
పటేల్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మోదీ
కెవాడియ: కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఉగ్రవాదానికి ద్వారాలు తెరవడం తప్ప ఇంకేం చేయలేదని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ఆర్టికల్ 370 రద్దు చేశామని స్పష్టం చేశారు. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జన్మదినమైన జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని పటేల్‌కు అంకితమిస్తున్నానని ప్రకటించారు. పటేల్ 144వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ‘జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ’ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ సమగ్రతకు చిహ్నమని, ఈ దేశానికి గర్వకారణమనీ మోదీ అన్నారు.
కశ్మీర్ ఉగ్రవాదం కారణంగా మూడు దశాబ్దాల్లో 40,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘యుద్ధంలో గెలవలేని వాళ్ళు’’ వేర్పాటు వాదంతో, ఉగ్రవాదంతో ఈ దేశ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తున్నారనీ పాకిస్తాన్‌ని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. అయితే శతాబ్దాలుగా వారా ప్రయత్నం చేస్తున్నా ఈ దేశాన్ని జయించడం అసాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌గా విడగొట్టడం ఈ ప్రాంత ప్రజల మధ్య బలమైన విశ్వాసాన్ని పాదుకొల్పాలన్న లక్ష్యమే తప్ప ప్రాంతాల మధ్య విభజనరేఖను గీయాలన్న ఉద్దేశ్యం లేదన్నారు. కశ్మీర్ సమస్యను తాను డీల్ చేసినట్టయితే సమస్య పరిష్కారానికి ఇంతకాలం పట్టేది కాదన్న పటేల్ వ్యాఖ్యానాన్ని ప్రస్తావించారు.
ఏపీ సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పటేల్ మహనీయుడు ధృఢ దీక్షతో సమైక్య భారతదేశం రూపుదిద్దుకోవడంలో చేసిన కృషిని దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని, సర్వదా ఆయనకు రుణపడి ఉంటారని ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ శ్లాఘించారు.