ఆ అల్లర్లు.. దేశమాత గుండెల్లో కత్తులు: మోదీ
దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లను దేశమాత గుండెల్లో దిగిన కత్తులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన 'ఐక్యతా పరుగు' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లూ ప్రతియేటా ఇందిర వర్ధంతిని మాత్రమే నిర్వహిస్తుండగా, ఈసారి బీజేపీ అధికారంలో ఉండటంతో దాని బదులు పటేల్ జయంతిని నిర్వహించిన విషయం తెలిసిందే. మన సొంత మనుషులే హతమయ్యారని, ఆ దాడి కేవలం ఒక్క మతం మీదనో, వర్గం మీదనో కాక.. యావత్ దేశం మీద జరిగిందని మోదీ అన్నారు.
నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె సొంత అంగరక్షకులే ఢిల్లీలోని ఆమె ఇంట్లో కాల్చిచంపారు. దాంతో ఆ తర్వాత సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన ఊచకోత, హత్యాకాండలో దాదాపు 3వేల మంది సిక్కులు మరణించారు. ఆనాటి అల్లర్లకు బాధ్యులైన చాలామంది కాంగ్రెస్ నాయకులను నాటి ప్రభుత్వం కాపాడిందన్న ఆరోపణలు గట్టిగా వచ్చాయి. దేశ సమైక్యతను కాపాడేందుకు ఎంతగానో కృషిచేసిన ఓ మహానుభావుడి జయంతి రోజున 30 ఏళ్ల క్రితం ఈ దేశం మొత్తాన్ని తీవ్రంగా భయపెట్టిన సంఘటన జరగడం దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు.