ఒక్కడు... ఒకే ఒక్కడు... అతనొక్కడే...
అక్కడ ఉండేది సింహాలు, వన్యప్రాణులు. అదంతా దట్టమైన కీకారణ్యం. ఆ దట్టమైన అడవిలో ఇరవై కిలో మీటర్లు ప్రయాణం చేస్తే అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ ప్రాంతానికి బనేజ్ అని పేరు. ఆ గుడికి ఒక పూజారి ఉన్నారు. ఆయన పేరు మహంత్ దర్శన్ దాస్. ఆయన ఉండేది సప్నేశ్ బిల్లియత్ అనే ఊళ్లో. ఆ ఊరు గుజరాత్ లో ఉంది.
ఆ ఊరికి ఆయనొక్కడే నివాసి, ఆ పోలింగ్ బూత్ కి ఆయనొక్కడే వోటరు.
ఈ మహంత్ దర్శన్ దాస్ ఒక్కరి కోసం జునాగఢ్ జిల్లాలోని గిర్ సంహాల జాతీయ వన్యపార్కు మధ్యలోని సప్నేశ్ బిల్లియత్ లో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటవుతుంది. ఈ ఒక్క ఓటు వేయించడం కోసం ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్, ఒక ప్యూన్, ఒక పోలీసు ఆ అడవిలో ప్రయాణించి వచ్చి మరీ పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేస్తారు. దర్శన్ దాస్ ఓటు వేస్తే అధికారుల డ్యూటీ పూర్తయినట్టే.
బనేజ్ లో అయితే నూటికి నూరు శాతం ఓట్లు పడతాయి. లేకపోతే సున్నా ఓట్లు పడతాయి. అదీ సప్నేశ్ బిల్లియత్ ప్రత్యేకత. ఒకప్పుడు బనేజ్ లో 85మంది ఓటర్లు ఉండేవారు. వారంతా అడవిని వదిలిపెట్టి వేరే చోట్లకి వెళ్లిపోయారు. కానీ దర్శన్ దాస్ మాత్రం గుడిని, ఊరిని వదిలిపెట్టలేదు.
ఈ బూత్ గుజరాత్ లోని జునాగఢ్ జిల్లాలోని ఉనా నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
ఇలాంటి బూత్ లు అరుణాచల్ లో కూడా ఉన్నాయి. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఎనిమిది పోలింగ్ బూత్ లలో మూడు నుంచి ఎనిమిది మంది ఓటర్ల చొప్పున ఉంటారు. మరాంబో, అప్పర్ ముడోయిదీప్ పోలింగ్ బూత్ లలో మూడేసి మంది చొప్పున ఓటర్లు ఉంటారు. మాలోగామ్, సికారిడోంగ్ పోలింగ్ బూత్ లలో నలుగురు చొప్పున ఓటర్లుంటారు. లామ్టా అనే బూత్ లో అయిదుగురు, మటక్రాంగ్, ధర్మపూర్ బూత్ లలో ఏడుగురు చొప్పున, పున్లి బూత్ లో తొమ్మిది మంది ఓటర్లు మాత్రమే ఉంటారు.
ఈ పోలింగ్ బూత్ లకు చేరుకోవడానికి ఎలాంటి రోడ్లూ ఉండవు. అక్కడికి ఎలాంటి వాహనాలూ వెళ్లవు. కాబట్టి పోలింగ్ సిబ్బంది రెండేసి రోజులు కాలి నడకన ప్రయాణించి పోలింగ్ బూత్ లకు చేరుకుంటారు. పోలింగ్ పూర్తయ్యాక రెండు రోజులు తిరుగుప్రయాణం చేస్తారు. ఈ పోలింగ్ బూత్ లన్నీ చైనా , మ్యాన్మార్ సరిహద్దుల్లోఉంటాయి.
ఇంత దుర్గమ ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఓటు వేసుకునే వీలు కల్పించేందుకు మన ఎన్నికల కమిషన్ పనిచేస్తోంది. ఓటు విలువను గుర్తించి ఓటు వేయడం మనధర్మం. మన కర్తవ్యం.
ఏమంటారు?