రాజ్‌కోట్ : సింహం దాడి గురించిన వార్తలే తరుచూ చూస్తుంటాం. గుజరాత్‌లోని యువత మాత్రం సింహానే వేధించారు. తమ ఆనందం కోసం వన్యప్రాణులను హింసించడం సరదాగా మార్చుకున్నారు కొంతమంది యువకులు. గత నెలలో గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌లోని సింహాలను హింసకు గురిచేస్తున్నారని అధికారులు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మనుషులు ఏంటి సింహల్ని హింసించడం ఏంటనుకుంటున్నారా..?. వారి మొబైల్ ఫోన్లలో లభించిన ఈ వీడియో చూస్తే వారేం చేశారో తెలుస్తుంది.
గిర్ పార్క్ సమీపంలోని పొలంలో కొంతమంది యువకులు పార్టీ చేసుకుంటున్నారు. వీరికి ఓ మహిళ వంట వండుతుంది. ఇంతలో అక్కడికి ఓ ఆడ సింహం చేరుకుంది. వారు దానికి ఏ మాత్రం బెదరకుండా ఆటపట్టించడం మొదలుపెట్టారు. అక్కడున్నవారిలో ఒకతను తన చేతిలో ఉన్న కోడిని సింహానికి ఆశ చూపుతూ.. దాని ఓపికను పరీక్షించాడు. అతడు ఇలా చేయడం తనకు మాములే అని చెప్పడం కోసమెరుపు. కొద్దిసేపటి తర్వాత కోడిని దానికి ఇచ్చేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై గిర్ అభయారణ్య అధికారి ఒకరు మాట్లాడుతూ.. గత నెలలో అరెస్టు చేసిన ఏడుగురు వ్యక్తుల నుంచి ఈ వీడియో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారు అలా చేస్తున్న సింహం దాడి చేయకపోవడానికి కారణం.. సింహం ఆ పద్దతిలో ఆహారం పొందడానికి అలవాటు పడిందని చెప్పారు.
ఇదే పార్క్‌లో గత ఏడాది ఒక మగ, ఒక ఆడ సింహాల్ని కొంత మంది స్థానిక యువకులు వెంబడించిన విషయం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అటవీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వన్యప్రాణుల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment