18 సింహాలపై హత్యకేసు: కస్టడీకి తరలింపు
అహ్మదాబాద్: భారతదేశ వణ్యప్రాణి చరిత్రలోనే సరికొత్త అధ్యాయమింది. ముగ్గురు వ్యక్తులను చంపాయనే కారణంతో 18 సింహాలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వాటిని కస్టడీకి తరలించారు. హత్యకు పాల్పడింది ఏ సింహమో తెలుసుకునేందుకు వాటికి రకరకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ లోని ప్రఖ్యాత గిర్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సాంచురీలో నివసిస్తోన్న సింహాలు సమీప గ్రామాల్లోని ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. మనిషి ఒంటరిగా కనిపిస్తే చాలు.. వెంటాడి పీక్కుతినేస్తున్నాయి. ఈ నెల మొదటివారంలోనూ అలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఏడాది కాలంగా మొత్తం ముగ్గురు వ్యక్తులను చంపి తిన్న ఆ సింహాన్ని ఎగుర్తించి జీవితఖైదు విధించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
18 అనుమానిత సింహాలపై కేసు పెట్టిన పోలీసులు.. వాటిని ఓ ప్రత్యేక ప్రదేశానికి తరలించారు. అక్కడ వాటి పంజా ముద్రలు, ముఖ కవళికలను పరిశీలిస్తారు. ఇప్పటికే తమ దగ్గరున్న సాక్ష్యాధారాలతో హంతక సింహాన్ని కనిపెట్టి జూ పార్కుకు పంపుతారు. వైల్డ్ లైఫ్ సాంచురీలో స్వేచ్ఛగ విహరించే అవకాశాన్ని కోల్పోనున్న ఆ సింహం జూలో బందీ కావడం నిజంగా జీవితఖైదు లాంటిదేకదా!
దాదాపు 1400 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన గిర్ నేషనల్ పార్కులో 400 సింహాలున్నాయి. సింహాల జీవన శైలిని బట్టి ఆ విస్తీర్ణంలో 270 సింహాలు మాత్రమే జీవించే అవకాశం ఉంది. సరిపడా స్థలం లేకపోవడంతో సింహాలు ఊళ్లవైపు వెళ్లడం, కనిపించినవారిపై దాడిచేయడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏటా రూ.20 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే గిర్ పార్క్ నిర్వాహకులు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సింహాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.