గ్యాంగ్‌రేప్ చేసి, రైల్లోంచి తోసేసారు
పాట్నా: బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక(14) పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ మైనర్ల ముఠా అనంతరం ఆమెను కదులుతున్న రైల్లోంచి తోసేసిన వైనం కలకలం రేపింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కియుల్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం కనుగొన్నారు. తీవ్ర గ్రాయాలతో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
లఖిసరై జిల్లాలోని లఖోచాక్ గ్రామానికి చెందిన బాధితురాలు పదవ తరగతి చదువుతోంది. గురువారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన ఈ బాలికను సుమారు 6-7 మంది మైనర్లు అపహరించుకుపోయి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరి అకృత్యంతో ఆమె అపస్మారక స్థితిలో జారుకుంది. దీంతో ఆమెను అక్కడినుంచి వన్సిపుర్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి రైలు ఎక్కారు. రైలు కియుల్ జంక్షన్ సమీపిస్తుండగా బాలిక స్పృహలోకి రావడాన్ని గమనించిన దుర్మార్గులు వెంటనే ఆమెను కదులుతున్న రైల్లోంచి బయటికి విసిరేసారు.
బాలికను గుర్తించిన స్థానికులు దగ్గరలో ఉన్న వైద్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరిస్థితి మరింత క్షీణించటంతో, పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంఎచ్)కి తరలించారు. భారీ రక్తస్రావం , పెల్విస్ ఎముకల్లో ఐదుఫ్రాక్చర్లతో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల బృందం వెల్లడించింది.
తనపై లైంగికదాడి జరిగిందని, తిరిగా స్పృహలోకి తిరిగి వచ్చేసరికి రైలులో ఉన్నానని బాధితురాలు తెలిపింది. ఆ దుర్మార్గుల్లో ఇద్దర్ని తమ పొరుగువారు వారేనని, వాళ్లే తనను కదిలే రైలులోనుంచి తోసేసారని పోలీసులకు వివరించింది.
మరోవైపు ఈ ఘటనపై స్పందించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు లఖిసరై డిఎస్పి పంకజ్ కుమార్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.