
చిత్తూరు : దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్య... వైద్య చికిత్సల కోసం ఎన్ని ఆస్పత్రులు చుట్టూ తిరిగినా కారణాని ఫలితం.... మరోవైపు తలకు మించిన భారంగా మారిన అప్పులు.... ఇక ఆరోగ్యం ఎంతకీ మెరుగుపడదని తేల్చి చెప్పిన వైద్యులు. ఈ నేపథ్యంలో తమ కుమారుడి మెర్సీ కిల్లింగ్‌కి అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు కుటుంబ సభ్యులు. దరఖాస్తు చేసిన గంట వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడా బాలుడు. హృదయాన్ని కలిచి వేసే ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఐదేళ్లుగా
చిత్తూరు జిల్లాకు చౌడేపల్లి మండలం బీర్నేపల్లికి చెందిన హర్షవర్థన్ (9) ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య చికిత్స కోసం అతని తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రికి లేదు. ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా హర్షవర్థన్ ఆరోగ్యం మెరుగుపడలేదు. మరోవైపు అతని వైద్య చికిత్స కోసం అందినకాడల్లా అప్పులు చేశారు తల్లిదండ్రులు. ఐదేళ్లలో మొత్తం రూ. 4 లక్షలకు పైగానే అప్పు అయ్యింది.
గంటలోపే
ఏళ్లు గడుస్తున్నా.. అప్పులు పెరుగుతున్నా ఎంతకీ హర్షవర్థన్ ఆరోగ్యం మెరుగుపడలేదు. మరోవైపు హర్షవర్థన్ ఆరోగ్యంపై డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. వైద్యం కోసం అప్పులు చేయలేక, కుమారుడు పడుతున్న యాతన చూడలేక మెర్సీ కిల్లింగ్‌కు వెళ్లాలని ఆ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. దీంతో ఈ రోజు పుంగనూరు కోర్టులో మెర్సి కిల్లింగ్ కోసం హర్షవర్థన్ తల్లిదండ్రులు దరఖాస్తు చేశారు. వారు దరఖాస్తు చేసిన తర్వాత గంట వ్యవధిలోనే అనారోగ్యంతో ఆ బాలుడు మరణించాడు. ఊహించని ఈ మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.