
మంచంపై పడుకున్న బిడ్డతో తండ్రి ఉమాపతి
ఓ నిస్సహాయుడి తల్లిదండ్రుల మొర
కారుణ్యమరణానికి అనుమతించాలని వేడుకోలు
తీవ్ర అనారోగ్యంతో అచేతనంగా కొడుకు
ఏమీ చేయలేమన్న వైద్యులు
అవయవదానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు
పూతలపట్టు: చలనంలేని బిడ్డను కళ్లముందు చూడలేక ఆ తల్లిదండ్రులు తమలాంటి కష్టం మరెవరికీ రాకూడదంటూ దు:ఖాన్ని దిగమింగుకుంటున్నారు. లక్షలు వెచ్చించినా బతకడని వైద్యులు తేల్చేయడంతో తమ బిడ్డను మరొకరిలో చూసుకోవాలని ఆ పేద తల్లితండ్రులు ఆరాటపడుతున్నారు. ఇందుకోసం తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గోపాలక్రిష్ణాపురానికి చెందిన ఉమాపతి, కవితల మొదటి సంతానం నిరంజన్.
తొమ్మిదేళ్ల్ల వయసులోనే ఈ బిడ్డకు తల భాగం పెద్దది కావడంతో స్విమ్స్‌కు తీసుకువచ్చారు. హైడ్రోసిఫాలెస్ వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్‌కు పది లక్షలు ఖర్చుఅవుతుందన్నారు. ఆ పేద దంపతులు ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి బెంగళూరులోని నిమ్‌హాన్స్ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించారు. కొన్నాళ్లు బాగున్నా సమస్య పునరావృతమైంది. దీంతో మళ్లీ ఆపరేషన్ చేశారు. అయినా వ్యాధి ముదిరిపోయింది. వారం రోజుల క్రితం మరోసారి బెంగళూరులోని రామయ్య హాస్పిటల్‌లో చేసిన ఆపరేషన్ కూడా ఫలించలేదు. ఆక్సిజన్ ఉన్నంత సేపు నిరంజన్ బతికుంటాడని.. తీస్తే చనిపోతాడని వైద్యులు తేల్చి చెప్పారు. చేసేదిలేక ఉమాపతి దంపతులు తమ బిడ్డను ఇంటికి తీసుకొచ్చేశారు. బిడ్డ అచేతనంగా పడి ఉండటాన్ని చూసి తల్లితండ్రులు క్షణక్షణం తల్లడిల్లిపోతున్నారు.
నిరంజన్ అవయవాలు దానం
చేసి మరికొందరిలోనైనా బిడ్డను చూసుకుంటామనే భావనకు వచ్చేశారు. సత్వరమే. కారుణ్య మరణానికి అనుమతించాలని అభ్యర్థిస్తున్నారు. బిడ్డ ప్రాణం పోయేలోగా అవయవదానంతో మరొకరి ప్రాణాన్ని నిలపాలనే తమ కాంక్ష నెరవేర్చాలని నిరంజన్ తల్లితండ్రులు (9490250874) కోరుతున్నారు.
కారుణ్య మరణానికి అనుమతించాలి
సాధారణంగా అనారోగ్య కేసుల్లో అవయవదానానికి చట్టం సమ్మతించదు. బ్రెయిన్ డెడ్.. క్లినికల్లీ డెత్ లాంటి సందర్భాల్లోనే ఇది వీలుపడుతుంది. తొలుత బాధితుని తల్లితండ్రులు కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి వస్తేనే అవయవదానం సాథ్యమమవుతుంది. దేశంలో అనారోగ్యం బారిన పడి మృత్యువు అంచున ఉన్నవారెందరో అవయవదానానికి సిద్ధంగా ఉన్నా చట్టపరంగా అనుమతి లేదు.
- గూడూరి సీతామహాలక్ష్మి, అఖిల భారత అవయవ దాతల సంఘం