
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను గత పాలకులు నిర్లక్ష్యం చేసినా.. జాతి మాత్రం మరువదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పటేల్ 142వ జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఐక్యతా పరుగును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనంతరం మేజర్ ధ్యాన్‌చంద్ మైదానంలో మోదీ ప్రసంగించారు.
‘‘స్వాతంత్ర్యానంతరం దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు పటేల్ చేసిన కృషి అమోఘనీయం. భారతదేశం భిన్న మతాల, సంస్కృతుల సమ్మేళనం. అలాంటి దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చేందుకు అహర్నిశలు ఆయన కృషిచేశారు. అంతటి మహనీయుడి జయంతి వేడుకలపై గత పాలకులు పక్షపాతం చూపారు. కానీ, దేశ ప్రజలు మాత్రం ఆయన్ని ఎప్పుడూ తమ గుండెల్లో నిలుపుకుంటారు’’ అని మోదీ తెలిపారు. జాతి పునర్నిర్మాణానికి కృషి చేసిన ఉక్కుమనిషికి నేటి యువత గౌరవం ఇవ్వటం విశేషమని ఆయన తెలిపారు. వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించటంపై తమ ప్రభుత్వం ఎంతో గర్వపడుతుందని మోదీ పేర్కొన్నారు.
ఇంకా ఇదే వేదికపై నేడు ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన ఉక్కు మహిళ గురించి ప్రస్తావించారు. ఇక ఐక్యతా పరుగు కార్యక్రమంలో 20,000 మంది పాల్గొనగా.. వారిలో పీవీ సింధు, మిథాలీ రాజ్ లాంటి సెలబ్రిటీలు ఉన్నారు. అంతకు ముందు పటేల్ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు, మోదీ, రాజ్‌నాథ్ సింగ్ లు నివాళులర్పించారు.
ఇందిరమ్మకు ఘన నివాళులు
మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 33వ వర్థంతి సందర్భంగా పలువురు ప్రముఖులు శక్తిస్థల్ వద్దకు క్యూ కట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్, ఇందిర మనవడు- కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు ఘాట్ వద్ద ఆమెకు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment