కేవాడియా/న్యూఢిల్లీ: అన్ని రకాల అంతర్గత, బహిర్గత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విషయంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ నుంచి దేశం స్ఫూర్తిని పొందుతోందని అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ సందర్భంగా మోదీ ఆదివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తే మన దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చవచ్చని పిలుపునిచ్చారు. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ కోసం వల్లబ్‌భాయ్ పటేల్ అలుపెరుగని పోరాటం సాగించారని కొనియాడారు. ఆయన కేవలం చరిత్రలో కాదు, ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని చెప్పారు. పౌరులుగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించడమే పటేల్‌కు నివాళి అని సూచించారు.
సమగ్రతను దెబ్బతీయలేరు: అమిత్ షా
సర్దార్‌పటేల్ రాబోయే తరాలకు సైతం స్ఫూర్తినిస్తూనే ఉంటారని హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారత్ భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండబోతోందని, ఐక్యత, సమగ్రతను దెబ్బతీయడం ఎవరి తరమూ కాదని తేల్చిచెప్పారు. పటేల్ జయంతి సందర్భంగా ఆదివారం గుజరాత్‌లోని కేవాడియాలో ఐక్యతా శిల్పం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు.
పటేల్ కృషి వల్లే భారత్ ఐక్యంగా నిలిచిందని అన్నారు. అయినప్పటికీ ఆయనకు తగిన గౌరవ మర్యాదలు లభించలేదని ఆక్షేపించారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పటేల్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని, ఆయనకు నివాళిగా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పిందని అమిత్ షా తెలిపారు. దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం నివాళులర్పించారు. ప్రజాస్యామ్యాన్ని రక్షించడమే పటేల్‌కు నిజమైన నివాళి అవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment