని.. అయినా ఫలితం లేకపోయిందని రమణప్ప ఆవేదన వ్యక్తంచేశారు. దాతలెవరైనా స్పందించి సాయమందించేందుకు 8142272114 నంబరులో సంప్రదించాలని వేడుకున్నారు. -
నన్ను చంపేయండి: ఓ ఖైదీ విన్నపం
-
నన్ను చంపేయండి: ఓ ఖైదీ విన్నపం
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : 'నన్ను విడుదల చేయండి లేదా మెర్సీ కిల్లింగ్ ద్వారానైనా చంపేయండి' అంటూ ఓ ఖైదీ సీఎం, గవర్నర్లతో పాటు పదిమంది అధికారులకు పిటిషన్ పెట్టుకున్నాడు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చిన్నూరు గ్రామానికి చెందిన టి. శ్రీకాంత్(38) అనే వ్యక్తికి 1996లో జరిగిన ఓ హత్య కేసులో జీవిత ఖైదు పడింది. అప్పటి నుంచి కడప సెంట్రల్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. 14 సంవత్సరాల నుంచి జైలులోనే ఉంటున్నా అధికారులు తనను విడుదల చేయకుండా ఉన్నందుకు నిరసనగా ఈవిధంగా పిటిషన్ పెట్టుకున్నాడు. చాలా రోజులుగా జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో-163 విడుదల చేసింది. 364-సెక్షన్ ప్రకారం తనను విడుదల చేయడం సాధ్యం కాదని అధికారులు తెలపడంతో మెర్సీ కిల్లింగ్ ద్వారానైనా చంపేయండంటూ పిటిషన్ పెట్టుకున్నాడు. -
ఆస్పత్రి వద్దు స్వర్గమే ముద్దు
నెట్‌ఇంట్లో నెట్ ... నేర్పుతుంది. మార్చుతుంది. ఏమార్చుతుంది. నెట్ ... కథ చెబుతుంది... కబుర్ల మూట విప్పుతుంది. నెట్ ... విశ్వాసం పంచుతుంది. నమ్మకం పెంచుతుంది. కాస్త అజాగ్రత్తగా ఉంటే నిలువునా ముంచుతుంది. ఈ వారం కాసింత తీపి, కాసింత పులుపు, కొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు కలిపి షడ్రసోపేతం మీకోసం... చూడగానే ముద్దొచ్చే ముఖం. కళ్లలో అనిర్వచనీయ అద్భుత తేజస్సు. నిండా ఐదేళ్ల ప్రాయం. అప్పుడే నిండు నూరేళ్లకు దగ్గరయింది. రోజులు లెక్కపెడుతోంది... ఈ పాప పుట్టుకతోనే చార్కాట్-మ్యారీ-టూత్ డీసీజ్ (సీఎంటీ)అనే ప్రాణాంతక నరాల జబ్బుతో బాధపడుతోంది. కృతిమ శ్వాసతో దీర్ఘశ్వాసను పీలుస్తోంది. శాశ్వతంగా ఆ శ్వాస ఎప్పుడు గాలిలో కలసిపోతోందో తెలియదు. ఆ పాప పేరు జూలియనా స్నో. ఆ పాప తన తల్లితో ‘ఇంట్లోనే ఉండి చనిపోయి స్వర్గానికి వెళ్తాను కానీ ఆస్పత్రికి వెళ్లను’ అన్న సంభాషణ ఇప్పుడు ఇంటర్ నెట్‌ను, వైద్య సమాజాన్ని కుదిపేస్తోంది. కారుణ్య హత్యల మద్దతుదార్లు ఈ సంభాషణను చూపించి చిన్న పిల్లలు సైతం మెర్సీ కిల్లింగ్ విషయంలో నిర్ణయం తీసుకోగలరని వాదిస్తున్నారు. వివాదానికి తెరతీసిన ఈ పాప కథనం ఇప్పుడు ఇంటర్నెట్ లో దుమారం లేపుతోంది. http://www.sakshi.com/news/international/oregon-family-lets-dying-5-year-old-daughter-decide-heaven-or-the-hospital-286945?pfrom=home-top-story తల్లి చెత్త డ్యూటీ కూతురు మంచి బ్యూటీ జిగేల్మనే అందాల రాణి మకుటం... ఒక చెత్త ఏరుకునే మనిషి పాదాలను ముద్దాడింది. ఆ బ్యూటీ క్వీన్ రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టింది. చుట్టూ చెత్త డబ్బాలున్నా, అవి కంపు కొడుతున్నా పట్టించుకోకుండా ఆ బ్యూటీ వచ్చి పాదాల మీద వాలిపోయింది. ఆ చెత్త ఏరుకునే ఆవిడ ఎవరో కాదు. ఈ బ్యూటీ క్వీన్ తల్లి. అంత పేదరికంలో ఉన్నా కూతురు కోరుకున్న పోటీకి పంపించింది ఆ తల్లి. అందుకే గెలిచిన మరుక్షణం కూతురు తల్లిపాదాల ముందు వాలింది. ఖనితా ఫాసెంగ్ అనే ఈ థాయ్‌లాండ్ బ్యూటీక్వీన్ అందం ఆమె వినయం వల్ల మరింత పెరిగింది. ఆమె తల్లి ఒరైత పోర్మావున్ ఇప్పటికీ చెత్త ఏరుకుంటోంది. ఖనితా కూడా తీరిక సమయాల్లో తల్లికి చెత్త సేకరించడంలో సాయం చేస్తోంది. మనసు బ్యూటీయే నిజమైన బ్యూటీ అని తల్లీకూతుళ్లిద్దరూ చెప్పక చెప్పారు. అదే మన కాస్మెటిక్ బ్యూటీలైతే చేతిలో వైన్ గ్లాస్‌తో నోటితో మదర్ తెరిస్సా పలుకులు పలికేవారు. సేవే లక్ష్యం అని చెబుతూనే సినిమా చాన్సుల కోసం వెంపర్లాడేవారు. ఏమంటారు? http://www.sakshi.com/news/international/garbage-collector-gets-to-keep-beauty-queen-crown-287254?pfrom=home-top-story కట్టెపుల్లలేరుకునేది ఇల్లు కట్టేందుకే కట్టప్పా.. కాసిని ఎండుపుల్లలు, కొన్ని కట్టెలు, కొయ్య దుంగలు, బోలెడంత మట్టి ... ఈ మూడు ఉంటే చాలంటున్నాడు ఈ కుర్రాడు. పెళ్లి చేసి చూపించలేనేమో కానీ కచ్చితంగా ఇల్లు కట్టి చూపిస్తానంటున్నాడు ఇతగాడు. కొయ్య దుంగలతో స్తంభాలు, మట్టి, రాళ్లతో ఇల్లు, కర్ర పుల్లలతో నిప్పు రాజేసి, దానిపై పెంకులు కాల్చి తయారు చేసి కప్పు వేసేస్తాడు. ఈ కుర్రాడు ప్రిమిటివ్ టెక్నాలజీ (ఆదిమ సాంకేతికత) అన్న యూట్యూబ్ అకౌంట్ లో మట్టి ఇల్లు కట్టి చూపించాడు. నేను ఎండు పుల్లలు ఏరుతున్నది పిచ్చిపట్టి కాదు కట్టప్పా, ఇల్లు కట్టేందుకు అంటున్నాడీ దేవసేనుడు. ఈ మట్టింటి వాడికి నెట్టింట్లో మూడున్నర లక్షల మంది సబ్ స్క్రైబర్లున్నారు. పద్నాలుగు నిమిషాల వీడియో కచ్చితంగా కట్టిపడేస్తుంది. ఆఫ్రికా, ఏషియాల్లోనే కాదు... ఆకాశ హర్మ్యాల అమెరికాలోనూ ఈ వీడియో ఇప్పుడొక క్రేజ్.... తెగ చూసేస్తున్నారట. దీన్ని చూస్తే... ఓసోస్... ఇల్లు కట్టుకోవడం ఇంత తేలికా అనిపిస్తుంది. ప్రస్తుతానికి కాంక్రీటు కొంపలు, డ్యూప్లెక్స్ దిబ్బల్లో ఎలాగోలా నెట్టుకొచ్చేస్తాం కానీ, మూడో ప్రపంచ యుద్ధం తరువాత నీ లాంటి ఇళ్లే కట్టుకుంటాం బాసూ అని ఆ కుర్రాడికి హామీ ఇచ్చేద్దాం. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం తరువాత మనం వెళ్లేది ఖాయంగా పాతరాతి యుగంలోకే. మనకు మిగిలేది ఖచ్చితంగా మట్టి, బూడిద, ఎండుపుల్లలే! http://whatstrending.com/hoton-youtube/20589-31e-man-builds-hut-completely-out-of-raw-materia పోలీసమ్మ డాన్స్ బేబీ డాన్స్ రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటుంటే పోలీసులు ఏం చేస్తారు? ఎ) లాఠీలకు పనిచెప్తారు. బి)ఇద్దర్నీ నాలుగు పీకుతారు. సి) ఇద్దర్నీ ఠాణాకు తీసుకెళ్లి అత్తవారింటి అతిథి మర్యాదలు చేస్తారు. డి) డాన్స్ చేస్తారు. ఈ నాలుగు జవాబుల్లో ఏదో ఒకదానిపై క్లిక్ చేయమంటే నూటికి నూటొక్క మంది కచ్చితంగా క్లిక్ చేయనిది డి మాత్రమే. కానీ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఓ లేడీ పోలీసు ఇద్దరు అమ్మాయిలు తన్నులాడుకుంటుంటే వాళ్లను విడదీసేందుకు సరిగ్గా ఇదిగో ఈ ఆప్షన్ ‘డి’ నే ఎంచుకుంది. వాళ్లని తనతో డాన్స్ పోటీకి రమ్మని సవాలు చేసింది. మీరు గెలిస్తే కొట్టుకోండి. నేను గెలిస్తే ఇంటికి పొండి అని పందెం వేసింది. డిష్యుం డిష్యుం మని ఒకమ్మాయి డాన్స్ పోటీకి వచ్చింది. కాస్సేపు చేసిందో లేదో కానిస్టేబుల్ డాన్సు ముందు అల్లల్లాడిపోయింది. పందెం ప్రకారం కొట్లాట మాని ఇంటికి పోయింది. ఇప్పుడీ డాన్సింగ్ కాప్ వీడియోను అమెరికాలో లక్షలాది మంది చూస్తున్నారు. పోలీసమ్మ సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. ఆఖరికి ఒబామా కూడా ఆ పోలీసును భేష్ అన్నాడు. http://wixy.com/wixy-mornings/a-cop-broke-up-a-fight-between-teens-by-starting-a-dance-off ఆ వేలును దేవుడు పట్టుకున్నాడు... పుట్టుకతో సెరిబ్రల్ పాల్సీ. నరాలపై స్వాధీనం ఉండదు. వేలు మాట వినదు. నోరు మాట చెప్పలేదు. 1960 నుంచి ఆస్పత్రే ఇల్లు. అందులోని వాళ్లే అయిన వాళ్లు. అయినా పాల్ స్మిత్ అనే ఆయన గొప్ప ఆర్టిస్టు అయ్యాడు. చేతితో కుంచె పట్టుకోలేని స్మిత్ ఆర్టిస్ట్ ఎలా అయ్యాడు? ఆయన బ్రష్... ఆయన వేలు! ఆయన కేన్వాస్ ఆయన ముందున్న పాత టైప్ రైటర్. తన జీవితంలోని సంఘటనల్నే ఆయన ఒక్క వేలు, పది టైప్ రైటర్ కీలతో చిత్రాలుగా గీస్తాడు. ఆ బొమ్మల్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిన్నప్పటి ఇల్లు, ప్రయాణించిన పడవ, ఒబామా, ది లాస్ట్ సప్పర్ చిత్రం ఇలా చూసినవన్నీ చిత్రాలుగా అచ్చు గుద్దినట్టు దించేస్తాడు. నన్ను నడిపిస్తున్నది, బతికిస్తున్నది రెండే రెండు. ఒకటి - దేవుడు. రెండు - నా వేలు... అంటాడు. అన్నీ ఉండీ నిత్యం నిరాశలో కూరుకుపోయేవాళ్లు, ఆత్మహత్యంటే ప్రతి చిన్న సమస్యకీ అదేదో జిందా తిలిస్మాత్ అనుకునే వాళ్లు ఒక్క సారి పాల్ స్మిత్ కి సంబంధించిన ఈ నాలుగున్నర నిమిషాల వీడియోను చూసి తీరాలి. http://www.metaspoon.com/typewriter-artwork-paul-smith/?fb=719M1i1d4099tA &utm_source=719M1i1d4099tA -
ఓ తల్లి ఆవేదన
'లోకంలో చాలామంది మగపిల్లల్నే కనాలనుకుంటారు. నాకు, మా ఆయనకు మాత్రం అమ్మాయి కావాలనుండేది. బహుషా ఈ రోజు నేను చనిపోవాలని కోరుకోవడానికి.. నా పిల్లల్ని చంపేయమని అడగలేక అడగడానికి బహుషా అదే కారణమేమో! నాకిప్పుడు 36 ఏళ్లు. ఇంకో నాలుగైదు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం బతకనని తెలుసు. నా ఒంట్లో శక్తిమొత్తం హరించుకుపోయింది. దాదాపు 14 ఏళ్ల నుంచి సరిగా నిద్రపోలేదు కూడా. బంధువులు చనిపోయినా, వాళ్లింట్లో పెళ్లిళ్లయినా నేను మాత్రం ఇల్లు కదలను. సొంత తమ్ముడి పెళ్లి కూడా నేను లేకుండానే జరిగిపోయింది.. సూర్యుడు బయటికిరాకముందే 18 ఏళ్ల నా పెద్దకొడుకు సులేమ్ నిద్రలేచి అరుస్తూఉంటాడు.. టాయిలెట్‌కు తీసుకెళ్లమని! ఇల్లూడుస్తున్న చీపురును అక్కడే పడేసి వాణ్ని బాత్రూమ్ కి తీసుకెళతా. ప్యాంట్ విప్పి, మూత్రం పోయించి, శుభ్రంగా కాళ్లు కడుగుతా. నేనుగానీ ఇలా చెయ్యకుంటే వాడు పక్క తడిపేస్తాడు. కనీసం జిప్ తీసుకోవడం కూడా రాదు వాడికి. ఆ అలికిడికి 16 ఏళ్ల సుహేబ్కు మెలకువొస్తుంది. లేచింది మొదలు 'అమ్మా.. ఆకలి' అంటూ చంపుతాడు. బ్రషింగ్ చేయించేలోగా వాడి నానమ్మ పాలు, బిస్కెట్లు తినిపించడానికి రెడీ అవుతుంది. బిస్కెట్లు పాలలో పూర్తిగా నాననివ్వాలి. ఘనపదార్థాలను వాడు తినలేడు. అంతలోనే అసిమ్ (14), ఖషిఫ్ (12) నిద్రలేచి పక్కమీదే అటూ ఇటూ దొర్లుతూఉంటారు. అలా దొర్లడంతప్ప కూర్చోవడం, నిల్చోవడం, అన్నం తినడంలాంటివి చేయలేరు. ఎనిమిదేళ్ల కవలలు అవాన్, తైబాలదీ ఇలాంటి పరిస్థితే. ఒకరితర్వాత ఒకరికి ఏదోఒక సేవ చేస్తుండగానే పొద్దుగూకుతుంది. కొద్దిగా కన్నంటుతుందోలేదో.. కాలకృత్యాలు తీర్చమని పిలుస్తారు. పెద్దకొడుకు కుహేబ్ (20), చిన్నమ్మాయి ఉల్తాఫ్ (5) మాత్రం ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఆరుగురు కూడా మొదటి ఐదేళ్లవరకు బాగానే ఉన్నారు. ఆ తరువాతే వారిలో ఎదుగుదల లేకుండాపోయింది. ఒంట్లో సత్తువ ఉండదు. ఎక్కడపడితే అక్కడ కూలబడిపోతారు. వీళ్లకి నయం చేయించడానికి నేను, నా భర్త తిరగని ఊరంటూలేదు. నా ఆరుగురు పిల్లలకు అరుదైన నాడీ సంబంధిత వ్యాధి ఉందని డాక్టర్లు తేల్చారు. మరి నయమవుతుందా అంటే మాత్రం సరైన సమాధానం ఎవరూ చెప్పట్లేదు. చాలామందైతే ఈ పిల్లలు బతకరని చెబుతున్నారు. ఈ మధ్యే మా బంధువులు కొందరు మరణభిక్షకు అర్జీ పెట్టుకోమని సలహా ఇచ్చారు. ఏం చెప్పను.. 'నా పిల్లల్ని చంపేయండి' అని ఏ తల్లైనా అనగలదా!' అంటూ విదారకంగా తన గాథ చెబుతోంది ఆగ్రాకు చెందిన తబసుమ్. ఇస్లాం ధర్మం అంగీకరించినందున వరుసకు సోదరుడయ్యే మహమ్మద్ నజీర్‌తో 1995లో ఆమె పెళ్లయింది. ఆగ్రాలోని ఓ హల్వా దుకాణంలో పనిచేస్తోన్న నజీర్.. రోజుకు 250 రూపాయలు సంపాదిస్తాడు. తిప్పికొడితే ఇద్దరు పిల్లలకికూడా సరైన వైద్యపరీక్షలు చేయించేంత స్తోమతలేదు అతనికి. ఇక ప్రభుత్వ సహాయమంటారా.. గతంలో ఓసారి ఆగ్రా ఎమ్మెల్యే సూచనమేరకు ఆరుగురు పిల్లల్ని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వాతావరణం, వైద్యుల నిర్లక్ష్యం భరించలేక పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఈ మధ్యే ముంబైకి చెందిన ఓ ఎన్జీవో పిల్లలకి నయం చేయిస్తామని ముందుకొచ్చింది. అయితే అంతదూరం పంపాలో లేదో తేల్చుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. 'ఏ డాక్టర్లూ నా పిల్లలకు నయం చేయలేరు. అల్లా ఒక్కడే ఆ పని చేయగలడని నమ్ముతున్నా. ఒకవేళ అలా జరగకుంటే ఆయనే (దేవుడే) వాళ్ల ప్రాణాలు తీసేసుకుంటాడు. నేను మాత్రం నాపిల్లలకు మరణభిక్ష పెట్టమని ప్రభుత్వాన్ని అడగదల్చుకోలేదు' అంటాడు 42 ఏళ్ల నజీర్. -
ప్లీజ్...మమ్మల్ని చంపేయండి..
రాంచి: ఇరవై ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నాం.. దయచేసి మమ్మల్ని విడుదల చేయండి...లేదా మెర్సీ కిల్లింగ్ చేయండి అంటూ 130 మంది ఖైదీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మొరపెట్టుకున్నారు. దీనికి సంబంధించి జార్ఖండ్ రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలు ఖైదీలు గత గురువారం రాష్ట్రపతికి ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. తమ కుటుంబం దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతోందని.. తమ పిల్లలు చదువు సంధ్యా లేకుండా అల్లాడిపోతున్నారని, వారి దుర్భర పరిస్థితి ..తమకు తీవ్ర మనస్తాపానికి గురి చేసి, మానసికంగా కృంగదీస్తుందని వారు...రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. శిక్షా కాలం పూర్తియినా ఇంకా తమను విడుదల చేయడం లేదని ఖైదీలు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులకు పునరావాసం, ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శిక్షాకాలం పూర్తయిన ఖైదీలందర్నీ తక్షణమే విడుదల చేయాలని, లేదంటే మెర్సీ కిల్లింగ్ చేయాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జార్ఖండ్ గవర్నర్ , ముఖ్యమంత్రి తదితరులను విజ్ఞప్తి చేస్తూ ఈ లేఖ రాశారు. దాదాపు 130 మంది ఖైదీలు సంతకం చేసిన ఆ లేఖను జైలు అధికారులకు అందజేశారు. ఆ లేఖను జైలు సూపరిండెంట్ అశోక్ కుమార్ చౌదరీ సంబంధిత అధికారులకు పంపించారు. కాగా అయితే రాష్ట్ర ఖైదీల క్షమాభిక్ష సిపార్సు సంఘం మేరకు సత్ప్రర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం ప్రతీ సంవత్సరం విడుదల చేస్తుందని ఓ జైలు అధికారి తెలిపారు. అయితే గత జూన్ 20 తర్వాత నుండి ఇంతవరకు ఆ కమిటీ సమావేశం కాలేదని సమాచారం.