gir national park
-
Travel: సింహం! సౌమ్యశీలి! ఆకలి కానంత వరకు..
సింహం సౌమ్యంగా ఉంటుంది. ఆశ్చర్యమే కానీ ఇది నిజం. ససాన్ గిర్... సింహాల నట్టిల్లు. ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. ఈ అడవిలో వందల రకాల పక్షులుంటాయి. వందల రకాల జంతువులూ ఉంటాయి. ఎందరు వచ్చినా ఆ రావడం సింహం కోసమే. సింహం మాత్రం... వేటాడ్డమే తెలియని సాధు జంతువులాగ వినమ్రంగా ఉంటుంది. అమితాబ్ బచన్ గిర్ సినిమా చూపించేశాడు. ఈ బాలీవుడ్ హీరో గుజరాత్ టూరిజమ్ ప్రమోషన్లో ససాన్ గిర్ అడవుల్లో తిరుగుతూ లెక్కలేనన్ని సింహాల్ని చూపించేశాడు. మనం ససాన్గిర్కు వెళ్తే అమితాబ్ చూపించినన్ని సింహాలు కనిపించవు, కానీ కొన్ని సింహాలనైతే చూడగలుగుతాం. విచిత్రం ఏమిటంటే... చిన్నప్పుడు కథల్లో విన్న ఘట్టాలతో మన ఇమాజినేషన్లో సింహం రౌద్రంగా ఉంటుంది. టూర్లో పగలు పర్యటిస్తాం కాబట్టి, సింహాలు సాధు జంతువుల్లా కనిపిస్తాయి. వాకిట్లోకి వచ్చి పర్యాటకులను ఆసక్తిగా చూస్తున్న సింహం పిల్ల, గిర్ ఫారెస్ట్‌లో సింహాల లోగో హ్యాట్‌తో అమితాబ్ బచన్ జూలో వచ్చినట్లు అడవిలో వేళకు ఆహారం రాదు, తమ ఆహారాన్ని తామే సేకరించుకోవాలి. అయినా సరే! ఆకలి వేసినప్పుడు తప్ప వేటాడవు కాబట్టి మనకు కనిపించే దృశ్యాలన్నీ చెట్టు కింద నిద్రపోతున్న సింహాలు, ఆకలి తీరి సేదదీరుతున్న సింహాలే. అయితే వాటికి ఎప్పుడు ఆకలి వేస్తుందో తెలియక అడవిలో మిగిలిన జంతువులన్నీ భయంభయంగా బతుకుతుంటాయి. అందుకు జింకల కళ్లే పెద్ద ఉదాహరణ. కవులు వర్ణించిన భీత హరిణేక్షి అనే విశేషణానికి అచ్చంగా సరిపోలుతుంటాయవి. అందమైన కళ్లలో బెరుకు అలా ఉండిపోవడానికి అడవిలోని క్రూరజంతువుల భయమే కారణం కావచ్చు. ససాన్ గిర్ ఎక్కడుంది? ససాన్ గిర్ గుజరాత్లో ఉంది. సోమనాథ్ నుంచి 75 కి.మీల దూరం. గంటన్నరలో చేరవచ్చు కానీ సోమనాథ్ దాటిన వెంటనే పచ్చటి అడవిలో ప్రవేశిస్తాం. గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ వెళ్తే రెండు గంటలు పడుతుంది. దట్టమైన అటవీప్రదేశంలోకి వెళ్తే కొద్దీ మన కళ్లు చెట్లను, పక్షులను పట్టించుకోవడం మానేస్తాయి. సింహం కోసం వెతుకులాట మొదలవుతుంది. పెద్ద జంతువులు, సింహాలు సంచరించే ప్రాంతంలోకి మన వాహనాలను అనుమతించరు. సింహాలు సంచరించే ‘సింహసదన్’ ముఖద్వారం వన్యప్రాణి విభాగం వాహనాల్లోనే వెళ్లాలి. ఆ వాహనాల విండోలకు ఇనుప మెష్ ఉంటుంది. నీటి మడుగులో ఈదుతున్న జంతువులు, అప్పుడే నిద్రలేచిన సింహాలు... అడవిలోకి వచ్చే వాహనాలను చూస్తూ ‘ఇది మాకు అలవాటే’ అన్నట్లు నిరాసక్తంగా కనిపిస్తాయి. ఇవి కాకుండా కొన్ని సింహం పిల్లలు గదుల్లో తిరుగుతుంటాయి. ఒక్కో గదికి ఒక్కో సైజు ద్వారం ఉంటుంది. సింహం పిల్లలను పెద్ద జంతువులు చంపి తినకుండా ఉండడానికే ఈ ఏర్పాటు. అలాగే పెద్ద పిల్లల బారి నుంచి కూనల రక్షణ కోసం కొన్ని గదులకు పెద్ద పిల్లలు దూరలేని చిన్న ద్వారాలుంటాయి. గదులకు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ నుంచి మనం పిల్ల సింహాలను, ఆ పిల్ల సింహాలు మనల్ని చూసుకోవచ్చు. వర్షాకాలం పరిమితులు! గిర్ అడవుల టూర్‌కి ఎప్పుడైనా వెళ్లవచ్చు. కానీ డెన్స్ జోన్‌కి జూన్ 16 నుంచి అక్టోబర్ 15 వరకు నిషేధం. అది సింహాల మేటింగ్ టైమ్. ఒక్కో ఏడాది వర్షాలు ఆలస్యమై సీజన్ ఆలస్యంగా వస్తే అక్టోబర్ నెలాఖరు వరకు కూడా నిషేధం ఉంటుంది. ఇక్కడ ఆదివారం లయన్ షో ఉంటుంది. అడవిలో అమర్చిన కెమెరాల్లో క్యాప్చర్ అయిన సీన్లను ఈ షోలో ప్రదర్శిస్తారు. సింహాలు వేటాడే దృశ్యాలను కూడా ఈ షోలో చూడవచ్చు. గిర్ సాంక్చురీ, నేషనల్ పార్క్ జోన్లను కలుపుకుంటే మొత్తం ఫారెస్ట్‌లో సుమారుగా మూడు వందల సింహాలుంటాయి. సింహాలు పర్యాటకుల మీద దాడి చేసిన సంఘటన ఒక్కటీ లేదు. ఓ నాలుగు నెలల కిందట ఓ సింహం గిర్ అడవుల సమీపాన ఓ పెట్రోల్ బంకు దగ్గరకు వచ్చి వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ వీడియో బాగా వైరల్ అయింది కూడా. – వాకా మంజులారెడ్డి -
గుజరాత్లో మృగరాజు గర్జన
అహ్మదాబాద్ : గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతంలో ఆసియా సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 28.87 శాతం పెరిగిందని, మొత్తం సింహాల సంఖ్య 674కు చేరిందని గుజరాత్ అటవీ శాఖ బుధవారం ప్రకటించింది. గిర్ అడవిలో ప్రతి ఐదేళ్లకోసారి సింహాల లెక్కింపు ప్రక్రియ సాగుతుంది. 2015లో ఇక్కడ 523 సింహాలు ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది జూన్ 5, 6 తేదీల్లో సింహాల జనాభాను లెక్కించారు. 674 ఉన్నట్లు గుర్తించారు. గిర్ అడవిలో ఐదేళ్లలో ఈ స్థాయిలో సింహాల జనాభా పెరగడం ఇదే తొలిసారి. 2015లో 22 వేల చదరపు కిలోమీటర్లుగా ఉన్న సింహాల ఆవాస విస్తీర్ణం ఇప్పుడు 30 వేల చదరపు కిలోమీటర్లకు పెరగడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల సింహాల జనాభాను పూర్తిస్థాయిలో లెక్కించలేకపోయామని అధికారులు అన్నారు. ప్రధాని మోదీ హర్షం: గిర్ అడవిలో సింహాల సంతతి పెరగడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాటి ఆవాస విస్తీర్ణం కూడా 36 శాత పెరగడం మంచి పరిణామమని తెలియజేశారు. గుజరాత్ ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసించారు. -
వైరల్: ఆడ సింహంతో ఆట..
రాజ్‌కోట్ : సింహం దాడి గురించిన వార్తలే తరుచూ చూస్తుంటాం. గుజరాత్‌లోని యువత మాత్రం సింహానే వేధించారు. తమ ఆనందం కోసం వన్యప్రాణులను హింసించడం సరదాగా మార్చుకున్నారు కొంతమంది యువకులు. గత నెలలో గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌లోని సింహాలను హింసకు గురిచేస్తున్నారని అధికారులు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మనుషులు ఏంటి సింహల్ని హింసించడం ఏంటనుకుంటున్నారా..?. వారి మొబైల్ ఫోన్లలో లభించిన ఈ వీడియో చూస్తే వారేం చేశారో తెలుస్తుంది. గిర్ పార్క్ సమీపంలోని పొలంలో కొంతమంది యువకులు పార్టీ చేసుకుంటున్నారు. వీరికి ఓ మహిళ వంట వండుతుంది. ఇంతలో అక్కడికి ఓ ఆడ సింహం చేరుకుంది. వారు దానికి ఏ మాత్రం బెదరకుండా ఆటపట్టించడం మొదలుపెట్టారు. అక్కడున్నవారిలో ఒకతను తన చేతిలో ఉన్న కోడిని సింహానికి ఆశ చూపుతూ.. దాని ఓపికను పరీక్షించాడు. అతడు ఇలా చేయడం తనకు మాములే అని చెప్పడం కోసమెరుపు. కొద్దిసేపటి తర్వాత కోడిని దానికి ఇచ్చేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై గిర్ అభయారణ్య అధికారి ఒకరు మాట్లాడుతూ.. గత నెలలో అరెస్టు చేసిన ఏడుగురు వ్యక్తుల నుంచి ఈ వీడియో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారు అలా చేస్తున్న సింహం దాడి చేయకపోవడానికి కారణం.. సింహం ఆ పద్దతిలో ఆహారం పొందడానికి అలవాటు పడిందని చెప్పారు. ఇదే పార్క్‌లో గత ఏడాది ఒక మగ, ఒక ఆడ సింహాల్ని కొంత మంది స్థానిక యువకులు వెంబడించిన విషయం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అటవీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వన్యప్రాణుల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
సింహానికి కోడిని ఆశ చూపుతూ ఆట..
-
18 సింహాలపై హత్యకేసు: కస్టడీకి తరలింపు
అహ్మదాబాద్: భారతదేశ వణ్యప్రాణి చరిత్రలోనే సరికొత్త అధ్యాయమింది. ముగ్గురు వ్యక్తులను చంపాయనే కారణంతో 18 సింహాలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వాటిని కస్టడీకి తరలించారు. హత్యకు పాల్పడింది ఏ సింహమో తెలుసుకునేందుకు వాటికి రకరకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని ప్రఖ్యాత గిర్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సాంచురీలో నివసిస్తోన్న సింహాలు సమీప గ్రామాల్లోని ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. మనిషి ఒంటరిగా కనిపిస్తే చాలు.. వెంటాడి పీక్కుతినేస్తున్నాయి. ఈ నెల మొదటివారంలోనూ అలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఏడాది కాలంగా మొత్తం ముగ్గురు వ్యక్తులను చంపి తిన్న ఆ సింహాన్ని ఎగుర్తించి జీవితఖైదు విధించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. 18 అనుమానిత సింహాలపై కేసు పెట్టిన పోలీసులు.. వాటిని ఓ ప్రత్యేక ప్రదేశానికి తరలించారు. అక్కడ వాటి పంజా ముద్రలు, ముఖ కవళికలను పరిశీలిస్తారు. ఇప్పటికే తమ దగ్గరున్న సాక్ష్యాధారాలతో హంతక సింహాన్ని కనిపెట్టి జూ పార్కుకు పంపుతారు. వైల్డ్ లైఫ్ సాంచురీలో స్వేచ్ఛగ విహరించే అవకాశాన్ని కోల్పోనున్న ఆ సింహం జూలో బందీ కావడం నిజంగా జీవితఖైదు లాంటిదేకదా! దాదాపు 1400 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన గిర్ నేషనల్ పార్కులో 400 సింహాలున్నాయి. సింహాల జీవన శైలిని బట్టి ఆ విస్తీర్ణంలో 270 సింహాలు మాత్రమే జీవించే అవకాశం ఉంది. సరిపడా స్థలం లేకపోవడంతో సింహాలు ఊళ్లవైపు వెళ్లడం, కనిపించినవారిపై దాడిచేయడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏటా రూ.20 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే గిర్ పార్క్ నిర్వాహకులు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సింహాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
ఒక్కడు... ఒకే ఒక్కడు... అతనొక్కడే...
అక్కడ ఉండేది సింహాలు, వన్యప్రాణులు. అదంతా దట్టమైన కీకారణ్యం. ఆ దట్టమైన అడవిలో ఇరవై కిలో మీటర్లు ప్రయాణం చేస్తే అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ ప్రాంతానికి బనేజ్ అని పేరు. ఆ గుడికి ఒక పూజారి ఉన్నారు. ఆయన పేరు మహంత్ దర్శన్ దాస్. ఆయన ఉండేది సప్నేశ్ బిల్లియత్ అనే ఊళ్లో. ఆ ఊరు గుజరాత్ లో ఉంది. ఆ ఊరికి ఆయనొక్కడే నివాసి, ఆ పోలింగ్ బూత్ కి ఆయనొక్కడే వోటరు. ఈ మహంత్ దర్శన్ దాస్ ఒక్కరి కోసం జునాగఢ్ జిల్లాలోని గిర్ సంహాల జాతీయ వన్యపార్కు మధ్యలోని సప్నేశ్ బిల్లియత్ లో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటవుతుంది. ఈ ఒక్క ఓటు వేయించడం కోసం ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్, ఒక ప్యూన్, ఒక పోలీసు ఆ అడవిలో ప్రయాణించి వచ్చి మరీ పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేస్తారు. దర్శన్ దాస్ ఓటు వేస్తే అధికారుల డ్యూటీ పూర్తయినట్టే. బనేజ్ లో అయితే నూటికి నూరు శాతం ఓట్లు పడతాయి. లేకపోతే సున్నా ఓట్లు పడతాయి. అదీ సప్నేశ్ బిల్లియత్ ప్రత్యేకత. ఒకప్పుడు బనేజ్ లో 85మంది ఓటర్లు ఉండేవారు. వారంతా అడవిని వదిలిపెట్టి వేరే చోట్లకి వెళ్లిపోయారు. కానీ దర్శన్ దాస్ మాత్రం గుడిని, ఊరిని వదిలిపెట్టలేదు. ఈ బూత్ గుజరాత్ లోని జునాగఢ్ జిల్లాలోని ఉనా నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇలాంటి బూత్ లు అరుణాచల్ లో కూడా ఉన్నాయి. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఎనిమిది పోలింగ్ బూత్ లలో మూడు నుంచి ఎనిమిది మంది ఓటర్ల చొప్పున ఉంటారు. మరాంబో, అప్పర్ ముడోయిదీప్ పోలింగ్ బూత్ లలో మూడేసి మంది చొప్పున ఓటర్లు ఉంటారు. మాలోగామ్, సికారిడోంగ్ పోలింగ్ బూత్ లలో నలుగురు చొప్పున ఓటర్లుంటారు. లామ్టా అనే బూత్ లో అయిదుగురు, మటక్రాంగ్, ధర్మపూర్ బూత్ లలో ఏడుగురు చొప్పున, పున్లి బూత్ లో తొమ్మిది మంది ఓటర్లు మాత్రమే ఉంటారు. ఈ పోలింగ్ బూత్ లకు చేరుకోవడానికి ఎలాంటి రోడ్లూ ఉండవు. అక్కడికి ఎలాంటి వాహనాలూ వెళ్లవు. కాబట్టి పోలింగ్ సిబ్బంది రెండేసి రోజులు కాలి నడకన ప్రయాణించి పోలింగ్ బూత్ లకు చేరుకుంటారు. పోలింగ్ పూర్తయ్యాక రెండు రోజులు తిరుగుప్రయాణం చేస్తారు. ఈ పోలింగ్ బూత్ లన్నీ చైనా , మ్యాన్మార్ సరిహద్దుల్లోఉంటాయి. ఇంత దుర్గమ ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఓటు వేసుకునే వీలు కల్పించేందుకు మన ఎన్నికల కమిషన్ పనిచేస్తోంది. ఓటు విలువను గుర్తించి ఓటు వేయడం మనధర్మం. మన కర్తవ్యం. ఏమంటారు?