
రాయ్‌బరేలి: కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ వలస కార్మికుల జీవితాలతో ఆటాడుకుంటోంది. తినడానికి తిండి లేక, ఉండటానికి దిక్కు లేక సొంత గూటికి చేరలేక వలస కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలన్ని రద్దు కావడంతో కాలినడకనే సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. ఈ ప్రయాణంలో ప్రాణాలకు తెగించి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. చాలా మంది ఎంతో ఆశగా ఇంటికి బయలు దేరినా ఇంటిని చేరకుండానే, అయిన వారిని చూడకుండానే తిరిగి రాని లోకానికి తరలిపోతున్నారు. ఎంతో మంది వలస కార్మికులు అనేక కారణాల వల్ల ప్రాణాలు కోల్పొతున్నారు. (వలసజీవుల బలిదానం)
తాజాగా ఇద్దరు కార్మికులు వేల కిలో మీటర్లు నడిచి ఇంకా కొద్ది రోజుల్లో ఇంట్లో వారిని కలుసుకోబోతున్నారు అనుకున్న తరుణంలో వేగంగా వస్తున్న ఒక కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటన హరియాణలో చోటు చేసుకుంది. ఇద్దరు వలస కార్మికులు నడుచుకుంటూ వెళుతుండగా వేగంగా వస్తోన్న యస్‌యూవీ కారు వారిని ఢీ కొట్టింది. దీంతో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో కార్మికుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. మరోవైపు సోమవారం రాత్రి సైకిల్ తొక్కుకుంటూ సొంత గ్రామానికి వెళుతున్న 25 ఏళ్ల వలస కార్మికుడు శివకుమార్ దాస్ రాయ్‌బరేలీలో కారు ఢీకొని చనిపోయాడు. కారు చాలా స్పీడ్‌గా వస్తోండటంతో బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరిగినట్లు కార్ డ్రైవర్ తెలిపాడు. అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. (‘లాక్డౌన్లో కూడా ప్రమాదాల రేటు మారలేదు’)
ఇప్పటి వరకు వలస కార్మికులు అనేక మంది ప్రమాదాలకు గురయ్యి మరణించారు. వారి కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికి వాటికి అధిక చార్జీలు వసూలు చేస్తుండటం, వాటి టికెట్ కొనుగోలు విధానంలో కూడా చాలా ప్రాసెస్ ఉండటంతో ఎక్కువ మంది కార్మికులు రైలు మార్గం ద్వారా ప్రయాణించలేకపోతున్నారు. గత వారాంతంలో ఒక ట్రక్ బోల్తా పడటంతో ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఆరు మంది వలసకార్మికులు మధ్యప్రదేశ్‌లో చనిపోయారు. ఔరాంగాబాద్ సమీపంలో రైళ్ల పట్టాలపై నిద్రపోతున్న 16 మంది మీద నుంచి గూడ్స్‌ట్రైన్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే వారు మరణించారు. ఇలాంటి ఘటనలు జరుగుతుండటం దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment