న్యూఢిల్లీ: తమను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దుండగులు.. రాడ్లతో కొట్టారని, మురికినీరు తాగించారని పాకిస్తాన్‌లోని ఇండియన్ ఎంబసీ ఉద్యోగులు ఇద్దరు తమ అనుభవాలను మీడియాకు వెల్లడించారు. సోమవారం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి కనిపించకుండా పోయి వీరు రాత్రికి ఎంబసీ సమీపంలోని పెట్రోల్ స్టేషన్ వద్ద పడి వున్నారు.
ఈ క్రమంలో సదరు ఉద్యోగులు మాట్లాడుతూ.. ‘గుర్తుతెలియని దుండగులు 15-16 మంది మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టారు. ఎంబసీ నుంచి పది నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ మమ్మల్ని తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. రాడ్లు, కర్రలతో విపరీతంగా కొట్టారు. మురికినీరు తాగిపించారు. వారంతా ముఖాలకు మాస్కులు ధరించి ఉన్నారు. వాళ్ల చేతిలో నరకం అనుభవించాం. ఏదో అంశం గురించి ఒప్పుకోవాలంటూ మమ్మల్ని చితకబాదారు' అని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కనిపించకుండా పోయిన ఈ ఇద్దరు ఉద్యోగులు దాదాపు 12 గంటల తర్వాత ఎంబసీకి సమీపంలోని పెట్రోల్ స్టేషన్ వద్ద పడివుండగా గుర్తించి కార్యాలయానికి తీసుకొచ్చారు. వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా.. మెడ, ముఖం, తొడల మీద గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాలకు ప్రమాదం కలిగించే దెబ్బలు లేవన్నారు. (పాక్‌లో భారత అధికారులు మిస్సింగ్)
అయితే దీని గురించి పాక్ మరోలా ప్రచారం చేస్తుంది. నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని ఎంబసీ అధికారులు తమ వాహనంతో ఢీకొట్టడంతో వారిని అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొన్నది. కాగా తమ సిబ్బందిని ఆక్సిడెంట్ చేసినట్లు ఒప్పుకోమని తీవ్రంగా కొట్టి వీడియోలు తీశారని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. తమ ఉద్యోగులు కనిపించకుండా పోయారని న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్‌ను పిలిచి తీవ్రంగా నిరసన తెలిపారు. దాంతో పాకిస్తాన్ అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకొని వారిని విడిచిపెట్టేలా చేయడం గమనార్హం. ఆక్సిడెంట్ చేసిన కారులో పాకిస్తాన్‌కు చెందిన కొంత నగదు లభించిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే అవన్నీ నిరాధారమైన ఆరోపణలే అంటూ పాకిస్తాన్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఖండించింది.
గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో గత నెల 31న ఇద్దర పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగులను దేశం విడిచి వెళ్లిపోవాలని భారత అధికారులు ఆదేశించింన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పాక్ కుట్రపన్ని తమ ఇద్దరు సిబ్బందిని కిడ్నాప్ చేసినట్లు భారత విదేశాంగ శాఖ భావిస్తున్నది.
Comments
Please login to add a commentAdd a comment