indira gandhi death anniversary
-
ఇందిరమ్మకు ప్రముఖుల నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు శక్తిస్థల్ కు వచ్చి నివాళులర్పించారు. దేశానికి ఇందిరా గాంధీ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ‘ఇందిరా గాంధీ మాకు శాశ్వత ప్రేమను ఇచ్చారు. ఆమె ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. తన జీవితాంతం ప్రజల బాగు కోసం పాటు పడ్డారు, ఆమెను ఆనందంతో స్మరించుకుంటున్నాం’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ట్వీటర్ ద్వారా ఇందిరా గాంధీకి నివాళులర్పించారు. దేశం కోసం ఆమె చేసిన కృషిని విషయాన్ని మరిచిపోలేమని ఆయన అన్నారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దంపతులకు 1917, నవంబర్ 19న ఇందిరా గాంధీ జన్మించారు. 1966లో అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తి ఆకస్మిక మరణంతో ప్రధాని పదవిని చేపట్టి 1977 వరకు ఆ పదవిలో ఉన్నారు. మళ్లీ 1980లో మరోసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. 1984 అక్టోబర్ 31న అంగరక్షకులు చేతిలో హత్యగావించబడ్డారు. -
జాతి గుండెల్లో ఉక్కు మనిషి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను గత పాలకులు నిర్లక్ష్యం చేసినా.. జాతి మాత్రం మరువదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పటేల్ 142వ జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఐక్యతా పరుగును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనంతరం మేజర్ ధ్యాన్‌చంద్ మైదానంలో మోదీ ప్రసంగించారు. ‘‘స్వాతంత్ర్యానంతరం దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు పటేల్ చేసిన కృషి అమోఘనీయం. భారతదేశం భిన్న మతాల, సంస్కృతుల సమ్మేళనం. అలాంటి దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చేందుకు అహర్నిశలు ఆయన కృషిచేశారు. అంతటి మహనీయుడి జయంతి వేడుకలపై గత పాలకులు పక్షపాతం చూపారు. కానీ, దేశ ప్రజలు మాత్రం ఆయన్ని ఎప్పుడూ తమ గుండెల్లో నిలుపుకుంటారు’’ అని మోదీ తెలిపారు. జాతి పునర్నిర్మాణానికి కృషి చేసిన ఉక్కుమనిషికి నేటి యువత గౌరవం ఇవ్వటం విశేషమని ఆయన తెలిపారు. వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించటంపై తమ ప్రభుత్వం ఎంతో గర్వపడుతుందని మోదీ పేర్కొన్నారు. ఇంకా ఇదే వేదికపై నేడు ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన ఉక్కు మహిళ గురించి ప్రస్తావించారు. ఇక ఐక్యతా పరుగు కార్యక్రమంలో 20,000 మంది పాల్గొనగా.. వారిలో పీవీ సింధు, మిథాలీ రాజ్ లాంటి సెలబ్రిటీలు ఉన్నారు. అంతకు ముందు పటేల్ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు, మోదీ, రాజ్‌నాథ్ సింగ్ లు నివాళులర్పించారు. ఇందిరమ్మకు ఘన నివాళులు మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 33వ వర్థంతి సందర్భంగా పలువురు ప్రముఖులు శక్తిస్థల్ వద్దకు క్యూ కట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్, ఇందిర మనవడు- కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు ఘాట్ వద్ద ఆమెకు నివాళులర్పించారు. -
ఆ అల్లర్లు.. దేశమాత గుండెల్లో కత్తులు: మోదీ
దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లను దేశమాత గుండెల్లో దిగిన కత్తులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన 'ఐక్యతా పరుగు' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లూ ప్రతియేటా ఇందిర వర్ధంతిని మాత్రమే నిర్వహిస్తుండగా, ఈసారి బీజేపీ అధికారంలో ఉండటంతో దాని బదులు పటేల్ జయంతిని నిర్వహించిన విషయం తెలిసిందే. మన సొంత మనుషులే హతమయ్యారని, ఆ దాడి కేవలం ఒక్క మతం మీదనో, వర్గం మీదనో కాక.. యావత్ దేశం మీద జరిగిందని మోదీ అన్నారు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె సొంత అంగరక్షకులే ఢిల్లీలోని ఆమె ఇంట్లో కాల్చిచంపారు. దాంతో ఆ తర్వాత సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన ఊచకోత, హత్యాకాండలో దాదాపు 3వేల మంది సిక్కులు మరణించారు. ఆనాటి అల్లర్లకు బాధ్యులైన చాలామంది కాంగ్రెస్ నాయకులను నాటి ప్రభుత్వం కాపాడిందన్న ఆరోపణలు గట్టిగా వచ్చాయి. దేశ సమైక్యతను కాపాడేందుకు ఎంతగానో కృషిచేసిన ఓ మహానుభావుడి జయంతి రోజున 30 ఏళ్ల క్రితం ఈ దేశం మొత్తాన్ని తీవ్రంగా భయపెట్టిన సంఘటన జరగడం దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు.