సింహం సౌమ్యంగా ఉంటుంది. ఆశ్చర్యమే కానీ ఇది నిజం. ససాన్ గిర్... సింహాల నట్టిల్లు. ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. ఈ అడవిలో వందల రకాల పక్షులుంటాయి.
వందల రకాల జంతువులూ ఉంటాయి. ఎందరు వచ్చినా ఆ రావడం సింహం కోసమే. సింహం మాత్రం... వేటాడ్డమే తెలియని సాధు జంతువులాగ వినమ్రంగా ఉంటుంది.
అమితాబ్ బచన్ గిర్ సినిమా చూపించేశాడు. ఈ బాలీవుడ్ హీరో గుజరాత్ టూరిజమ్ ప్రమోషన్‌లో ససాన్ గిర్ అడవుల్లో తిరుగుతూ లెక్కలేనన్ని సింహాల్ని చూపించేశాడు. మనం ససాన్‌గిర్‌కు వెళ్తే అమితాబ్ చూపించినన్ని సింహాలు కనిపించవు, కానీ కొన్ని సింహాలనైతే చూడగలుగుతాం. విచిత్రం ఏమిటంటే... చిన్నప్పుడు కథల్లో విన్న ఘట్టాలతో మన ఇమాజినేషన్‌లో సింహం రౌద్రంగా ఉంటుంది. టూర్‌లో పగలు పర్యటిస్తాం కాబట్టి, సింహాలు సాధు జంతువుల్లా కనిపిస్తాయి.
వాకిట్లోకి వచ్చి పర్యాటకులను ఆసక్తిగా చూస్తున్న సింహం పిల్ల, గిర్ ఫారెస్ట్‌లో సింహాల లోగో హ్యాట్‌తో అమితాబ్ బచన్
జూలో వచ్చినట్లు అడవిలో వేళకు ఆహారం రాదు, తమ ఆహారాన్ని తామే సేకరించుకోవాలి. అయినా సరే! ఆకలి వేసినప్పుడు తప్ప వేటాడవు కాబట్టి మనకు కనిపించే దృశ్యాలన్నీ చెట్టు కింద నిద్రపోతున్న సింహాలు, ఆకలి తీరి సేదదీరుతున్న సింహాలే. అయితే వాటికి ఎప్పుడు ఆకలి వేస్తుందో తెలియక అడవిలో మిగిలిన జంతువులన్నీ భయంభయంగా బతుకుతుంటాయి.
అందుకు జింకల కళ్లే పెద్ద ఉదాహరణ. కవులు వర్ణించిన భీత హరిణేక్షి అనే విశేషణానికి అచ్చంగా సరిపోలుతుంటాయవి. అందమైన కళ్లలో బెరుకు అలా ఉండిపోవడానికి అడవిలోని క్రూరజంతువుల భయమే కారణం కావచ్చు.
ససాన్ గిర్ ఎక్కడుంది?
ససాన్ గిర్ గుజరాత్‌లో ఉంది. సోమనాథ్ నుంచి 75 కి.మీల దూరం. గంటన్నరలో చేరవచ్చు కానీ సోమనాథ్ దాటిన వెంటనే పచ్చటి అడవిలో ప్రవేశిస్తాం. గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ వెళ్తే రెండు గంటలు పడుతుంది. దట్టమైన అటవీప్రదేశంలోకి వెళ్తే కొద్దీ మన కళ్లు చెట్లను, పక్షులను పట్టించుకోవడం మానేస్తాయి. సింహం కోసం వెతుకులాట మొదలవుతుంది. పెద్ద జంతువులు, సింహాలు సంచరించే ప్రాంతంలోకి మన వాహనాలను అనుమతించరు.
సింహాలు సంచరించే ‘సింహసదన్’ ముఖద్వారం
వన్యప్రాణి విభాగం వాహనాల్లోనే వెళ్లాలి. ఆ వాహనాల విండోలకు ఇనుప మెష్ ఉంటుంది. నీటి మడుగులో ఈదుతున్న జంతువులు, అప్పుడే నిద్రలేచిన సింహాలు... అడవిలోకి వచ్చే వాహనాలను చూస్తూ ‘ఇది మాకు అలవాటే’ అన్నట్లు నిరాసక్తంగా కనిపిస్తాయి. ఇవి కాకుండా కొన్ని సింహం పిల్లలు గదుల్లో తిరుగుతుంటాయి. ఒక్కో గదికి ఒక్కో సైజు ద్వారం ఉంటుంది.
సింహం పిల్లలను పెద్ద జంతువులు చంపి తినకుండా ఉండడానికే ఈ ఏర్పాటు. అలాగే పెద్ద పిల్లల బారి నుంచి కూనల రక్షణ కోసం కొన్ని గదులకు పెద్ద పిల్లలు దూరలేని చిన్న ద్వారాలుంటాయి. గదులకు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ నుంచి మనం పిల్ల సింహాలను, ఆ పిల్ల సింహాలు మనల్ని చూసుకోవచ్చు.
వర్షాకాలం పరిమితులు!
గిర్ అడవుల టూర్‌కి ఎప్పుడైనా వెళ్లవచ్చు. కానీ డెన్స్ జోన్‌కి జూన్ 16 నుంచి అక్టోబర్ 15 వరకు నిషేధం. అది సింహాల మేటింగ్ టైమ్. ఒక్కో ఏడాది వర్షాలు ఆలస్యమై సీజన్ ఆలస్యంగా వస్తే అక్టోబర్ నెలాఖరు వరకు కూడా నిషేధం ఉంటుంది. ఇక్కడ ఆదివారం లయన్ షో ఉంటుంది. అడవిలో అమర్చిన కెమెరాల్లో క్యాప్చర్ అయిన సీన్లను ఈ షోలో ప్రదర్శిస్తారు. సింహాలు వేటాడే దృశ్యాలను కూడా ఈ షోలో చూడవచ్చు.
గిర్ సాంక్చురీ, నేషనల్ పార్క్ జోన్‌లను కలుపుకుంటే మొత్తం ఫారెస్ట్‌లో సుమారుగా మూడు వందల సింహాలుంటాయి. సింహాలు పర్యాటకుల మీద దాడి చేసిన సంఘటన ఒక్కటీ లేదు. ఓ నాలుగు నెలల కిందట ఓ సింహం గిర్ అడవుల సమీపాన ఓ పెట్రోల్ బంకు దగ్గరకు వచ్చి వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ వీడియో బాగా వైరల్ అయింది కూడా.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment