సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాపాయం నుంచి రక్షించే అవకాశమున్నప్పటికీ...హెల్మెట్‌ల వాడకంలో నగరవాసులు బద్ధకం వీడడం లేదు. హెల్మెట్ ధరించడం వల్ల ఎంతో మంది ప్రాణాలతో బయటపడిన సంఘటనలు ఉన్నప్పటికీ ద్విచక్రవాహనదారుల్లో మార్పు రావడం లేదు. దేశవ్యాప్తంగా హెల్మెట్లు సక్రమంగా వినియోగిస్తున్న నగరాల్లో మనది 14వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. హెల్మెట్‌లను నిలకడగా వాడటంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో తొలి మూడు స్థానాల్లో ఉండగా...హైదరాబాద్ మాత్రం 14వ స్థానంలో నిలిచింది. ఐసీఐసీఐ లాంబార్డ్ ‘హెల్మెట్ సర్వే ఫైండింగ్స్’ 2020 పేరుతో సర్వే నిర్వహించి ఈ స్థానాలను ప్రకటించింది. 18 నగరాల్లో 2400 మంది బైక్ రైడర్ల (18 నుంచి 35 ఏళ్ల మధ్య)తో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి హెల్మెట్‌ల వాడకం, పిలియన్ రైడర్ల( బైక్‌పై వెనుక కూర్చునే వ్యక్తి)కు హెల్మెట్లు ఎంతమేర అవసరం అన్న దానిపై ప్రశ్నలను సంధించి సమాధానాలు రాబట్టింది. పిలియన్ రైడర్లకు హెల్మెట్‌ల వినియోగంపై న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం వల్లనే నిర్లక్ష్యం చేస్తున్నారనే సమాధానాలు వచ్చినా...రోడ్డు ప్రమాద సమయాల్లో మాత్రం వారి ప్రాణాలకు హెల్మెట్ అవసరమని ఆయా నగరాల్లోని ద్విచక్రవాహనదారులు సమాధానాలిచ్చారు. పిలియన్ రైడర్లయిన పిల్లలకు పెద్దగా హెల్మెట్ అవసరం లేదని, అయితే మహిళలకు మాత్రం ఉండాల్సిందేనని అత్యధిక మంది అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ ఫస్ట్..విజయవాడ లాస్ట్
నిలకడగా హెల్మెట్ల వినియోగంలో ఆయా నగరాల్లో బైక్ వాహనచోదకులను శాతాల వారీగా చూసుకుంటే ఢిల్లీ (80), ముంబై (78) బెంగళూరు (72), కొచ్చి (70), లుధియానా (64 శాతం), గౌహతి (64) ,చెన్నై(60), రాయ్‌పూర్ (58), కోల్‌కతా (55), పాట్నా (52), లక్నో (52 శాతం), అహ్మదాబాద్ (51), భువనేశ్వర్ (50), హైదరాబాద్ (48), పుణే (41), ఇండోర్ (30), రాంచీ (25), విజయవాడ(8)లు ఉన్నాయి. అయితే హైదరాబాద్ 48 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. దీన్నిబట్టి చూస్తే హైదరాబాద్ నగరంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ల వినియోగం పెరగాల్సిన అవసరముందని ఈ సర్వే నొక్కి చెబుతోంది. విజయవాడలో మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో హెల్మెట్‌ల వినియోగంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది.
పిలియన్ రైడర్స్ హెల్మెట్ వినియోగంలోనూ వెనకబాటే...
రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో రైడర్‌తో పాటు వెనకాల కూర్చొని ఉండే పిలియన్ రైడర్‌కు హెల్మెట్ వాడకంలోనూ హైదరాబాద్, విజయవాడలు 14, 15 స్థానల్లో ఉన్నాయి. ఢిల్లీలో 63 శాతం, గౌహతిలో 58 శాతం మంది వినియోగిస్తుంటే హైదరాబాద్‌లో ఐదు శాతం, విజయవాడలో మూడు శాతం మందే వినియోగిస్తున్నారు. ఇక అహ్మదాబాద్‌లో రెండు, ఇండోర్‌లో రెండు, పుణేలో మాత్రం ఎవరూ వినియోగించేందుకు ఆసక్తి చూపడం లేదని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. హెల్మెట్ సురక్షిత ప్రయాణానికి ఉపయోగపడుతుందా అని అడిగితే 99 శాతం మంది హైదరాబాదీలు అవునని చెప్పారు. ఇక హెల్మెట్ వాడకుంటే జరిమానా విధిస్తారనే భయంతో వాడుతున్నారా అంటే 87 శాతం మంది అవునని చెప్పడం గమనార్హం.
32 కిలోమీటర్లు చుట్టేస్తారట...
హెల్మెట్ లేకుండా ఎన్ని కిలోమీటర్లు ప్రతిరోజూ ప్రయాణిస్తారంటే 32 కిలోమీటర్ల మేర జర్నీ చేస్తామని హైదరాబాదీలు సర్వేలో సమాధానం ఇచ్చారు. ఎక్కువగా అహ్మదాబాద్ (43), పుణే (41), ఇండోర్ (35), లక్నో (35) కిలోమీటర్లు తిరుగుతున్నారన్న జవాబులొచ్చాయి. విజయవాడలో 30 కిలోమీటర్లు బైక్ నడుపుతారని, అతి తక్కువగా ఢిల్లీలో 14 కిలోమీటర్ల వెళతారని సర్వే పేర్కొంది. కొద్ది దూరమే ప్రయాణించాల్సి వస్తే 79 శాతం హైదరాబాదీలు హెల్మెట్ వాడరని, ట్రాఫిక్ పోలీసులు ఉండని ప్రాంతాల్లోనూ 75 శాతం హెల్మెట్ వినియోగించడం లేదని సర్వే తెలిపింది. అలాగే ట్రాఫిక్ లేని ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా వెళ్లడంలో 68 శాతంతో హైదరాబాదీలు, 53 శాతంతో విజయవాడ బైకర్లు తొలి రెండు స్థానాల్లో ఉండగా అతి తక్కువగా 11 శాతంతో ఢిల్లీ బైకర్లు ఉన్నారని ఈ సర్వే స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment