మెట్రో గురించి 20 ముచ్చట్లు | 20 chats about Metro | Sakshi
Sakshi News home page

మెట్రో గురించి 20 ముచ్చట్లు

Published Sun, Jun 8 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

మెట్రో గురించి 20 ముచ్చట్లు

మెట్రో గురించి 20 ముచ్చట్లు

ముంబై: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై మెట్రోరైలు సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ముంబై రవాణా వ్యవస్థకు అత్యంత కీలకంగా మారిన మెట్రోరైలు గురించి 20 ఆసక్తికర అంశాలివి.

* ప్రభుత్వం సూచించినట్టుగా తక్కువ చార్జీలతో కూడిన టారిఫ్ అమలు చేయకుంటే మెట్రోరైలు ప్రారంభోత్సవానికి రాబోనని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దీని ప్రమోటర్, రిలయన్స్ అనుబంధ సంస్థ ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్)ను హెచ్చరించారు.
* టారిఫ్‌ను పెంచేందుకు బీజేపీ ఎంఎంఓపీల్‌కు సహకరిస్తోందంటూ సీఎం బీజేపీపై మండిపడ్డారు.
* మెట్రోరైలు సేవలను జూన్ ఎనిమిది నుంచి ప్రారంభిస్తామంటూ ఎంఎంఓపీఎల్ అధికారికం గా ప్రకటన చేసిన వేదికపై ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే), రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ లేరు. మరో ఆసక్తికర సంగతి ఏమంటే మెట్రోలో ఎమ్మెమ్మార్డీయేకు 26 శాతం వాటా ఉంది.
* ఎమ్మెమ్మార్డీయే మెట్రోరైలును ప్రారంభించకుంటే తామే బలవంతంగా మొదలుపెడతామని బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య హెచ్చరిం చంతో ఎంఎంఓపీఎల్ హఠాత్తుగా ఈ ప్రకటన చేసింది.
* ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు మెట్రో సేవలను ప్రారంభిస్తూ ఘాట్కోపర్ వద్ద చిన్న పూజ కూడా నిర్వహించడం విశేషం.
* ప్రభుత్వం సూచించిన దానికంటే ఎంఎంఓపీఎల్ ప్రకటన ప్రారంభోత్సవ చార్జీలు కాస్త తక్కువగానే ఉన్నాయి. అయితే తుది టారిఫ్‌పై ఎంఎంఓపీఎల్, ప్రభుత్వం మధ్య వివాదం ఉంది. మెట్రో చట్టం ప్రకారం చార్జీల విధింపు తన పరిధిలోకి వస్తుందని ఎంఎంఓపీఎల్ వాదిస్తోంది. కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.40 మధ్య చార్జీలు ఉండేలా టారిఫ్ తయారు చేసింది. ప్రభుత్వం మాత్రం చార్జీలు రూ.9-13 మధ్య ఉండాలని కోరుకుంటోంది.
* ప్రభుత్వం 2009లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారమే మెట్రో పాలన సాగాలని ఎంఎంఓపీఎల్ పట్టుబడుతోంది.
* మెట్రో అంచనావ్యయం రూ.2,356 కోట్ల నుంచి రూ.4,321 కోట్లకు పెరిగింది.
* వెర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో రిలయన్స్ ఇన్‌ఫ్రా 11.40 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించింది.
* దీని నిర్మాణ పనులు 2007లో లాంఛనంగా ప్రారంభమైనా, నిర్దేశిత గడువులు తరచూ వాయిదాపడ్డాయి.
* ప్రతి మెట్రోరైలుకు నాలుగు కోచ్‌లు ఉంటాయి. ఒక్కోదాంట్లో 375 మంది ప్రయాణించవచ్చు. ఒక్కో రైలులో మొత్తం 1,500 మంది దాకా ప్రయాణించవచ్చు.
* ప్రతినిత్యం 200-250 ట్రిప్పులు నడపడం ద్వారా 11 లక్షల మందికి సేవలు అందిస్తామని ఎంఎంఓపీఎల్ ప్రకటించింది.
* వెర్సోవా నుంచి ఘాట్కోపర్‌కు రోడ్డు ద్వారా ప్రయాణిస్తే కనీసం గంట పడుతుంది. మెట్రోరైలు ద్వారా కేవలం 21 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు.
* రైల్వే తదితర సంస్థల నుంచి అనుమతులు రాకపోవడం, భూసేకరణ సమస్య, పరిహారం చెల్లింపు తదితర సమస్యల వల్ల మెట్రోమార్గం నిర్మాణంలో జాప్యం తప్పలేదు.
* ఈ మార్గంలో మొదట రోజుకు ఏడు లక్షల మంది వరకు ప్రయాణించవచ్చని, తదనంతరం దీనిని 11 లక్షలకు పెంచుతామని ఎంఎంఓపీఎల్ అంటోంది.
* సాధారణ కౌంటర్లతోపాటు స్మార్ట్‌కార్డులు, టోకెన్ల ద్వారా కూడా టికెట్లు కొనవచ్చు. అన్ని స్టేషన్లలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి.
* మెట్రోరైలు ప్రారంభం వల్ల వెర్సోవా-అంధేరీ ప్రాంతాల్లో స్థిరాస్తిరంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని స్థిరాస్తుల కన్సల్టింగ్ సంస్థ జోన్స్‌లంగ్ లాజెలే ప్రకటించింది.
* ఈ సంస్థ చెప్పినట్టే మెట్రో వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు గత ఎనిమిది సం వత్సరాల్లో 400 శాతం పెరిగాయి. భవిష్యత్‌లో మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
* మెట్రోరైలు సదుపాయం ఉన్న ప్రాంతాల్లో కొత్తగా సంస్థలు, దుకాణాలు పెద్ద ఎత్తున వెలుస్తాయని అంచనా
* రైల్వేశాఖ ముంబై మెట్రోరైలు ప్రారంభించడానికి గురువారం తుది అనుమతులు మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement