ఒక్క ఏడాదిలోనే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు..
అహ్మదాబాద్: ఇంజనీరింగ్ అదొక బ్రాండ్. హ్యాపీడేస్ సినిమా చూసి ఎంత మంది ఇంజనీరింగ్‌లో చేరారో లెక్కలేదు. కానీ సినిమాలో చూపించినంత సులభం కాదు ఇంజనీరింగ్ పాస్ అవడం. ఎంత మంది పాస్ అవుతారో, ఫెయిల్ అవుతారో ఫలితాలు వచ్చేదాకా చెప్పలేని పరిస్థితి. చాలా మందికి సప్లిమెంటరీలు రాయడానికే సగం సమయం పూర్తవుతుంది. మరికొందరు అనుకున్న మార్గంలో నిలబడి నాలుగేళ్లలో డిగ్రీ పూర్తిచేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు. నాలుగేళ్లలో ఫెయిలైన పరీక్షల్లో పాసవడానికి సప్లిమెంటరీ పరీక్ష ఫీజులు వేలకు వేలు ఉంటాయి. కానీ అహ్మదాబాద్‌కు చెందిన చిచ్చర పిడుగు ఏడాదిలోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఆ జూనియర్ గ్రాడ్యుయేట్ వయస్సు కేవలం 15ఏళ్లు మాత్రమే..
వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్‌కు చెందిన నిర్భయ్ టక్కర్(15) కేవలం ఆరునెలల్లో 10వ తరగతి పూర్తిచేశాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారి అంతర్జాతీయ సెకండరీ ఎడ్యుకేషన్(ఇంటర్మీడియట్‌ను) మూడు నెలల్లోనే ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం గుజరాత్ టెక్నికల్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక అనుమతితో ఎస్‌ఏఎల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. కేవలం ఏడాదిలోనే మొత్తం నాలుగేళ్ల పరీక్షలను పూర్తి చేశాడు. కేవలం తనకోసమే ప్రత్యేకంగా ప్రశ్నాపత్రం రూపొందించినట్లు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రూపేష్ వాసని తెలిపారు. దీంతో అతి తక్కువ వయస్సులో ఇంజనీరింగ్ పట్టా పొందిన బాలుడిగా రికార్డులకెక్కాడు. ఈ సందర్భంగా తన తండ్రి ధావల్ టక్కర్ మాట్లాడుతూ ప్రైమరీ తరగతిగదిలో తనకుమారిడిని చదువుల్లో వీక్ అని చెప్పారని, ఏదైనా రికార్డు సృష్టించాలని అప్పుడే నిర్ణయించుకున్నానని తండ్రి తెలిపాడు.