
కోవిడ్ సోకిన ఓ రోగిని క్రేన్ ద్వారా తీసుకెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బీజింగ్: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో కోవిడ్ రోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉంది. కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షల విధించింది జిన్‌పింగ్ ప్రభుత్వం. ఈ క్రమంలో కోవిడ్ సోకిన ఓ రోగిని క్రేన్ ద్వారా తీసుకెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు చైనా ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రోగులను పశువలకన్నా హీనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా ఆంక్షలు విధించిన ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఓ భవనంలోని కిటికీలోంచి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సామాజిక దూరం పాటించే క్రమంలో వైరస్ సోకిన వ్యక్తిని క్రేన్ సాయంతో తీసుకెళ్లారు. ట్విటర్‌లో ఈ వీడియోను ఇప్పటి వరకు 221వేల మంది వీక్షించారు. 1.8వేల లైకులు వచ్చాయి.
చైనాలో కరోనా వైరస్ కట్టడికి జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తోంది జిన్‌పింగ్ ప్రభుత్వం. కరోనా కేసులు వచ్చిన ప్రాంతంలో కఠిన లాక్‌డౌన్‌లు విధిస్తున్నారు. కీలక నగరాల్లో లాక్‌డౌన్‌లు విధించటం ద్వారా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉన్నందున చైనా ప్రభుత్వంపై అంతర్జాతీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ తొలిసారి గుర్తించిన వూహాన్ నగరంలో మళ్లీ లాక్‌డౌన్ విధించటం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్ 26 నుంచి 30వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించగా.. 8 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది.
中国式现代化。【方老师,投稿一个防疫大革命的荒谬视频。一个阳性患者被吊机吊出小区,因为他们不敢进去接,也不想患者的细菌留在地板上,这样能保证最小的接触面积。】 pic.twitter.com/2BM3Afm3V6
— 方舟子 (@fangshimin) October 25, 2022
ఇదీ చదవండి: పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?.. అమెరికా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయ్