కేరళలో కలకలం
తిరువనంతపురం: కేరళలోని కాసర్గొడ్ జిల్లాకు చెందిన 16 మంది ముస్లిం యువకులు కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. గత నెల రోజుల నుంచి కనిపించకుండాపోయిన వీరు సిరియా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరేందుకు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు.
తీర్థయాత్రకు దేశం విడిచి వెళ్లారని, తర్వాత వారి ఫోన్లు పనిచేయడం లేదని కనిపించకుండా పోయిన వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తమ గమ్యస్థానానికి చేరుకున్నామని తనకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందని మరొకరు వెల్లడించారు. మాయమైన ముస్లిం యువకులు సిరియా లేదా ఇరాక్ లోని అంతర్యుద్ధ ప్రాంతాలకు చేరుకునివుంటారని అనుమానిస్తున్నట్టు చెప్పారు.
అదృశ్యమైన వారిలో భార్య, ఎనిమిది నెలల బిడ్డ ఉన్న డాక్టర్ ఉన్నాడు. వీరంతా త్రిక్కరిపూర్, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారని కాసర్గొడ్ ఎంపీపీ కరుణాకరణ్ తెలిపారు. తీర్థయాత్రకు వెళ్లిన వీరంతా తిరిగి రాకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సాయం కోరారని చెప్పారు. 16 మంది యువకుల కుటుంబ సభ్యులు శుక్రవారం సీఎం పినరయి విజయన్ ను కలిశారు. కనిపించకుండా పోయిన వారు ఎక్కడున్నారో గుర్తించాలని కోరారు.